Digestion problem solution: మన జీర్ణాశయం అద్భుతమైన అవయవం. తిన్న ఆహారాన్ని పోషకాలుగా, శక్తిగా మలుస్తుంది. ఇలా శరీరం సక్రమంగా, ఆరోగ్యంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. చూడటానికి జీర్ణాశయం ఒక సంచిలా కనిపిస్తుంది గానీ దీనిలోని భాగాలు, వీటి పనితీరు పరిశోధకులకు ఇప్పటికీ పెద్ద రహస్యంగానే మిగిలిపోయాయి. మనం తిన్న ఆహారం జీర్ణాశయంలోకి ప్రవేశించగానే పోషకాలను వెలికి తీస్తూనే దాన్ని తీయటానికి పేగుల్లోకి నెట్టటానికి వివిధ రకాల జీవ ప్రక్రియలు మొదలవుతాయి. జీర్ణాశయ కండరం మూడు పొరలుగా ఉంటుంది. ఇవి లయబద్ధంగా సంకోచించటం వల్లనే ఆహారం ముందుకు కదులుతుంది. అయితే ఈ కండరాలు ఒక సమన్వయంతో ఎలా సంకోచిస్తాయి? ఇది దెబ్బతింటే ఏమవుతుంది? సరిచేసే మార్గమేదైనా ఉందా? యూనివర్సిటీ ఆఫ్ ఆక్‌లాండ్ పరిశోధకులు వీటి మీదే నిశితంగా దృష్టి సారించారు. జీర్ణాశయ కండరాల కదలికలను దీనిలోని జీవవిద్యుత్తు ప్రక్రియ నియంత్రిస్తుంటుంది. బలహీనమైనదే అయినా ఇది కూడా గుండె లయను నియంత్రించే వ్యవస్థ మాదిరిగానే పనిచేస్తుంది. మరి గుండె లయను కొలిచినట్టుగా జీర్ణాశయ కండరాల్లోని జీవ విద్యుత్తును కొలవగలిగితే? జీర్ణాశయానికి సంబంధించిన జబ్బుల తీరుతెన్నులను తెలుసుకునే అవకాశం లేకపోలేదు.
కొత్త ఆశా కిరణం
రోజురోజుకీ మన జీవనశైలి మారిపోతోంది. శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీంతో అజీర్ణం, ముద్ద ముందుకు కదలకపోవటం వంటి జీర్ణ సమస్యలూ పెరిగిపోతున్నాయి. వీటితో సతమతమవుతూ డాక్టర్ల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారు ఎందరో. దురదృష్టమేంటంటే- కొన్నిసార్లు ఎన్ని చికిత్సలు తీసుకున్నా సమస్యలు తగ్గకపోవటం. అప్పుడు జీర్ణాశయంలోకి గొట్టాన్ని పంపించి చేసే ఎండోస్కోపీ పరీక్ష చేయాల్సి వస్తుంది. అయినా కూడా సుమారు సగం మందిలో ఎలాంటి సమస్యా బయటపడదు. ఇది అటు డాక్టర్లను, ఇటు రోగులను నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది. సింటిగ్రటీ, ఎంఆర్‌ఐ వంటి అధునాతన పరీక్షలు అందుబాటులో ఉన్నాయి గానీ వీటికి ఎక్కువ ఖర్చవుతుంది. మరి జీర్ణాశయ సమస్యలను కచ్చితంగా గుర్తించటానికి తేలికైన, చవకైన మంచి మార్గమేదైనా ఉందా? ఇక్కడే జీర్ణాశయ సంకోచాలను నియంత్రించే జీవవిద్యుత్తు తీరుతెన్నులను గుర్తించే పద్ధతి ఆశా కిరణంగా కనిపిస్తోంది.
జీర్ణాశయ పేస్‌మేకర్లు