బిడ్డకు తల్లే ఆధారం. కడుపులో ఉన్నప్పుడైనా, బయటపడ్డప్పుడైనా శిశువు అన్ని అవసరాలను తీర్చేది తల్లే. కాన్పు సమయంలో సుమారు 3 కిలోల బరువుండే బిడ్డ.. ఐదు నెలలు వచ్చేసరికి రెట్టింపు బరువు పెరుగుతుంది. ఈ సమయంలో శరీర భాగాలు, మెదడు, అవయవాలన్నీ శరవేగంగా వృద్ధి చెందుతుంటాయి. ఇందుకు తగిన పోషకాలన్నీ ఒక్క తల్లిపాలతోనే లభించటం విశేషం. అయినా కూడా ఎంతోమంది పిల్లలకు తల్లిపాల భాగ్యం అంతగా దక్కటం లేదు. మనలాంటి దేశాల్లో కేవలం 37% మంది పిల్లలే ఆరునెలల వరకు పూర్తిగా తల్లిపాలు తాగుతున్నారు. చనుబాల గొప్పతనం తెలియకపోవటమో, ఇచ్చే వెసులుబాటు లేకపోవటమో, బయటకు పనులకు వెళ్లటమో, రొమ్ముల బిగువు తగ్గుతుందని అనుకోవటమో.. కారణమేదైనా చాలామంది శిశువులు తల్లిపాలకు నోచుకోవటం లేదు. నిజానికి చనుబాలను శిశువుల ప్రత్యేకమైన ఔషధమని చెప్పుకోవచ్చు! వీటిని సరిగా ఇవ్వగలిగితే ప్రపంచవ్యాపంగా ఏటా 8.23 లక్షల మంది పిల్లలను ఐదేళ్ల లోపు మరణించకుండా చూసుకోవచ్చు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో సంభవిస్తున్న 20వేల మరణాలనూ నివారించుకోవచ్చు. తక్కువకాలం తల్లి పాలు తాగిన పిల్లలతో పోలిస్తే ఎక్కువకాలం తల్లిపాలు తాగిన పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు, మరణాల ముప్పు తగ్గటమే కాదు.. తెలివి తేటలూ ఎక్కువేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రయోజనాలు అప్పటికే పరిమితం కావటం లేదు. మున్ముందూ కొనసాగుతూ వస్తుండటం విశేషం. అంతేకాదు.. పెద్దయ్యాక అధిక బరువు, మధుమేహం ముప్పులూ తగ్గుముఖం పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిపాల వైశిష్ట్యాన్ని తెలుసుకోవటం, పూర్తికాలం ఇచ్చేలా చూసుకోవటం, ప్రోత్సహించటం అత్యవసరం.
ప్రత్యేకం..
తల్లిపాలలో 'హ్యూమన్ ఓలిగోసాక్రైడ్లు' అనే చక్కెరలు ఉంటాయి. పాలిచ్చే జంతువుల్లో వేటిల్లోనూ ఇవి ఉండవు. అంటే కేవలం తల్లిపాలకే ప్రత్యేకమన్నమాట. నిజానికి వీటిని శిశువులు జీర్ణం చేసుకోలేరు. అలాగని చెడ్డవేమీ కావు. పేగుల్లో హాని కారక బ్యాక్టీరియాను నిలువరించి.. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రోగనిరోధక ప్రతిస్పందనలనూ నేర్పిస్తాయి. ఇలా శిశువులు ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి.
సంపూర్ణ పోషణ!
తల్లిపాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలూ ఉంటాయి. పైగా తేలికగానూ జీర్ణమవుతాయి. గొప్ప విషయం ఏంటంటే- బిడ్డ అవసరాలకు అనుగుణంగా తల్లిపాలు మారుతూ వస్తుండటం. కాన్పయిన మొదటిరోజు నుంచి నాలుగు రోజుల వరకు వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రమ్) అమృతంతో సమానం. బిడ్డకు తొలి పోషణ, రక్షణ లభించేది వీటి నుంచే. 5-14 రోజుల్లో- వేగంగా పెరిగే శిశువు అవసరాలకు అనుగుణంగా పాలు మారిపోతాయి. ముర్రుపాల కన్నా కాస్త పలుచగా ఉన్నప్పటికీ.. మరింత శక్తినిస్తాయి. వీటిలో ల్యాక్టోజ్, కొవ్వులు దండిగా ఉంటాయి. రెండు వారాల సమయంలో పాలు పరిపక్వ దశకు చేరుకుంటాయి. ఇందులో 90% నీరు.. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు 8%.. ఖనిజాలు, విటమిన్లు 2% ఉంటాయి. ఇవన్నీ బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు సాయం చేస్తాయి.
తొలి గంటలోనే ఆరంభం
బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు మొదలెట్టాలి. ఈ సమయంలో వచ్చే ముర్రుపాలను ఒకరకంగా తొలి టీకా అనీ అనుకోవచ్చు. ఇందులో శిశువు ఎదుగుదలకు అత్యవసరమైన పోషకాలతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందించే యాంటీబాడీలూ ఉంటాయి. జీర్ణకోశ వ్యవస్థ వృద్ధి చెందటానికి, దాని పనితీరుకు ముర్రుపాలు తోడ్పడతాయి. తొలిగంటలో ఒక్క తల్లిపాలు పట్టటం ద్వారానే సుమారు 10 లక్షల శిశు మరణాలను నివారించుకోవచ్చు. సిజేరియన్ కాన్పు అయినా వీలైనంత త్వరగా తల్లిపాలు ఆరంభించాలి. ఏవైనా సమస్యలతో శిశువును ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చినా తల్లిపాలను పిండి ట్యూబ్ ద్వారానో, చెంచాతోనో తాగించటానికి ప్రయత్నించాలి.
ఇదీ చదవండి:సూపర్ మామ్: అభాగ్యుల కోసం తల్లి పాలు దానం
6 నెలల వరకూ తల్లిపాలే
ప్రేమతో, ఆప్యాయతతో ఇచ్చే తల్లిపాలకు సాటి వచ్చే ఆహారం మరోటి లేదు. ఆరు నెలలు నిండేంతవరకు తల్లిపాలు తప్ప మరేదీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లిపాలతోనే బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఆరు నెలల తర్వాత బిడ్డకు ఘనాహారం ఆరంభించాలి. అలాగని పాలు పట్టటం మానెయ్యరాదు. రెండేళ్ల వరకూ తల్లిపాలు కొనసాగించాలి. వీలైతే ఆ తర్వాత కూడా ఇవ్వచ్చు.
కడుపు నిండటానికే కాదు..