ఆరోగ్యమే మహా భాగ్యం. దీన్ని ఎవరికి వారు కాపాడుకోవాల్సిందే. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాల్సిందే. కానీ కొందరు జబ్బు లక్షణాలు కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. 'ఆ ఏమవుతుందిలే' అని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. మరికొందరు చిన్న చిన్న విషయాలకే డాక్టర్ల దగ్గరికి, అదీ స్పెషలిస్టుల దగ్గరికి పరుగెత్తుకొని వెళ్తుంటారు. ఇది ఆయా వ్యక్తుల ఆలోచనా ధోరణి, ఆర్థిక స్థితిగతులు.. డాక్టర్లు, ఆసుపత్రుల అందుబాటు వంటి వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. మరోవైపు జనాభాతో పోలిస్తే మనదేశంలో వైద్యుల సంఖ్య తక్కువ.
దీంతో కొన్నిసార్లు.. ముఖ్యంగా రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయాల్లో సమగ్రంగా చర్చించి, క్షుణ్నంగా పరిశీలించే సమయం దొరక్కపోవచ్చు. ఇన్ని వ్యత్యాసాలు, వైవిధ్యాలతో కూడిన మనదేశంలో కొన్నిసార్లు జబ్బు లక్షణాలను విస్మరించే అవకాశం లేకపోలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇలాంటిది చూస్తూనే ఉంటాం. దీంతో కొందరికి జబ్బు ముదిరి, తీవ్రం కావొచ్చు. తగు చికిత్స అందకపోతే ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. కాబట్టి వీటిపై అవగాహన కలిగుండటం ఎవరికైనా మంచిదే.
ఛాతీ మంటా? గుండె నొప్పా?
'కొద్దిరోజులుగా తిన్నది సరిగా జీర్ణం కావటం లేదు. ఛాతీలో మంటగా ఉంటోంది. కుదురుగా ఉండలేకపోతున్నా' అని బాధపడిపోతుంటారు. ఇవి అజీర్ణం, ఛాతీ మంట (అసిడిటీ) లక్షణాలే కావొచ్చు. అలాగని పూర్తిగా దానికే పరిమితం కావు. గుండెపోటుతోనూ ఇవి తలెత్తొచ్చు. మనదేశంలో చాలామంది విస్మరిస్తున్న లక్షణాలివి. గుండెనొప్పిని అసిడిటీ, గ్యాస్‌గా పొరపడుతూ తాత్సారం చేస్తుంటారు. ఛాతీ మంట తగ్గించే మందులు వాడుతుంటారు. ఏవేవో పొడులు నీటిలో కలుపుకొని తాగుతుంటారు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు.
గుండెపోటులో అన్నిసార్లూ ఛాతీలోనే నొప్పి రావాలనేమీ లేదు. ఇది కొన్నిసార్లు కడుపునొప్పి రూపంలోనూ బయటపడుతుంది. గుండెకు, అన్నవాహికకు, కడుపు భాగానికి ఒకే నాడి సంకేతాలను ప్రసారం చేస్తుంటుంది. అందుకే గుండెపోటు అసిడిటీలా కనిపించొచ్చు, అసిడిటీ గుండెపోటు మాదిరిగా కనిపించొచ్చు. వీటి మధ్య తేడాను గుర్తించటం కష్టం. పరీక్షలతోనే నిర్ధరించటం సాధ్యమవుతుంది. కొందరికి సుష్టుగా భోజనం చేసిన తర్వాత గుండెనొప్పి రావొచ్చు. భోజనం చేశాక కడుపులోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో గుండె మీద భారం పెరిగి, నొప్పికి దారితీస్తుంది. దీన్ని అసిడిటీగా భావించటం తగదు. అసిడిటీ అయితే మంచిదే. అంత ప్రమాదమేమీ లేదు.
కానీ గుండెపోటును విస్మరిస్తేనే ప్రమాదం. కడుపులో.. ముఖ్యంగా ఛాతీ, బొడ్డు మధ్యభాగంలో నొప్పి వస్తే నిర్లక్ష్యం తగదు. నడుస్తున్నప్పుడు, భోజనం చేశాక నొప్పి ఎక్కువవుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయరాదు. మధుమేహం, అధిక రక్తపోటు గలవారికి, 30 ఏళ్లు పైబడ్డవారికి, కుటుంబంలో గుండెపోటు బాధితులు ఉన్నవారికిది మరింత ముఖ్యం.
అతి నిద్ర వరమా? శాపమా?
'మావాడు ఇలా పడుకోగానే అలా నిద్రపోతాడు. ఎంత అదృష్టవంతుడో' అని కొందరు గొప్పగా చెబుతుంటారు. నిజానికిదేమంత మంచి లక్షణం కాదు. సాధారణంగా పడుకున్నాక కొంత సేపటికి నిద్ర పడుతుంది. వెంటనే గాఢ నిద్ర ముంచుకొస్తుందంటే నిద్ర కొరతతో బాధపడుతున్నారనే అర్థం. రాత్రి సరిగా నిద్రపోకపోతే పగటిపూట నిద్ర రావటం మామూలే. కానీ రాత్రి బాగా నిద్రపోయినా పగటి పూట నిద్ర వస్తుంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. దీనికి ప్రధాన కారణం గురక. దీన్నే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు. ఇందులో నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై, కిందికి జారుతుంది. ఇది శ్వాస నాళానికి అడ్డుపడుతుంది. దీంతో కాసేపు శ్వాస ఆడక, ఉక్కిరిబిక్కిరై ఉన్నట్టుండి నిద్రలోంచి మెలకువ వచ్చేస్తుంది. ఇలా రాత్రంతా చాలాసార్లు నిద్రకు భంగం కలుగుతుంది. గాఢ నిద్ర కొరవడుతుంది. రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుంది. దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక విశ్రాంతి దొరకదు. ఫలితంగా తెల్లారి హుషారుగా ఉండదు. చిరాకు, ఆందోళన వేధిస్తాయి.
ఆ ప్రమాదమూ ఉంది..
ఒకోసారి గుండె లయ దెబ్బతిని, ఆక్సిజన్ బాగా తగ్గిపోయి నిద్రలోనే మరణించే ప్రమాదమూ ఉంది. చాలామంది గురకతో ఇబ్బంది పడుతున్నా దాన్ని పోల్చుకోలేరు. తలనొప్పి, చికాకు, ఆందోళన, బలహీనత వంటి సమస్యలుగా పొరపడి ఇవేవో చికిత్సలు తీసుకుంటుంటారు. దీన్ని విస్మరిస్తే గుండెజబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ప్రశాంతత లోపించటం వంటి సమస్యలకు దారితీస్తుంది.
సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కొరవడుతుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు నిద్ర ఆపులేకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాలకూ గురికావొచ్చు. కాబట్టి గురకను తేలికగా తీసుకోవటానికి లేదు. నిద్ర పోతున్నప్పుడు మనకు తెలియనంత మాత్రాన దీంతో ఎలాంటి నష్టం లేదనుకోవటానికి లేదు. మున్ముందు ఇది తీవ్ర అనర్థాలకు దారితీసే అవకాశముంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. బరువు తగ్గించుకోవటం.. మద్యం, పొగ అలవాట్లు మానెయ్యటం ద్వారా దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. దీనికిప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి డాక్టర్లు వీటిని సూచిస్తారు.