కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, పిండి పదార్థాలు, నూనెలు, కొవ్వులతో కూడిన పోషకాహారం తగినంత తింటే చాలు. చాలామందికి దీంతోనే అవసరమైన పోషకాలు లభిస్తాయి. కానీ కొందరికి అదనంగా పోషకాల మాత్రలు అవసరమవుతాయి. ఇది ఆయా వ్యక్తుల ఆరోగ్యం, వయసు, ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. విటమిన్ మాత్రలతో జబ్బులు నయమవుతాయని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి వీటి ఉద్దేశం- ఆహారం ద్వారా లభించని పోషకాలను భర్తీ చేయటమే.
ఎవరికి కావాలి?
మన శరీరానికి పోషకాల అవసరం, వీటి మోతాదుల విషయంలో వయసు చాలా కీలకం. ఉదాహరణకు- వయసు మీద పడుతున్నకొద్దీ కొన్ని రకాల పోషకాలను గ్రహించుకునే సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. అందుకే వృద్ధులు విటమిన్ డి, విటమిన్ బి12, క్యాల్షియం వంటి విటమిన్లు, పోషకాలను అదనంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు తిననివారికీ ఇవి అవసరం. విటమిన్ బి12 మాంసాహారంతోనే లభిస్తుంది. కాబట్టి శాకాహారులకు దీని లోపం తలెత్తకుండా మాత్రలు, సిరప్‌లు సూచిస్తుంటారు. గర్భిణులకు, గర్భధారణకు ప్రయత్నిస్తున్నవారికి ఫోలిక్ యాసిడ్ అవసరం. ఇది పుట్టబోయే పిల్లల్లో నాడీ లోపాల సమస్యల నివారణకు తోడ్పడుతుంది. శిశువులకు తల్లిపాలతోనే తగినంత విటమిన్ డి లభించదు. అందువల్ల అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది. గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, కొన్ని స్వీయ రోగనిరోధక సమస్యల వంటి జబ్బులతో బాధపడేవారికి అదనంగా పోషకాలు అవసరమవుతాయి. ఎవరికి ఎలాంటి పోషకాలు, ఎంత మోతాదులో కావాలనేది ఊహించటం కష్టం. దుకాణంలో దొరుకుతున్నాయని ఎవరికివారు కొనుక్కొని వేసుకోవటం తగదు. డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన పోషకాలను, తగు మోతాదులో తీసుకోవటం మంచిది. రక్త పరీక్షల ద్వారా ఏయే పోషకాలు లోపించాయో తెలుసుకోవచ్చు.
కీడు చేయకపోవటం ముఖ్యం