Vastu Reason For Childless Couples : వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందాల్సిన సంతోషాల్లో సంతానమూ ఒకటి. ఇది దంపతుల ఇద్దరికీ ఓ వరం లాంటిది. పెళ్లైన తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని పరితపిస్తూ ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల కొందరికి సంతానం కలగడంలో ఆలస్యం అవుతుంది. మరికొందరిలో అయితే జీవితాంతం ఇది తీరని కోరికలాగే మిగిలిపోతుంది. అలా సంతానం కలగని కొందరు తమ కర్మ ఇంతేనేమో అని సరిపెట్టుకుంటూ జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అయితే వాస్తు లాంటివి నమ్మే మరికొందరు మాత్రం వాటి దోషాల వల్లే తమకు పిల్లలు కలగట్లేదని అనుకుంటారు. వాస్తు దోషం ఉంటే నిజంగానే పిల్లలు కలగరా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియాలోనే ఎక్కువ!
భారత్లో సుమారు 2.75 కోట్ల జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాయని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. పిల్లలు పుట్టకపోవడాన్ని అవకాశంగా తీసుకొని ఐవీఎఫ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చుతున్న మహిళలు ప్రపంచంలో అమెరికా తర్వాత మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. అయితే కొన్నిసార్లు ఈ ప్రక్రియ కూడా విఫలమవుతుండటం గమనార్హం. మహిళల్లో సంతానలేమి సమస్యలకు జీవనశైలిలో మార్పులు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.
వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడం వల్ల కొందరు ఏవేవో అపోహలను నమ్ముతుంటారు. సంతానం కలగకపోవడానికి ఇంట్లో వాస్తు దోషం ఒక కారణమని విశ్వసించేవాళ్లూ ఉన్నారు. వాస్తు శాస్త్రంలో దీనికి కొన్ని పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే పిల్లలు పుడతారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. వాస్తు దోషాలు లేదా ఇతరత్రా నమ్మకాలను పక్కనపెట్టి సైన్స్ ప్రకారం మూలకారణాన్ని గుర్తించి, వైద్యం చేయించుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.