Ear Infection Symptoms in Telugu :మానవ శరీరంలోని అన్ని భాగాలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో భాగం ఒక నిర్ణీతమైన పని చేస్తుంది. చెవులు మనకు వినడానికి పనికి వస్తాయి. చెవుల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే రకరకాల ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. చెవి నొప్పి వస్తే కలిగే బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వారికే అర్థమవుతుంది. చెవి నొప్పి ఎన్ని రకాలు, ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
చెవికి వచ్చే ఇన్ఫెక్షన్స్ రకాలు
Ear Infection Types in Telugu :చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లను వైద్య పరిభాషలో 'అక్యూట్ ఓటీటీస్ మీడియా' అని అంటారు. చెవి నొప్పి ఎక్కువ రోజులు ఉందంటే అది ఇన్ఫెక్షన్గా భావించాలి. మరి గుర్తించడం ఎలా అనుకుంటున్నారా? చెవిలో ఏదో భారంగా అనిపించడం... నీరు, చీము, రక్తం కారడం.. నొప్పిగా ఉండడం.. చెవి ఇన్ఫెక్షన్ లక్షణాలు. చెవికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నొప్పి కారణంగా నిద్ర పట్టదు. సాధారణంగా మధ్య చెవికి వచ్చే ఇన్ఫెక్షన్లకు.. బ్యాక్టీరియా, వైరస్ కారణం.
ఇన్ఫెక్షన్లకు కారణాలు ఏంటి?
చెవి మధ్య భాగంలో నీరు పేరుకుపోవడం, జలుబు, ఫ్లూ కారణంగా కూడా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. తీవ్రమైన జలుబు కారణంగా చాలామందికి ఒక్కోసారి ముక్కు మూసుకుపోతుంది. అప్పుడు కూడా చెవి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు చలికాలంలో ఎక్కువమందికి వస్తుంది. అందువల్ల చెవి ఇన్ఫెక్షన్స్ కూడా చలికాలంలోనే ఎక్కువ.
చెవిలో ఇన్ఫెక్షన్స్ ఎక్కడ, ఎందుకు వస్తాయి?
చెవిలో మూడు భాగాలు ఉంటాయి. బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. ఈ మూడు భాగాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కడైనా రావొచ్చు. బయటి చెవిలో సాధారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. మధ్య చెవిలో కూడా ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో ఎక్కువ వస్తాయి. ఇక లోపలి చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్కు.. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ కారణం అవుతాయి. ఇది తీవ్రమైన సమస్య అని చెప్పవచ్చు. ఎందుకంటే లోపలి చెవికి దగ్గరగా మెదడు భాగాలు ఉంటాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
Ear Infection Precautions in Telugu :చెవి ఇన్ఫెక్షన్లు సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లకు ప్రమాదం కలిగించవచ్చు. ఇందుకోసం కొన్ని వారాలపాటు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఐవీ ఫ్లూయిడ్స్, ఓరల్ మెడిసిన్ ద్వారా వైద్యులు నయం చేస్తారు. చిన్నపిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్లు ప్రమాదకరం. చిన్నపిల్లలు పడుకొని పాల పీక ద్వారా పాలు తాగితే చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. చిన్నపిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు.. ఏడాది పాటు తల్లిపాలు మాత్రమే అందించాలి. తల్లిపాలు అందుబాటులో లేని పక్షంలో డబ్బా పాలను కూర్చుని తాగేలా జాగ్రత్త వహించాలి. పిల్లలు ఉండే గదిలో తాజాగా గాలి ఆడేలా చూసుకోవాలి.