వైరస్ ఏదైనా దాన్ని ఎదుర్కోవాలంటే మనలో రోగ నిరోధక శక్తి కీలకం. కరోనా వ్యాప్తి వేళ ఇది మరింత అవసరం. అందుకోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు సూచనలు చేసింది. లాక్‌డౌన్ వేళ అందరూ ఈ సూచనలు పాటించాలని ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చారు.
సాధారణ జాగ్రత్తలు
నిత్యం కనీసం అర గంట పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి.
రోజంతా గోరువెచ్చని నీటినే తాగాలి.
మీ వంటకాలలో పసుపు, జీలకర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఉండేలా చూడండి.
ఆయుర్వేద శక్తి కోసం..
ఉదయాన్నే ఓ టీ స్పూన్ చవన్‌ప్రాష్ (10 గ్రాములు) తీసుకోండి. మధుమేహం ఉన్నవారైతే షుగర్ ఫ్రీ చవన్‌ప్రాష్ వాడాలి.
తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి, ఎండుద్రాక్ష(కిస్‌మిస్)తో చేసిన టీ రోజుకు ఒకట్రెండు సార్లు తాగండి. కావాలంటే బెల్లం, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
150 మిల్లీలీటర్ల వేడి పాలలో అర చెంచా పసుపు వేసుకొని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి.