నేత్రదానం చేసేందుకు ఇప్పటకీ చాలా మంది ముందడుగు వేయడం లేదు. అంతగా భయపడిపోవడానికి నేత్రదానం అంటే బతికుండగానే కళ్లు తీసి ఇవ్వడమేమీ కాదు కదా! తనువు చాలించాక, శరీరంతో పాటు కళ్లు చితిలో కాలిపోతాయి. లేదా మట్టిలో కలిసిపోతాయి. ఎంతో అమూల్యమైన నేత్రాలు అలా బూడిదలో కలిసిపోకుండా.. ఆ కళ్లను తీసుకుని అవసరమైనవారికి అందించమని వైద్యులకు ముందుగానే అనుమతివ్వడం నేత్రదానం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. కంటిశుక్లాలు, గ్లాకోమా లోపాలు, కార్నియల్ వ్యాధులే అంధత్వానికి ప్రధాన కారణాలు. అలాంటి వారికి మరొకరు నేత్రదానం చేస్తే వారు తిరిగి ఈ ప్రపంచాన్ని చూడగలరు. భారతదేశంలో, సుమారు 3మిలియన్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వీరిలో 12 సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులే అధికం. అందుకే, నేత్రదానం ప్రాధాన్యతను తెలియజేస్తూ.. ఏటా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 మధ్య జాతీయ నేత్రదాన పక్షదినోత్సవాలు జరుపుకుంటున్నాం.
ఎవరు దానం చేయాలి.. ?
- కుల, మత, జాతి, రక్త గ్రూపు వంటి భేదాలు లేవు. ఆరోగ్యంగా ఉండి సాయం చేయాలన్న మనసున్నవారైతే చాలు. నేత్రదానానికి అన్ని వయసుల వారు అర్హులే.
- కంటి ఆపరేషన్ జరిగినవారు, కంటి చూపు లోపాలున్నవారు కూడా నేత్రదానం చేయొచ్చు.
- మధుమేహం, బీపీ, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కూడా కళ్లు దానం చేసేందుకు అర్హులే. అయితే, అవి అంటువ్యాధులై ఉండకూడదు.
అనర్హులు...
- ఎయిడ్స్ సోకినవారు.. కలరా, హెపటైటిస్ బి లేదా సి, రేబిస్, టెటానస్, అక్యూట్ లుకేమియా, సెప్టిసిమియా, మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ బారినపడిన లేదా మరణించిన వ్యక్తులు నేత్రదానం చేయకూడదు.
ఎలా చేయాలి..?
- ఐ బ్యాంక్, పెద్ద ఆసుపత్రుల్లో ఓ ఫార్మ్ నింపి నయనాలు దానం చేయొచ్చు. లేదా https://www.ebai.org/donator-registration/ ఈ లింక్స్‌పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.
- అయితే, ఇందుకు కుటుంబసభ్యుల అనుమతి అవసరం. మరణానంతరం వైద్యులకు సమాచారమిచ్చి కళ్లు తీసుకెళ్లేందుకు అనుమతివ్వాల్సింది వారే కాబట్టి.. తప్పనిసరి! అయితే, ఎవరి అనుమతి అక్కర్లేదు అనుకునేవారికి ఓ కార్డు అందిస్తారు.
- అధికారికంగా ఓ వ్యక్తి నేత్రదానం చేసేందుకు అంగీకరించకపోయినా.. ఆ వ్యక్తి మరణించాక కుటుంబసభ్యులెవరైనా మృతదేహం నుంచి కళ్లు దానం చేసేందుకు సమాచారమివ్వొచ్చు.
- దాత మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే 1919 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారమివ్వొచ్చు. ఈ నంబరు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.
జాగ్రత్తలు..
నేత్రదానానికి సంతకం చేసిన దాత మరణించాక కుటుంబ సభ్యులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరణాంతరం వైద్యులు వచ్చేవరకు నయనాలు పాడవ్వకుండా ఉంటాయి..
- మరణించిన వ్యక్తి కను రెప్పలు మూసేయాలి.
- ఫ్యాన్ గాలి కాకుండా చల్లటి కూలర్ లేదా ఏసీలో మృతదేహాన్ని ఉంచాలి.
- మృతుడి తలను తలగడపై పెట్టి.. కళ్ల మీద తడి బట్ట కప్పాలి.
- దాత మరణించిన 6-8 గంటల లోపు కళ్లను వేరు చేస్తేనే ఆ కళ్లు మరొకరికి ఉపయోగపడుతాయి.
- ఈ ప్రక్రియ ఆసుపత్రిలోనే కాదు దాత ఇంట్లో కూడా చేయొచ్చు.
- పూర్తి శిక్షణ పొందిన వైద్యులు కేవలం 10-15 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు.
- పైగా కంటిలోని ఓ పొరను మాత్రమే వైద్యులు సేకరిస్తారు. పూర్తి కనుగుడ్లు తీసేయరు. కాబట్టి కళ్లు పీకేశాక ముఖం భయంకరంగా మారుతుందనే అనుమానం అక్కర్లేదు.
- నేత్ర దాతలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు గోప్యంగా ఉంచుతారు వైద్యులు.
- నేత్రదానం చేయడానికి రూపాయి కూడా ఖర్చు ఉండదు.
- నయన దానం పూర్తయ్యాక.. ఆ కనులు సరిపోయేవారికి(అవసరమైనవారు) సమాచారమిస్తారు. ఆపై ఆ కళ్లను వారికి అమర్చుతారు.
నేత్రదానంపై ఉన్న మూఢనమ్మకాలను వీడి.. వాస్తవాలను తెలుసుకుని వ్యవహరించాల్సిన తరుణమిది. మన రెండు కళ్లు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతాయి. మరణించాక కూడా కళ్లు జీవించాలంటే.. ఈ అందమైన లోకాన్ని చూసి మురవాలంటే.. నయన దానం తప్పనిసరి.
ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?