మన శరీరంలో ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం మన ఆరోగ్యం మీద ఉంటుంది. మనలో చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు కొందరికి కూల్ డ్రింక్ తాగినా లేదంటే ఐస్ క్రీం తిన్నా తలనొప్పి మొదలవుతుంటుంది. నిజానికి అంతకుముందు వరకు వాళ్లకు తలనొప్పి లేకపోయినా తమ శరీరానికి తగని ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది మొదలవుతుంది.
చాలామంది తమ పనులు చేసుకుంటున్న క్రమంలో మైకం కమ్మిన భావనను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వర్కవుట్ చేయడం, తగిన పోషకాహారం తినకపోవడం, బ్లడ్ ప్రెషర్ తగ్గడం, తగినంత నీరు లేకపోవడం, శరీరం వేడెక్కడం లాంటి ఇతర కారణాల వల్ల మైకం కమ్మడం లేదంటే తల తిరగడం, కళ్లు తిరగడం జరుగుతుంటాయి. ఈ కారణాల గురించి మరింత తెలుసుకుందాం.
వర్కవుట్ కారణం కావచ్చు:
చాలామంది అథ్లెట్లు ఎక్కువగా వర్కవుట్ చేస్తుంటారు. వారి కెరీర్ కోసం వాళ్లు అలా చేస్తుండగా దీని వల్ల గుండె పనితీరులో మార్పు వస్తుంది. ఈ సమయంలో గుండె బలంగా మారి తక్కువ హృదయ స్పందనల్లో ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తోంది. గుండె బలపడటం వల్ల ఇలా జరగ్గా వర్కవుట్ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో గుండెకు ఒక్కసారిగా విశ్రాంతి లభించడం వల్ల మైకం కమ్మిన భావన కలుగుతుంటుంది.
తగినంత తినకపోవడం కారణం కావచ్చు:
కొంతమంది రకరకాల కారణాల వల్ల తగినంత ఆహారాన్ని తినకుండా.. జ్యూస్‌లతో కాలం వెల్లదీస్తుంటారు. దీని వల్ల శరీరంలో చక్కెరల స్థాయి పడిపోయి మైకం కమ్మినట్లు అనిపిస్తుంటుంది. కాబట్టి భోజనాన్ని మిస్ కాకుండా చూసుకోవడమే కాకుండా స్నాక్స్ కూడా తీసుకోవడం ఉత్తమం.