వాయు కాలుష్యంతో శ్వాస - గుండె - ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్లు.. అంతిమంగా అకాల మరణాలు సంభవిస్తున్నాయని దశాబ్దాలుగా అనేక పరిశోధనలు ఘోషించాయి. కలుషిత గాలితో కలిగే నష్టాల్లో ఇది ఒక పార్శ్వం మాత్రమే. ఇది శరీరమంతటా తన కోరలను చాస్తూ చివరికి మెదడులోకీ పాకుతున్నట్లు ఇటీవల అనేక పరిశోధనలు వెల్లడించాయి.
- వాయు కాలుష్యం తాకిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్య భావనలు పెరిగిపోతున్నాయి. వీటివల్ల బాధితుల రోజువారీ జీవితాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. భావోద్వేగ, సామాజిక అంశాలపరంగా ఇబ్బందులు పెరుగుతున్నాయి.
- బాధితుల ఆలోచన, ఏకాగ్రత, అప్రమత్తత, జ్ఞాపకశక్తి, మేధస్సుపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వారిలో అలసట, చికాకు పెరుగుతోంది.
- బాధితుల్లో సంతృప్తి స్థాయి తగ్గిపోతోంది. నలతకు గురయ్యామనే భావన పెరుగుతోంది.
- మెదడు ఎదుగుదల దశలో ఉన్న చిన్నారులపై ఈ ప్రభావం ఎక్కువ.
- వాయు కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లో మానసిక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య ఎక్కువని అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధనలో తేలింది.
ఇలా జరుగుతోంది..
కలుషిత గాలి పీల్చేవారి మెదడులో మార్పులు జరుగుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా భావోద్వేగాలను నియంత్రించే భాగాల్లో ఈ వైరుధ్యాలు ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. మెదడులో సంకేతాలను చేరవేసే న్యూరోట్రాన్స్‌మిటర్ల తీరుతెన్నుల్లో తేడాలొస్తున్నాయని వెల్లడించారు.
ప్రత్యక్షంగా..
వాహనాల నుంచి వచ్చే పొగలోని అత్యంత సూక్ష్మ రేణువులు, గాల్లోని ఇతర కాలుష్యకారకాలు.. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, నేరుగా మెదడులోకి చొరబడుతుంటాయి.
పరోక్షంగా..
గాల్లోని కాలుష్య రేణువుల వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ కలగొచ్చు. శరీరంలో రోగ నిరోధక స్పందనల తీరును మార్చేయవచ్చు. ఆ ప్రభావం అంతిమంగా మెదడుకూ పాకవచ్చు.
ఇలా చేయాలి..
వాయు కాలుష్యం ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఇప్పటికిప్పుడు ఉన్న ప్రాంతాల నుంచి వేరే చోటుకు తరలిపోవడం కుదరకపోవచ్చు. అలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కలుషిత గాలితో కలిగే మానసిక సమస్యలను తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కంగారొద్దు..
వాయు కాలుష్యంతో కలిగే నష్టాల గురించిన సమాచారాన్ని నిత్యం చదువుతూ అదేపనిగా హైరానా పడొద్దు. దీనివల్ల ఆదుర్దా, కుంగుబాటు మరింత పెరగొచ్చు. కలుషిత గాలి తీవ్ర సమస్య అని, దాన్ని అధిగమించాలని మనకు తెలిసుంటే చాలు.