Depression Avoiding Tips:డిప్రెషన్.. ఇప్పడు ప్రతి ఒక్కరి జీవితంలో.. కనిపిస్తున్నది.. వినిపిస్తున్నది. వయసు, జెండర్‌తో సంబంధం లేకుండా జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న సమస్య. ఒకసారి దీనికి గురయ్యామంటే.. తిరిగి కోలుకోలేని విధంగా పర్యవసనాలు ఉంటాయి. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఆందోళన, చెప్పలేనంత బాధ.. డిప్రెషన్‌కు గురయ్యే వారిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు. అంతెందుకు ఎవరైనా తక్కువగా చేసి మాట్లాడిన.. కావాల్సింది దక్కకపోయినా.. ఏదైనా అనారోగ్యం బారిన పడినా చాలా మందిలో మానసిక ఒత్తిడి మొదలవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది.
కొన్ని సందర్భాల్లో ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు కూడా డిప్రెషన్‌కి కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇలా కారణాలు ఏవైనా కానీ.. వన్స్ డిప్రెషన్‌కి గురైతే మానసికంగా చిత్తు కావడం ఖాయం. అయితే ఈ సమస్య నుంచి గట్టెక్కెందుకు చాలా మంది మందులు కూడా ఉపయోగిస్తుంటారు. ఇది సరైనదేనా అని అంటే.. అటు కాదని చెప్పలేం.. ఇటు అవుననీ చెప్పలేం. అయితే కేవలం మందుల మీద ఆధార పడకుండా.. మన జీవన శైలిలో ఈ మార్పుల వల్ల ఒత్తిడి మన దరిదాపుల్లోకి కూడా రాలేదని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
వ్యాయామాలు:ఒక్కసారి డిప్రెషన్‌కు గురైతే.. ఏ పని మీద శ్రద్ధ పెట్టలేము. అయితే డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడానికి రోజువారీ వ్యాయామాలు సహాయపడుతాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు నడకతో ప్రారంభించిన చిన్న చిన్న ఎక్సర్సైజ్లు(వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగా, ఏరోబిక్స్, టెన్నిస్) చేసి రిలీఫ్ పొందవచ్చు. అలాగే మెడిటేషన్ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ కనీసం 15 నిమిషాలు ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేసుకోవడం వల్ల.. ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. "అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్"లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో CBT(Cognitive-Behavioral Therapy) దీర్ఘకాలికంగా డిప్రెషన్‌కు చికిత్స చేయడంలో మందుల వలే ప్రభావవంతంగా ఉంటుందని కనుగొంది.
విజయాలను నెమరేసుకోవడం: డిప్రెషన్ బారిన పడినప్పుడు.. చిన్న చిన్న లక్ష్యాలు కూడా పూర్తి చేసుకోలేరు. ఫలితంగా నాకు ఏ పని రాదు.. నేను ఏ పని చేయలేను అనే ఓ భావనలో ఉంటారు. అలాంటి సందర్భాల నుంచి బయటపడాలంటే.. మీరు సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తు చేసుకోవడం మంచిది. మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఊహించుకోవాలి. అలాగే మీ చిన్నతనంలో జరిగిన పలు విశేషాలు గుర్తుకు తెచ్చుకోవడం.. మనసుకు స్వాంతన లభించే పాటలు వినడం.. పుస్తకాలు చదవడం.. ఇలా మీకు నచ్చిన పనిలో నిమగ్నమైతే బాధ నుంచి విముక్తి పొందవచ్చు.