కొలెస్ట్రాల్ ఎక్కువుందని డాక్టర్ చెప్పారా? అయితే ఆహార, విహారాల్లో మార్పులు చేసు కోవాల్సిందే. కొలెస్ట్రాల్ తగ్గటానికి మందులు వేసుకుంటున్నా కూడా వీటిని పాటించాల్సిందే.
మంచీ చెడూ:మన శరీరానికి కొలెస్ట్రాల్ అత్యవసరం. మితిమీరితేనే.. ముఖ్యంగా చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ఎక్కువైతేనే ప్రమాదం. దీంతో గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువవుతుంది. అదే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) రక్తంలోంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించటానికి తోడ్పడుతుంది.
బరువు అదుపు:శరీర బరువు పెరుగుతున్న కొద్దీ కొలెస్ట్రాల్ స్థాయులూ పెరిగే ప్రమాదముంది. అధిక రక్తపోటు, మధుమేహం ముప్పులూ ఎక్కువ అవుతాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవటం.. ముఖ్యంగా బొజ్జ తగ్గించుకోవటం ఎంతైనా అవసరం. దీంతో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటం సహా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
చేపల మేలు: చేపల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్లనే కొవ్వు, మొత్తం కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని నివారిస్తాయి. కాబట్టి కొవ్వుతో కూడిన సాల్మన్, టూనా, సార్‌డైన్ వంటి చేపలను తరచూ తినటం మంచిది. వీటిని కూరగానో, ఉడికించో తినాలి గానీ నూనెలో వేయించటం సరికాదు.
పొట్టుతీయని ధాన్యాల తోడు:రోజూ ఉదయం అల్పాహారంగా దంపుడు బియ్యం, సజ్జలు, జొన్నలు, ఓట్స్ వంటి పొట్టుతీయని ధాన్యాలతో చేసిన పదార్థాలు తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. మధ్యాహ్నం తక్కువ తినేలా చేస్తాయి.