మిసెంటెరిక్ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్లే..
కరోనా వైరస్ ప్రభావం, అది కలిగించే ఇన్‌ఫ్లమేషన్ వల్ల రక్తనాళాల లోపలి గోడలకు రక్షణగా ఉండే సున్నితమైన పొర ఎండోథీలియం దెబ్బతింటోంది. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడుతున్నాయి. ప్రాథమిక దశలో గుర్తిస్తే మందుల ద్వారా, శస్త్రచికిత్స ద్వారా రక్తపు గడ్డలు తొలగించొచ్చు. అలక్ష్యం చేస్తే సమస్య ముదిరి... కాలికి రక్తసరఫరా చేసే నాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడితే, గాంగ్రిన్‌కు దారితీస్తోంది. కొన్ని సందర్భాల్లో అంతవరకూ కాలు తొలగించాల్సి వస్తోంది. గుండెలోని కండరాలకు రక్తం సరఫరా చేసే సూక్ష్మనాళాల్లో గడ్డలు ఏర్పడితే గుండె పనితీరు దెబ్బతినడం, గుండెకు రక్తం వెళ్లే ప్రధాన రక్తనాళాల్లో రక్తపు గడ్డలు వస్తే గుండెపోటు సంభవిస్తున్నాయి. పేగులకు రక్త సరఫరా జరిగే ధమనుల్ని మిసెంటెరిక్ రక్తనాళాలు అంటారు. కరోనా ప్రభావంతో వీటిలో రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల చిన్న పేగులకు అవసరమైనంత రక్త సరఫరా జరగదు. దీన్ని మిసెంటెరిక్ ఆర్టెరీ థ్రాంబోసిస్ అంటారు.
కుళ్లిపోయిన పేగు భాగం తొలగించాలి
కరోనాతో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల చిన్న పేగులకు పాక్షికంగా రక్తసరఫరా నిలిచిపోవడాన్ని మిసెంటెరిక్ ఇస్కీమియా అంటారు. రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోతే... అంత మేర పేగు కుళ్లిపోతుంది. దాన్ని ‘గ్యాంగ్రిన్ ఆఫ్ ద బవెల్’గా పిలుస్తారు. మిసెంటెరిక్ ఇస్కీమియాను కొంతవరకూ మందులతో నయం చేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరికి యాంజియోప్లాస్టీ, శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. గాంగ్రిన్ ఏర్పడి పేగు కుళ్లిపోతే... శస్త్రచికిత్స చేసి కుళ్లిపోయిన మేర పేగు భాగాన్ని తొలగించి, రెండు కొసల్ని కలిపి కుట్టేస్తారు. చిన్న పేగులు ఏడు మీటర్ల వరకు పొడవు ఉంటాయి. దానిలో కొంత తొలగించినా సమస్యేమీ ఉండకపోవచ్చు. సాధారణంగా పెద్ద పేగు కంటే, చిన్న పేగులోనే గాంగ్రిన్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ. కరోనా వల్ల ఇతర అవయవాల్లో ఏర్పడుతున్న గాంగ్రిన్‌తో పోలిస్తే చిన్న పేగుల్లో మిసెంటెరిక్ ఇస్కీమియా, గాంగ్రిన్ ఏర్పడటం కొంత అరుదుగానే ఉంది. అలాగని ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. సమస్య లక్షణాలేంటో తెలుసుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం.