కొవిడ్-19 పుణ్యమాని రోగనిరోధకశక్తిని పెంచుకోవటం మీద ఆసక్తి బాగా పెరిగింది. నిరోధక శక్తి బాగుంటే ఇన్‌ఫెక్షన్లను చాలావరకు నివారించుకోవచ్చు మరి. ఇందుకోసం ఆహార పదార్థాలు, వ్యాయామం, మాత్రలు.. ఇలా ఎవరికి తోచిన మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు. ఇవి రోగనిరోధకశక్తి పెరగటానికి తోడ్పడే మాట నిజమే అయినా సరైన పద్ధతిని పాటించటమూ ముఖ్యమే. కేవలం మాత్రల మీదే ఆధారపడటం కన్నా సరైన ఆహారం పైనా దృష్టి సారించాలి.
విటమిన్ సి మాత్రలు
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందినవి ఇవే. విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి తోడ్పడుతుందన్నది కొత్త విషయమేమీ కాదు. అయితే వీటిని విచ్చలవిడిగా, డాక్టర్ సలహా లేకుండా వాడుకోవటం తగదు. విటమిన్ సి మాత్రలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే హానికరంగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు.
మాత్రల రూపంలో కన్నా దీన్ని ఆహారం ద్వారా పొందేలా చూసుకుంటే ఇంకా మంచిది. ఆహారం ద్వారా అందే విటమిన్‌ను శరీరం బాగా స్వీకరిస్తుంది. ఆహారం ద్వారానైతే తగినంత మోతాదులో లభించేలా చూసుకోవచ్చు కూడా. విటమిన్ సి మితిమీరటం వల్ల తలెత్తే అతి మూత్రం వంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్త పడొచ్చు.
సమతుల జీవనశైలీ..
సమతులాహారమే కాదు.. సమతుల జీవనశైలి కూడా ముఖ్యమే. తగినంత నిద్ర, విశ్రాంతితో ఒంట్లో నిరోధక శక్తి ఇనుమడిస్తుందని అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి. కమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఉద్యోగం-నిత్య జీవన వ్యవహారాలను చక్కగా సమన్వయం చేసుకోవటమూ మేలు చేస్తుంది. యోగా కూడా ముఖ్యమే.
ఇదీ రోగనిరోధకశక్తి ఇనుమడించటానికి తోడ్పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ధారాళంగా గాలి వీచే పరిశుభ్రమైన వాతావరణంలో గడపటమూ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జబ్బుల నుంచి త్వరగా కోలుకోవటానికి, రోగనిరోధక శక్తి పెంపొందటానికి దోహదం చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
పుల్లటి పండ్లు మాత్రమే కాదు
మన భారతీయ వంటకాల వైవిధ్యమే వేరు. వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు అందించే ఆహార పదార్థాలు ఎన్నెన్నో. నిమ్మకాయలు, బత్తాయి వంటి పుల్లటి పండ్లలోనే విటమిన్ సి ఉంటుందని.. ఇవి మాత్రమే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. నిజానికి ఇతర పదార్థాల్లోనూ విటమిన్ సి ఉంటుంది. ఉదాహరణకు- ఎర్ర క్యాప్సికంలో మనకు రోజుకు అవసరమైన దానికన్నా ఇంకా 50% ఎక్కువగానే విటమిన్ సి ఉంటుంది.