Diabetes Food Chart in Telugu :షుగర్ వచ్చిందంటే చాలు.. ఒక భయం మొదలవుతుంది. ఏది తినాలన్నా, ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. డయాబెటిస్ బాధితులు సరైన ఆహారం తీసుకోకపోతే మరిన్ని సమస్యలు రావడమే ఇందుకు కారణం. ఆహార నియంత్రణే ఆ వ్యాధి తగ్గుదలకు చక్కటి మార్గమని వైద్యుల అభిప్రాయం. మరి డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎలాంటి డైట్ పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
డయాబెటిస్ లక్షణాలివే..
Diabetes Symptoms in Telugu : చాలా మందికి గుండె సంబంధిత, డయాబెటిస్ వ్యాధులు చిన్నతనంలో వస్తున్నాయి. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, ఒత్తిడి అని వైద్యులు చెబుతారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ఈ కాలంలో ఎక్కువైపోయింది. దీని లక్షణాలు ఏంటంటే.. తరచూ మూత్రం రావడం, దాహం వేయడం, ఆకలి ఎక్కువ కావడం, కాళ్లు వాపు రావడం లాంటివి ఉంటాయి. ఈ వ్యాధిగ్రస్థులు హెచ్‌పీఏ1సి పరీక్ష ద్వారా 3 నెలలకోసారి చెక్ చేసుకోవాలి. అది 3-5.4 ఉంటే డయాబెటిస్ లేనట్లే. అదే 5.6 కంటే ఎక్కువుంటే ప్రీడయాబెటిక్ అని, 7 కంటే ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరిస్తారు.
కొందరిలో ఉపవాసం ఉన్నా కూడా 200 దాకా ఉంటుంది. ఇది 70-100 మధ్య ఉంటే నియంత్రణంలో ఉందని అర్థం. అంత కంటే ఎక్కువుంటే అదుపులో లేదని అర్థం. కొంతమందికి లంచ్ చేసిన తర్వాత 300 నుంచి 400 దాకా వస్తుంది. ఇలాంటివి రాకుండా డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ బాధితులు చెక్కర స్థాయుల్ని అదుపులో పెట్టుకోవాలి. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా డైట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ప్రధాన పోషకాలైన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్, ఫైబర్లు రక్తంలో చెక్కర స్థాయిల్లో ప్రభావం చూపిస్తాయి. వీటిలో మాంసకృత్తులు, కొవ్వుల కన్నా పిండి పదార్థాలు.. రక్తంలో షుగర్ లెవెల్స్ త్వరగా పెరగడానికి కారణమవుతాయి. రక్తంలో చెక్కర స్థాయులపై ఆహారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. దాన్ని తిన్న తర్వాత తీసే షుగర్ రీడింగ్‌లో తెలుస్తుంది.
అధిక ప్రోటీన్ కలిగిన జంతు మాంసం, వెన్న వంటి అధిక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, ఐస్ క్రీమ్, కొబ్బరి నూనె, చికెన్ మాంసంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఘన కొవ్వుగా మారే ద్రవ నూనెలు. ఇవి ఫాస్ట్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ప్రాసెస్ చేసిన ఆహారంలో ఉంటాయి. ఈ రెండు రకాల కొవ్వుల వినియోగంలో జాగ్రత్త వహించాలి. మరోవైపు ఉప్పును సైతం తక్కువగా తీసుకోవాలి. ఇది అధిక రక్తపోటును నివారించడానికి ఉపయోగపడుతుంది.