Fiber rich foods: ఆహారంలో ఉండాల్సిన పోషకాల గురించి ఈ మధ్య చాలా మందికి అవగాహన పెరుగుతోంది. తినే ఫుడ్లో ఎన్ని క్యాలరీలు, ఫైబర్, ప్రోటీన్లు ఉండాలో లెక్కలు వేసుకుంటూ తింటున్నారు. మరి ఫైబర్ అంటే ఏంటో తెలుసా? ఫైబర్ అంటే పీచు పదార్థం. ఇది ఏ ఆహారాల్లో ఉంటుంది. దీని వల్ల ఏం లాభం ఉంటుంది? అన్న విషయాలపై ఓ లుక్కేస్తే..
Fiber benefits for body: ఫైబర్ మన ఆరోగ్యానికి చాలా అవసరమని, తప్పకుండా ప్రతిరోజు దీన్ని ఆహారంలో ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు పదేపదే చెబుతుంటారు. మొక్కల ద్వారా మాత్రమే ఫైబర్ లభిస్తుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి ఆహారాల ద్వారా మనకు ఈ పీచు పదార్థం లభిస్తుంది. ధాన్యపు ఆహారాల్లో పై పొట్టు, పై పొరల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. అందుకే శుద్ధి చేసిన ధాన్యాల కంటే ముడి బియ్యం తినడం వల్ల ఫైబర్ అధికంగా దొరుకుతుంది.
Fiber intake per day: తినే ఆహారం ద్వారా ఫైబర్ మనం శరీరంలోకి వెళ్తుంది కానీ... జీర్ణం కాదు. అందుకే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటున్నప్పుడు మలబద్దకం సమస్య ఉండదు. ఫైబర్ వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. అయితే, దీనిపై అవగాహన పెరుగుతున్నా.. ఇప్పటికీ చాలా మంది తగినంత పీచు పదార్థాలు తీసుకోవడం లేదు. వయసు, ఆడ, మగ.. వంటి తేడాలను బట్టి ఫైబర్ ఎంత అవసరం అన్నది మారుతుంటుంది. సగటున రోజుకు 28 గ్రాముల వరకు ఫైబర్ అవసరం అవుతుంది. కానీ చాలా మంది 14 గ్రాములే తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
"ఫైబర్ అనేది ఫ్రూట్స్ అండ్ వెజిటెబుల్స్ ద్వారా ఎక్కువగా దొరుకుతుంది. హోల్గ్రేన్(పొట్టుతో ఉన్న గింజలు)లో అధికంగా ఉంటుంది. మలబద్దకం సమస్య తగ్గేందుకు ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫైబర్ మన శరీరం నుంచి నీటిని పీల్చుకోని.. వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు దోహదం చేస్తుంది."
-శుభాంగి తమ్మళ్వార్, న్యూట్రిషనిస్ట్