మధుమేహం దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఎంతకాలంగా మధుమేహంతో బాధపడుతుంటే అంత ఎక్కువగా సమస్యల ముప్పు పెరుగుతూ వస్తుంటుంది. కాబట్టి గ్లూకోజును నియంత్రణలో ఉంచుకోవటం కీలకం. క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం, వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, బరువును అదుపులో ఉంచుకోవటం ద్వారా వీటి బారినపడకుండా కాపాడుకోవచ్చు. మరికొన్ని జాగ్రత్తలూ తీసుకోవటం మంచిది.
మధుమేహ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ సూపర్ టిప్స్ మీకోసమే.. - చక్కెర వ్యాధికి ఫుడ్ టిప్స్ న్యూస్
మధుమేహ వ్యాధి చాలా రకాల సమస్యలకు దారితీస్తుంది. ఈ చక్కెర వ్యాధి ఎంత ఎక్కువ కాలం నుంచి ఉంటే అన్ని బాధతలో ఇబ్బంది పడుతున్నట్లే. అయితే ఈ వ్యాధిని నియంత్రించేందుకు నిపుణులు కొన్ని రకాల సలహాలను, సూచనలను ఇచ్చారు. మరి అవేంటో తెలుసుకుందామా?..
మధుమేహంతో దీర్ఘకాల వ్యాధులు
ఈ వ్యాధిని నియంత్రించేందుకు నిపుణులు క్రింది విధంగా కొన్ని రకాల సలహాలను, సూచనలను ఇచ్చారు. అవి
- పొగ తాగటం మానెయ్యాలి
పొగతో కాళ్లకు, పాదాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది ఇన్‌ఫెక్షన్లకు, మొండి పుండ్లకు దారితీస్తుంది. పుండ్లు ఎంతకీ మానకపోతే వేళ్లు, పాదాలు తొలగించాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది. పొగ తాగటం వల్ల గ్లూకోజు నియంత్రణలోకి రావటమూ కష్టమవుతుంది. గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. కళ్లు, నాడులు, కిడ్నీలు సైతం దెబ్బతింటాయి. కాబట్టి పొగతాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. - రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపు
మధుమేహమే కాదు.. అధిక రక్తపోటూ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కూడా ప్రమాదకరమే. ఇవి గుండెపోటు, పక్షవాతం, ఇతర ప్రాణాంతక సమస్యలకు దారితీయొచ్చు. సమతులాహారం తినటం.. కొవ్వులు, ఉప్పు తగ్గించటం.. అతిగా మద్యం తాగకపోవటం.. రోజూ వ్యాయామం చేయటం ద్వారా వీటిని అదుపులో ఉంచుకోవచ్చు. వీటి కోసం మందులు వాడుతుంటే మధ్యలో మానెయ్యరాదు. - క్రమం తప్పకుండా పరీక్షలు
మందులు వాడుతున్నాం కదాని డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఉండటం మంచిది కాదు. మూడు నెలలకోసారైనా విధిగా డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షించుకోవాలి. ఎలాంటి ఆహారం తింటున్నారు? ఎంత శారీరక శ్రమ చేస్తున్నారు? కిడ్నీలు, నాడులు దెబ్బతింటున్న సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? గుండెజబ్బు సూచనలు పొడసూపుతున్నాయా? అనే విషయాలను డాక్టర్లు పరిశీలిస్తారు. అలాగే ఏడాదికోసారి కంటి పరీక్ష కూడా చేయించు కోవాలి. రెటీనా దెబ్బతినటం, శుక్లాలు, నీటికాసుల వంటి సమస్యలు మొదలైతే ముందుగానే బయటపడుతుంది. - దంతాలు జాగ్రత్త
మధుమేహంతో బాదపడేవారికి చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముకోవాలి. రోజుకు ఒకసారి వేళ్ల మధ్య సన్నటి దారంతో (ఫ్లాస్) శుభ్రం చేసుకోవాలి. ఏడాదికి కనీసం రెండు సార్లయినా దంత పరీక్ష చేయించుకోవాలి. చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా, చిగుళ్లు ఉబ్బినా వెంటనే చికిత్స తీసుకోవాలి. - మద్యం జోలికి పోవద్దు
మద్యంతో గ్లూకోజు మోతాదులు పెరగొచ్చు, తగ్గొచ్చు. ఎంత మద్యం తాగుతున్నారు? తాగుతున్నప్పుడు ఏదైనా తింటున్నారా? లేదా? అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. కేలరీల గణనలో మద్యంతో లభించే కేలరీలనూ లెక్కలోకి తీసుకోవాలి. మత్తు దిగిన తర్వాత రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గుతాయనీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇన్సులిన్ మీదున్నవారు దీన్ని మరవరాదు. - పాదాలపై నిఘా
అదేపనిగా రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉంటుంటే కాళ్లకు రక్త సరఫరా తగ్గుతుంది. పాదాల్లో నాడులు దెబ్బతింటాయి. ఎక్కడైనా గీసుకుపోయినా, బొబ్బలు పడినా చికిత్స తీసుకోకపోతే తీవ్ర ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. మధుమేహం మూలంగా పాదాల్లో సూదులు పొడిచినట్టు, మండినట్టు అనిపించటం, నొప్పి పుట్టటం వంటివీ తలెత్తుతాయి. కాబట్టి వీటిని నివారించుకోవటం మీద దృష్టి పెట్టాలి.
* రోజూ గోరువెచ్చటి నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి. అయితే పాదాలను నీటిలో నానబెట్టొద్దు.
* పాదాలను నెమ్మదిగా తుడుచుకోవాలి. ముఖ్యంగా వేళ్ల మధ్య తడిలేకుండా చూసుకోవాలి.
* పాదాల మీద ఎక్కడైనా గీరుకుపోవటం, ఎరుపు, వాపు, బొబ్బల వంటివేవైనా ఉన్నాయా అని రోజూ చూసుకోవాలి. అవసరమైతే అరిపాదాలను అద్దం సాయంతో చూసుకోవాలి. ఎలాంటి తేడా కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బయటే కాదు, ఇంట్లోనూ చెప్పులు ధరించాలి. - ఒత్తిడినీ గమనించుకోవాలి
మానసిక ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గుతుంది. మధుమేహం విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించొచ్చు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. పరిమితులను గుర్తించి పనులను భుజాన వేసుకోవాలి. ధ్యానం, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి. కంటి నిండా నిద్ర పోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా సకారాత్మక ధోరణి అలవరచుకోవాలి.