ముంబయికి చెందిన ఓ ఫ్యామిలీ ఫిజీషియన్ లాఫింగ్ థెరపీని ఆధారంగా చేసుకొని 1995లో ఈ లాఫ్టర్ యోగా పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చారు. పేరుకు తగినట్లుగానే నవ్వుతూ వివిధ యోగాసనాలు చేయడమే దీని ముఖ్యోద్దేశం. కొంతమంది వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి లేదంటే వర్క్‌షాపుల్లో/శిక్షణ తరగతుల్లో ఇన్‌స్ట్రక్టర్ చెప్పినట్లు ఉద్దేశపూర్వకంగా నవ్వుతూ సరదాగా కొన్ని ఆసనాలు చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి యోగా సెషన్స్ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, ‘హొ-హొ’ లేదా ‘హ-హ-హ’.. అనే శబ్దం వచ్చేలా నవ్వుతూనే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా వివిధ రకాల యోగాసనాలు, శ్వాస సంబంధిత వ్యాయామాలు, ధ్యానం.. వంటివి నేర్పిస్తారు. అయితే ఇది సరదాగా చేసే యోగా ప్రక్రియే అయినప్పటికీ సొంతంగా కాకుండా నిపుణుల సలహా మేరకు చేస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు.. అలాగే ఆసనాల వల్ల శరీరంపై గాయాలు కాకుండా జాగ్రత్తపడచ్చు.
* ఈ యోగా పద్ధతి అన్ని శరీర అవయవాలకు చక్కటి మసాజ్‌లా పని చేస్తుందంటున్నారు నిపుణులు.
* లాఫ్టర్ యోగా చేసే క్రమంలో ఎక్కువసార్లు గాలి పీల్చుతూ, వదులుతూ ఉంటాం. ఈ క్రమంలో శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది.
* నవ్వడం వల్ల రక్తనాళాలు కాస్త పెద్దవవుతాయి. తద్వారా రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* ఎంత నవ్వితే నొప్పిని భరించే శక్తి అంతగా పెరుగుతుందని ఓ అధ్యయనంలో రుజువైంది. నవ్వే క్రమంలో న్యాచురల్ పెయిన్ కిల్లర్స్‌గా భావించే ఎండార్ఫిన్లు మన శరీరంలో విడుదలవడమే కారణం!