కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. దీంతో పిల్లలు, పెద్దలు ఇళ్లలోనే గడుపుతున్నారు. ఖాళీ సమయం దొరకటం వల్ల టీవీలు, చరవాణుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే.. ఇది మితిమీరితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు కంటి వైద్యులు. ఎక్కువ సేపు వాటిని అలాగే చూడటం వల్ల కళ్లు ఒత్తిడికి గురై.. కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
పెద్దలతో పాటు పిల్లలపైనా ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. లాక్డౌన్ వల్ల విద్యాసంస్థల బంద్‌తో చాలా మంది విద్యార్థులు ఆన్లైన్లో చదువుకుంటున్నారు. కంప్యూటర్ తెరను అలాగే చూడటం, వీడియో గేమ్స్ ఆడుతూ గడపడం వల్ల కంటికి ప్రమాదమని గుర్తుచేస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా కళ్లు ఎర్రబడటం, నొప్పి పుట్టడం, కళ్ల నుంచి నీరు కారటం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ సమస్యలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అవి...
- టీవీ, కంప్యూటర్ను చూసేటప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలి.
- పనిలో ఉన్నప్పుడు చాలా మంది కనురెప్పలను మూసి, తెరవటం చాలా తక్కువగా చేస్తుంటారు. దీని వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు కళ్లను మూయడం, తెరవడం లాంటివి చేస్తుండాలి.
- కంప్యూటర్ ముందు పని చేసే వాళ్లు తప్పని సరిగా 20-20-20 సూత్రాన్ని పాటించాలి. 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరాన్ని చూస్తూ 20 సెకన్లపాటు ఉండాలి.
- మీ కళ్లు పొడిబారినట్లు అనిపిస్తే.. తప్పనిసరిగా డాక్టర్ సలహాపై ఐడ్రాప్స్ ఉపయోగించాలి.
- కళ్లకు మేలు చేసే విటమిన్-ఎ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలను ఎక్కువగా తినాలి. దీని కోసం పండ్లు, బొప్పాయి, గుడ్లు, క్యారెట్, చేపలు, ఉప్పు వంటి వాటిని తీసుకోవాలి.
- చరవాణి, కంప్యూటర్లలో బ్రైట్నెస్ తగ్గించుకోవాలి.
- చరవాణి, కంప్యూటర్ను కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.
- మీకు ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తే వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలి.
పైన పేర్కొన్న 8 సూత్రాలను తూ.చ. తప్పకుండా పాటించటం ద్వారా కంటి సమస్యలను అధిగమించవచ్చని ప్రముఖ కంటి వైద్యులు డా. రాజీవ్ ముందాడా చెబుతున్నారు.