తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చిన్న వయసులోనే మధుమేహం..! కారకాలివే - మధుమేహం కారణాలు

Diabetes Causes : మధుమేహం ముప్పు కారకాలనగానే ముందుగా ఊబకాయం, వయసు, బద్ధకంతో కూడిన జీవనశైలి, అధిక రక్తపోటు వంటివే గుర్తుకొస్తాయి. ఇవే కాదు, ఇతరత్రా కారణాలూ ప్రమాదాన్ని తెచ్చి పెడుతున్నాయి. కాలుష్యం, క్రిమి సంహారకాలు, పురుగు మందులు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, భార లోహాలు, నాన్‌ స్టిక్‌ పాత్రలు, నిద్రలేమి, పేగుల్లో బ్యాక్టీరియా, అంతర్గత వాపు ప్రక్రియ వంటివీ ముప్పును పెంచుతున్నాయి. అందుకే వీటిపై విస్తృతమైన పరిశోధనలు సాగుతున్నాయి. ఇవెలా మధుమేహానికి కారణమవుతున్నాయి? నివారించు కోవటమెలా? అని లోతుగా పరిశీలిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో సంప్రదాయేతర మధుమేహ ముప్పు కారకాలపై సమగ్ర కథనం మీకోసం.

research on causes of diabetes
research on causes of diabetes

By

Published : Nov 8, 2022, 7:33 AM IST

Diabetes Causes : మనకు మధుమేహం ముప్పు కారకాల గురించి మనకు బాగానే తెలుసు. అయితే ఇందులో కొంత ఇబ్బంది లేకపోలేదు. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా మధుమేహం దాదాపు సమానంగానే ఉంటున్నట్టు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి. సన్నగా ఉన్నా, కొవ్వు ఎక్కువగా తినకపోయినా, శారీరక శ్రమ ఎక్కువగా చేస్తున్నా కూడా రైతులు, కూలీలు, శ్రామికుల్లోనూ మధుమేహం ఎక్కువగానే కనిపిస్తోంది. ఊబకాయాన్ని పరిగణనలోకి తీసుకొని చూసినా- వీరిలో 30% మందే మధుమేహం బారినపడుతున్నారు. మధుమేహం గలవారిలో అందరూ లావుగా ఏమీ ఉండటం లేదు కూడా. అందువల్ల ఇలాంటి సంప్రదాయ ముప్పు కారకాలను పునః పరిశీలించుకోవటం అనివార్యమైంది. వీటికి భిన్నమైన ఇతరత్రా ముప్పు కారకాల మీద దృష్టి సారించాల్సిన తరుణం ఆసన్నమైంది. వీటిని అడ్డుకునే మార్గాలను అన్వేషించి మదుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చా? నివారించుకోవచ్ఛా? అనే కోణంలోనూ ఇప్పుడు విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇవన్నీ సంప్రదాయేతర ముప్పు కారకాలకూ మధుమేహానికీ బలమైన సంబంధమే ఉంటున్నట్టు స్పష్టం చేస్తున్నాయి.

కాలుష్య మహమ్మారి
ఆధునిక ప్రపంచం మోసుకొస్తున్న అతిపెద్ద ఉపద్రవం కాలుష్యం. గాలి, నీరు, భూమి.. ఏదీ దీనికి అతీతం కాదు. ఇదో మహమ్మారి మాదిరిగానే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. మధుమేహానికీ దారితీస్తోంది. శ్వాస, నీరు, ఆహారం ద్వారా ఒంట్లోకి చేరుకునే విషతుల్యాలన్నీ ప్రత్యక్షంగా క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్‌ తయారీని అడ్డుకోవచ్చు. రోగనిరోధక వ్యవస్థను శరీరం మీదే దాడిచేసేలా (ఆటోఇమ్యూన్‌) పురికొల్పొచ్చు. దీంతో క్లోమగ్రంథిలో ఇన్సులిన్‌ను తయారుచేసే కణాలు దెబ్బతినొచ్చు. ఇన్సులిన్‌ ప్రభావాన్ని తగ్గించే ఎడ్రినలిన్‌, థైరాక్సిన్‌, గ్రోత్‌ హార్మోన్‌ వంటి వాటినీ ఇవి ఉత్తేజితం చేస్తాయి. ఫలితంగా పిండి పదార్థాల జీవక్రియ అస్తవ్యస్తమవుతుంది. శరీరంలో ఉండిపోయే కొన్ని లోహ రేణువులు కాలేయంలోనూ ఇరుక్కుపోవచ్చు. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకున్న నుసి అక్కడే ఉండిపోవచ్చు. ఇలా ఇవన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదో ఒకలా మధుమేహం వచ్చేలా చేస్తున్నాయి.

1. వాయు కాలుష్యం ప్రధానం
సూక్ష్మ ధూళి కణాలతో కూడిన నుసి పదార్థం (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌- పీఎం2.5) ఊపిరితిత్తులు, గుండె జబ్బులకే కాదు.. మధుమేహానికి దారితీస్తోంది. ఇది కణాల మీది రక్షణ పొర పనితీరును మార్చేసి, ఇన్సులిన్‌ నిరోధకత పెరిగేలా చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే కణాలు ఇన్సులిన్‌కు స్పందించటం మందగిస్తుందన్నమాట. పీఎం 2.5 తక్కువగా ఉండే ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నచోట నివసించేవారిలో మధుమేహం 77.5% అధికంగా బయటపడుతుండటమే దీనికి నిదర్శనం. కొవిడ్‌ అనంతర అనుభవాలనూ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ మహమ్మారి కారణంగా చాలావరకు ఇంట్లోనే ఉండటం, మాస్కులు ధరించటం వల్ల గాలి కాలుష్యం ప్రభావమూ తగ్గింది. దీంతో మధుమేహం, మధుమేహ మరణాల సంఖ్య సైతం తగ్గుముఖం పట్టింది. కాబట్టే మధుమేహానికి వాయు కాలుష్యాన్నే ప్రధాన కారకంగా పరిగణిస్తున్నారు. మనదేశంలో 2019లో మధుమేహం మూలంగా ఏటా 6.5 లక్షల మంది మరణించగా.. వీరిలో సుమారు 50 వేల మంది వాయు కాలుష్యంతో మధుమేహం వచ్చినవారే!

నివారణ మార్గం: వీలైనంత వరకు వాయు కాలుష్యం బారినపడకుండా చూసుకోవాలి. కాలుష్యం ఎక్కువగా ఉండే చోట్లకు వెళ్లినప్పుడు ముక్కుకు మాస్కు ధరించాలి. వాయు కాలుష్యానికి పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ వంటి శిలాజ ఇంధనాల దహనం.. పరిశ్రమల నుంచి వెలువడే పొగ.. వ్యర్థాలను బహిరంగ ప్రదేశంలో కాల్చటం.. వంట కోసం కలప, బొగ్గు, పిడకలు, గోబర్‌ గ్యాస్‌ వాడటం.. కోత కోశాక వరి, గోధుమ దుబ్బలను పొలాల్లోనే కాల్చేయటం వంటివన్నీ కారణమవుతున్నాయి. వీటిని తగ్గించుకోగలిగితే మధుమేహాన్నీ నివారించుకోవచ్చు.

2. క్రిమి సంహారకాల ప్రమాదం
పంట పొలాల్లో క్రిమి సంహారక మందులు, ఎరువులు (ఆర్గనో ఫాస్ఫేట్‌, ఆర్గనో క్లోరిన్‌) మరో సమస్య. వీటిని చాలాకాలంగా చల్లుతున్న రైతులు, వ్యవసాయ కూలీల్లో టైప్‌ 2 మధుమేహం ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా మధుమేహం బారినపడ్డవారిలో ఈ ఆర్గనో ఫాస్ఫేట్‌ మందుల అవశేషాలు పెద్ద మొత్తంలో ఉంటున్నట్టు బయటపడింది. నిజానికి రైతులంతా కఠినమైన వ్యవసాయ పనులు చేస్తుంటారు. లావుగానూ ఉండరు. అయినా కూడా వ్యవసాయేతర వృత్తులను చేసేవారితో పోలిస్తే వ్యవసాయ పనులు చేసేవారిలో మధుమేహం మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. దీనికి చాలావరకు ప్రాణాంతక క్రిమి సంహారకాల అవశేషాలే. క్రిమి సంహారక మందులను చల్లే సమయంలో వాటి తుంపర, వాసన గాల్లో కలుస్తాయి. కొన్ని మందులు నీటిలో కరిగిపోతాయి. మరికొన్ని భూమిలోపలికీ ఇంకి పోతాయి. ఇలా శ్వాస, వీటి అవశేషాలతో కూడిన పదార్థాలను తినటం, వీటితో కలుషితమైన భూగర్భ జలం ద్వారా ఒంట్లోకి చేరతాయి. కూల్‌డ్రింకుల్లో, చనుబాలలోనూ వీటి ఆనవాళ్లు ఉండటం గమనార్హం. ఇవి పేగుల్లోని బ్యాక్టీరియానూ అస్తవ్యస్తం చేస్తాయి. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఇది మధుమేహం రావటానికే కాదు, మధుమేహం నియంత్రణలోనూ ఇబ్బందులు సృష్టిస్తుంది.

నివారణ మార్గం: మోనోక్రోటోఫాస్‌, క్లోర్‌ఫైరిఫాస్‌, మలాథియాన్‌ వంటి ప్రాణాంతక ఆర్గనో ఫాస్ఫేట్లు, క్లోరిన్‌ మందులను ప్రభుత్వం వాడొద్దని సూచించింది. అయినా విస్తృతంగా వాడుతూనే ఉన్నారు. దీన్ని మానుకోవాలి.

3. ప్లాస్టిక్‌ భూతం
ప్లాస్టిక్‌ కర్మాగారాల్లో పనిచేసేవారిలో, వాటి చుట్టుపక్కల నివసించేవారిలో మధుమేహం ఎక్కువ. ముఖ్యంగా గర్భిణుల్లో మధుమేహంతో పాటు థైరాయిడ్‌ వాపు అధికంగా కనిపిస్తోంది. హానికారక ప్లాస్టిక్‌లో రెండు రకాలను ప్రధానంగా చెప్పుకోవాలి. ఒకటి- బిస్ఫెనోల్‌ ఎ (బీపీఏ). దీన్ని గట్టిగా ఉండే ప్లాస్టిక్‌ డబ్బాల తయారీకి, లోహపు డబ్బాల లోపలి పైపూతగానూ వాడుతుంటారు. వీటిల్లో నిల్వచేసిన ఆహార పదార్థాలను తిన్నా, తాగినా అవి మన శరీరంలో చేరిపోతాయి. రెండోది- 2-మెథాక్సీథనాల్‌ (ప్లాస్టిసైజర్‌). ఇది ఒంట్లోకి చేరాక మెథాక్సీఎసిటిక్‌ ఆమ్లంగా, తర్వాత సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులుగానూ మారుతుంది. ప్లాస్టిక్‌ పదార్థాల తయారీ, రవాణా, వాడకం.. ఇలా అన్ని దశల్లోనూ వీటి వ్యర్థాలు పర్యావరణంలోకి కలవచ్చు. గాలి, నీరు, పంటల ద్వారా ఏ రూపంలోనైనా ఒంట్లోకి ప్రవేశించొచ్చు. క్రమంగా ఇవి శరీరంలో చిన్న చిన్న రేణువులుగా విడిపోయి మైక్రోప్లాస్టిక్‌ (5 మి.మీ. కన్నా చిన్న సైజు), నానోప్లాస్టిక్‌ (0.001 కన్నా చిన్న సైజు) రూపంలోకి మారతాయి. ఇవి రక్తం, మూత్రం, ఉమ్మి, మలం వంటి అన్నిరకాల శరీర ద్రవాల్లో ఉంటున్నట్టు గుర్తించారు. మధుమేహానికే కాదు.. ఊబకాయం, సంతానలేమి, గుండె, నాడుల జబ్బులు, క్యాన్సర్ల వంటి వాటికీ ప్లాస్టిక్‌ కారణమవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

నివారణ మార్గం: ప్లాస్టిక్‌ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను బయటి వాతావరణంలో కలవకుండా నిలువరించాలి. వీటిల్లో పనిచేసే కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వస్తువుల్లో ఎలాంటి రకం ప్లాస్టిక్‌ ఉందో అందరికీ తెలిసేలా వాటిపై లేబుళ్లు అంటించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

4. పీఎఫ్‌ఏఎస్‌ల బెడద
మరో ఉపద్రవం పెర్‌-పాలీ ఫ్లోరో అల్కైల్‌ పదార్థాలు (పీఎఫ్‌ఏఎస్‌). వీటితో తయారయ్యే వస్తువులను చాలాకాలంగా విస్తృతంగా వాడుతూ వస్తున్నాం. నాన్‌స్టిక్‌ వంట పాత్రలు, మంటలను నిరోధించే ఫోమ్‌, మరకలు అంటుకోనీయని ఫర్నిచర్‌ వంటివన్నీ వీటితో తయారయ్యేవే. ఇవి ఎప్పటికీ అలాగే ఉండే రసాయనాలు. ఒకసారి ఒంట్లోకి చేరుకుంటే విచ్ఛిన్నం కాకుండా శాశ్వతంగా ఉండిపోతాయి.

నివారణ మార్గం: వీలైనంతవరకు నాన్‌ స్టిక్‌ పాత్రలను వాడకపోవటం మంచిది. ఒకవేళ వాడితే మంచి నాణ్యతతో కూడినవి ఎంచుకోవాలి. ఇప్పుడు వేడి చేసినా పీఎఫ్‌ఏఎస్‌లు కరగకుండా, ఇవి ఆహార పదార్థాల్లో కలవని విధంగా నాన్‌ స్టిక్‌ పాత్రలను రూపొందిస్తున్నారు. విదేశాల్లో ఇలాంటివి అందుబాటులోకి వచ్చాయి. వీలైతే ఇలాంటి నాన్‌స్టిక్‌ పాత్రలను వాడుకోవాలి.

5. భార లోహాల భారం
పరిశ్రమల వ్యర్థాల్లోని ఆర్సెనిక్‌, కాడ్మియం, సీసం, పాదరసం, మిథైల్‌ మెర్క్యురీ, ఆర్గానోటిన్‌ వంటి భార లోహాలు సైతం ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇవి నదులు, కాల్వలు, చెరువులు, భూగర్భజలాన్నింటిలోనూ ఉంటున్నాయని తేలింది. ఈ నీటితో పండించే కూరగాయలు, పంటల ద్వారా మన ఒంట్లోకి చేరుతున్నాయి. మనుషుల రక్తం, మూత్రం, తల వెంట్రుకలు, గోళ్లలో పెద్దమొత్తంలో (ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతించిన పరిమితి కన్నా పదింతలు ఎక్కువ) ఉంటున్నట్టు తేలింది.

నివారణ మార్గం: భార లోహాలు, వాటి సంయోగాలు (సాల్ట్స్‌) నీటిలో కరిగి ఉంటాయి. వీటి విషయంలో వ్యక్తిగతంగా చేయగలిగిందేమీ లేదు. ఇవి నదులు, కాల్వలు, చెరువుల్లో కలవ కుండా పరిశ్రమల వద్దే తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకోవాలి.

పేగు బ్యాక్టీరియా పెద్ద సమస్య
మధుమేహం రావటంలో పేగుల్లోని సూక్ష్మక్రిములు సైతం పాలు పంచుకుంటున్నట్టు అధ్యయనాలు గట్టిగా చెబుతున్నాయి. ఈ సూక్ష్మక్రిముల్లో వైరస్‌ల వంటివీ ఉండొచ్చు గానీ బ్యాక్టీరియానే పెద్దమొత్తంలో ఉంటుంది. వీటి జన్యువులు మానవ జన్యువుల కన్నా 150 రెట్లు ఎక్కువ! ఇవి జీర్ణకోశమంతా విస్తరించి ఉంటాయి. కాకపోతే పెద్దపేగు చివర్లో అధికంగా ఉంటాయి. పేగుల్లోని సూక్ష్మక్రిములు ఒకరిలో ఉన్నట్టు మరొకరిలో ఉండవు. ఎవరికి వారికే ప్రత్యేకం. వేలిముద్రల మాదిరిగా దీన్ని ప్రత్యేక గుర్తింపు చిహ్నమనీ అనుకోవచ్చు. వీటిల్లో కొన్ని మంచివైతే, కొన్ని హాని కలిగిస్తాయి. తిన్న ఆహారం జీర్ణం కావటానికి, జీర్ణమైన ఆహారంలోని పోషకాలను పేగులు గ్రహించుకోవటానికి, వీటిని శక్తిగా మలచుకోవటానికి మంచి బ్యాక్టీరియా తోడ్పడుతుంది. కానీ హానికారక బ్యాక్టీరియా పేగుల గోడల్లోని కణాలను దెబ్బతీసి, వీటి మధ్య ఖాళీలు ఏర్పడేలా (లీకీ గట్‌) చేస్తాయి. దీంతో హానికారక పదార్థాలు రక్తంలో కలుస్తాయి. ఇవి శరీరంలో తక్కువ స్థాయిలో వాపు ప్రక్రియను (లోగ్రేడ్‌ ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపిస్తాయి. ఇది కాలేయం, క్లోమగ్రంథి, మెదడును మరింత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇలా పరోక్షంగా మధుమేహానికి కారణమవుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • సరైన ఆహారం తీసుకుంటే పేగు గోడల నిర్మాణం మెరుగవుతుంది. ఇది షార్ట్‌ చెయిన్‌ కొవ్వు ఆమ్లాలు (ఎస్‌సీఎఫ్‌ఏ) పెరిగేలా చేసి, గ్లూకోజు నియంత్రణకు తోడ్పడే బ్యాక్టీరియాను వృద్ధి చెందిస్తుంది.
  • వ్యాయామంతోనూ ఎస్‌సీఎఫ్‌ఏ మోతాదు పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియా వైవిధ్యానికి తోడ్పడుతుంది. అలాగే బ్రాంచ్డ్‌ చైన్‌ అమైనో ఆమ్లాలను తగ్గిస్తూ వాపు ప్రక్రియను అడ్డుకుంటుంది. కణాల్లో తయారయ్యే విష తుల్యాలనూ తగ్గిస్తుంది.
  • మధుమేహం మందులతోనూ పేగు సూక్ష్మక్రిములు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. వీటి వైవిధ్యమూ మెరుగవుతుంది. ఫలితంగా ఎస్‌సీఎఫ్‌ఏ ఉత్పత్తీ పెరుగుతుంది. కాబట్టి మధుమేహం గలవారు మందులను క్రమంగా తప్పకుండా వేసుకోవాలి.
  • శాకాహారం, భారతీయ పద్దతుల్లో వండిన వంటకాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి తోడ్పడతాయి. పాశ్చాత్య ఆహార పదార్థాలు, యాంటీబయాటిక్‌ మందులు, మద్యం అతిగా తాగటం వంటి వాటితో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందుతుందని తెలుసుకోవాలి.

వాపు ప్రక్రియ ప్రేరేపణ
మధుమేహం వంటి దీర్ఘకాల సమస్యలకు కణస్థాయిలో జరిగే వాపు ప్రక్రియే (ఇన్‌ఫ్లమేషన్‌) మూలమని అధ్యయనాలు గట్టిగా చెబుతున్నాయి. ఊబకాయం.. కోపం, బాధ, నిరాశ, నిరాసక్తి వంటివి దీన్ని ప్రేరేపిస్తాయి. ఊబకాయుల్లో నడుం చుట్టూ, పొత్తి కడుపులో పేరుకుపోయిన కొవ్వు నుంచి వాపు ప్రక్రియను ఉత్తేజితం చేసే సైటోకైన్లు (ఎడిపోకైన్స్‌) తయారవుతాయి. కొవ్వు పట్టిన కాలేయంలో, మూత్ర పిండాల చుట్టూ పేరుకున్న కొవ్వు కణాల నుంచీ ఇవి పుట్టుకొస్తాయి. వీటి మోతాదు ఎక్కువైతే వాపు ప్రక్రియ మొదలవుతుంది. దీనికి ఆహార అలవాట్లూ కారణం కావొచ్చు. పండ్లు, కూరగాయలు తక్కువగా తినటం.. మాంసం ఎక్కువగా తినటం.. వనస్పతి వంటి ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ (హైడ్రోజెనేటెడ్‌ నూనెలు) వాడటం.. వెన్న తీయని పాలు, పాల ఉత్పత్తులు.. దేశీయ వెన్న, నెయ్యి కాకుండా సంప్రదాయేతర పద్ధతుల్లో తయారైన ఛీజ్‌, క్రీమ్‌ లాంటి పదార్థాలు.. బేకరీ పదార్థాలు.. బాగా కాల్చి, వేయించిన పదార్థాలు.. ప్యాక్‌ చేసిన చిరుతిళ్లు (ప్రాసెస్డ్‌ స్నాక్స్‌).. ఇలాంటివన్నీ వాపు ప్రక్రియను ప్రేరేపించే ప్రమాదముంది. ఊబకాయంతో సంబంధమేమీ లేకుండానే వీటితో వాపు ప్రక్రియ మొదలు కావొచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వాపు ప్రక్రియను తగ్గించే ఆహారం తినాలి.
  • లావుగా ఉంటే బరువు తగ్గించుకోవాలి.

నిద్రలేమితోనూ..
సంప్రదాయేతర హాని కారకాల్లో కాలుష్యం తర్వాత ప్రధానమైంది నిద్రలేమి. ఇందులో రెండు రకాలు.

1.తక్కువ సేపు నిద్ర పోవటం. రాత్రిపూట 7 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయేవారిలో ఇన్సులిన్‌ నిరోధకత పెరిగే ప్రమాదముంది. దీంతో రక్తంలో గ్లూకోజు పెరిగి మధుమేహానికి దారితీస్తుంది. అప్పటికే మధుమేహం గలవారిలోనైతే గ్లూకోజు నియంత్రణలోకి రావటమూ కష్టమవుతుంది. నిద్రలేమితో బరువు, రక్తపోటూ పెరుగుతాయి. రోగనిరోధక వ్యవస్థ పనితీరూ దెబ్బతింటుంది. ఇవన్నీ మధుమేహం ముప్పును పెంచేవే.

2.నిద్రలో అంతరాయాలు. రోజుకు 8 గంటల సేపు నిద్రపోతున్నా కూడా కొందరికి మాటిమాటికి మెలకువ వచ్చేస్తుంటుంది. భావోద్వేగాలు, కోపం, బాధ, కుంగుబాటు, రక్తంలో నీటి శాతం తగ్గటం, మూత్రం వచ్చేలా చేసే మందులు, అలవాటులేని శారీరక శ్రమ, మద్యం, వాతావరణంలో మార్పులు, కృత్రిమ తీపి పదార్థాల వంటివెన్నో దీనికి కారణం కావచ్చు. దీంతో ఒంట్లో ఇన్సులిన్‌ను ప్రతిఘటించే స్టిరాయిడ్లు, థైరాక్సిన్‌ వంటి హార్మోన్ల మోతాదులు పెరుగుతాయి. ఫలితంగా ఇన్సులిన్‌ నిరోధకత పెరిగి, మధుమేహం ముప్పు ఎక్కువవుతుంది.

రోజుకు కనీసం 7 గంటల సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. నిద్రలో అంతరాయానికి కారణమవుతున్న అంశాలను గుర్తించి, తగ్గించుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details