Blood pressure: గుండె కండర సంకోచవ్యాకోచాల వల్ల రక్తం.. రక్తనాళాల గోడలమీద కలిగించే పీడనమే బీపీ. రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు, యాంటీబాడీలు, హార్మోన్లు శరీరంలోని అన్ని భాగాలకూ అందాలంటే ప్రతి ఒక్కరికీ ఈ బీపీ అవసరం. గుండె సంకోచించినప్పుడు రక్తం ఒక్కసారిగా రక్తనాళాల్లోకి ప్రవహించి, వాటి గోడలమీద కలిగించే అత్యధిక పీడనాన్నే సిస్టాలిక్ ప్రెషర్(120 ఎంఎంహెచ్‌జి)గా చెబుతారు. గుండె వ్యాకోచించినప్పుడు రక్తనాళాల గోడలమీద కలిగించే అత్యల్ప పీడనాన్నే డయాస్టాలిక్(80 ఎంఎంహెచ్‌జి) అంటారు. అందుకే 120/80 సంఖ్యను సాధారణ బీపీగా చెబుతారు. దీనికన్నా ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
బీపీ అనేది సహజంగానే నిమిషనిమిషానికీ గంట గంటకీ మారుతుంటుంది. రాత్రీపగలుకీ కూడా తేడా ఉంటుంది. కాబట్టి దాన్ని వేర్వేరు రోజుల్లో కనీసం రెండుమూడుసార్లయినా పరీక్షించి నిర్ధరించుకోవాలి. 120-129/80 ఉంటే ఒక మాదిరి రక్తపోటు అనీ, 130/80 నుంచి 139/89వరకూ ఉంటే ఒకటో దశ అనీ, 140/90, అంతకన్నా ఎక్కువ ఉంటే రెండో దశ అనీ, 180/120 దాటితే ఉద్ధృత దశ అనీ పరిగణిస్తారు. అది పెరిగే వేగాన్ని బట్టి హృద్రోగాలు, మూత్రపిండాలు దెబ్బతినడం, కంటిచూపు తగ్గడం... ఇలా అనేక సమస్యలు వస్తాయి. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే నిశ్శబ్ద మరణానికి దారితీస్తుంది.
గుర్తించేదెలా?:తరచూ తల తిరుగుతుంటేనో తలనొప్పిగా అనిపిస్తేనో బీపీ అనుకుంటారు. కానీ అందరిలోనూ బీపీ లక్షణాలు పైకి కనిపించవు. కొందరిలో మాత్రమే తల తిరగడం, తలనొప్పి, నిస్సత్తువ, కళ్లు తిరగడం, తికమక, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం, మూత్రంలో రక్తం పడటం, ఛాతీమీదా, మెడమీదా ఎవరో సమ్మెతో కొడుతున్నట్లు ఉండటం... వంటివి కనిపిస్తుంటాయి. కాబట్టి ముప్ఫై దాటిన దగ్గర్నుంచీ ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి.
కారణాలేంటి?:వేగంగా మారుతున్న జీవనశైలి, పెరిగే వయసు, వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడి, ఆనువంశికత, అధిక బరువు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, ధూమపానం, శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి... ఇవన్నీ అధిక రక్తపోటుకి కారణాలే. దీర్ఘకాలంపాటు ఒత్తిడికి గురవడమే బీపీకి ప్రధాన కారణం. దీనికి తోడు టీ, కాఫీ, శీతలపానీయాలు, ప్రాసెస్డ్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి రక్తనాళాలు మందంగా మారడం వల్లా బీపీ పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం. దీర్ఘకాలిక మలబద్ధకం వంటివీ అధిక రక్తపోటుకు కారణమవుతున్నాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నా బీపీ రావచ్చు. అవి రెనిన్ అనే రసాయనాన్ని ఎక్కువగా స్రవిస్తే శరీరంలో ఉప్పు ఎక్కువగా పేరుకుపోవడంతో బీపీ పెరిగిపోతుంది. అల్లోపతీ వైద్యవిధానంలో బీపీ పెరగకుండా అణిచి ఉంచేందుకే మందులు ఇస్తారు. కానీ అందుకు దారితీసిన కారణం గ్రహించలేరు. అందుకే బీపీ రావడానికి గల మూల కారణాన్ని గుర్తించి దాన్ని నివారించేందుకు చికిత్స చేయడం ద్వారా వ్యాధిని తగ్గిస్తుంది సుఖీభవ.