తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Delusional disorder: భ్రమల ఊబిలో మీరూ ఉన్నారా? - ఆరోగ్యం

ఊహ వేరు. నిజం వేరు. కల్పన వేరు. వాస్తవం వేరు. కాకతాళీయంగా కొన్నిసార్లు ఊహలు నిజం కావొచ్చు. కల్పన వాస్తవం కావొచ్చు. అంతమాత్రాన ప్రతి ఊహా నిజమవుతుందని అనుకోవటం భ్రమే. మరి ఊహే నిజమని నమ్ముతుంటే? ఆ మాటకొస్తే ఊహకు నిజానికి మధ్య తేడాను అసలే గుర్తించలేని స్థితిలో పడిపోతే? భ్రమల జబ్బు (Delusional disorder) అలాంటి మానసిక సమస్యే. మొదట్లో ఆలోచనలకే పరిమితం కావొచ్చు గానీ తీవ్రమైతే ప్రమాదకర చర్యలకూ దారితీస్తుంది.

delusional disorde
భ్రమ

By

Published : Jul 7, 2021, 10:22 AM IST

కుటుంబమంతా విద్యావంతులే. తల్లిదండ్రులు సమాజంలో పలుకబడి గలవారే. కుమార్తెలు జీవితంలో పైకెదగాలని ఆశిస్తున్నవారే. అయినా ఏదో మాయ కమ్మేసినట్టు అంతా ఒకేరకం ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్లిపోవడం.. తమ ఊహలు, నమ్మకాలను నిజాలుగా భ్రమపడటం.. ఆ యావలోనే సంతానాన్నీ కడతేర్చటం దిగ్భ్రాంతికరమైన విషయం. ఇటీవల మదనపల్లిలో జరిగిన ఈ ఘోరం ఇంకా మనసుల్లో మెదులుతూనే ఉంది. భ్రాంతి జబ్బు(Delusional disorder) పర్యవసానాలకు ఇదో నిదర్శనం. నమ్మకాలనేవి సహజం. చాలామందికి ఏవో నమ్మకాలు ఉంటూనే ఉంటాయి. అలాగని వాటిని నిజం చేసి చూపించాలని ఎవరూ అనుకోరు. ఉదాహరణకు- పునర్జన్మను చాలామందే నమ్ముతుండొచ్చు. కానీ బలవంతంగా చనిపోయి మళ్లీ పుట్టి చూపిస్తామని ఎవరూ అనుకోరు. కానీ పూర్తిగా అదే ధ్యాసలో పడిపోయి, అవే భ్రమల్లో మునిగిపోయి, తమ నమ్మకం నిజమేనని గట్టిగా నమ్మినవారు ఎంతటి అఘాయిత్యానికైనా పూనుకోవచ్చు. డెల్యూజనల్‌ డిజార్డర్‌ ఇలాంటి మాయలోనే ముంచేస్తుంది.

ఏంటీ సమస్య?

ఒక్క మాటలో చెప్పాలంటే- అవాస్తమైన ఓ గట్టి నమ్మకం. అది నిజం కాకపోయినా కూడా దాన్ని గుడ్డిగా, బలంగా నమ్మటం. డెల్యూజనల్‌ సమస్య బారినపడ్డవారికి ఆయా నమ్మకాలకు రుజువు లేదని సహేతుకంగా వివరించినా అంగీకరించరు. తమ నమ్మకం నిజమేనని, తాను అనుకునేదే సరైనదని భావిస్తుంటారు. దానికి అనుగుణంగా ప్రవరిస్తుంటారు కూడా. సాధారణంగా డెల్యూజన్‌ అనేది వ్యక్తికి సంబంధించిందే అయ్యి ఉంటుంది. ఏదో ఒక అబద్ధమైన, అసమంజసమైన నమ్మకంతో ముడిపడి ఉంటుంది. నమ్మకాలకు సంబంధించిన విషయాలను, పరిస్థితులను తమకు తాము ఆపాదించుకొని నిజమనుకుంటుంటారు. దీంతో ఆయా నమ్మకాలు, ఊహలు మనసులో మరింత బలంగా నాటుకుపోతుంటాయి.

ఎన్నో రకాలు

  • ప్రేమ భ్రమ (ఎరటోమేనిక్‌): సినీ నటులు, క్రీడాకారుల వంటి గొప్ప గొప్పవాళ్లు తనని ప్రేమిస్తున్నారని భ్రమించటం దీని ప్రత్యేకత. వారిని కలవటానికి ప్రయత్నిస్తుంటారు. వారి కంట పడకుండా వెంటాడుతుంటారు కూడా.
  • అసూయ భ్రమ (జెలస్‌): దీని బారినపడ్డవారు అవతలి వ్యక్తి గుణం, ప్రవర్తనలను.. ముఖ్యంగా జీవిత భాగస్వాములు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని అనుమానిస్తుంటారు.
  • పేదరిక భ్రమ (పావర్టీ): డబ్బు, సంపద బాగా ఉన్నా తనదగ్గర ఏమీ లేదని అనుకోవటం దీని లక్షణం. తాను చాలా పేదవాడినని భ్రమిస్తూ పైసా ఖర్చు పెట్టరు. దానం చేయరు. ఇతరులను కలవడానికీ ఇష్టపడరు.
  • వేధింపు భ్రమ (పర్‌సిక్యుటరీ): ఇందులో ఇతరులు.. ముఖ్యంగా సన్నిహితులు తనను చిన్నచూపు చూస్తున్నారని అనుకోవటం కనిపిస్తుంది. లేదూ తన మీద నిఘా పెడుతున్నారని, హాని తలపెడుతున్నారని భావిస్తుంటారు.
  • జబ్బుల భ్రమ (సోమాటిక్‌): ఏదో జబ్బు ఉందని, తనలో ఏదో వైకల్యం ఉందని భ్రమించటం ఇందులో కనిపిస్తుంది. ఇలాంటివారు శరీర భాగాలు క్షీణిస్తున్నాయని, కుళ్లుతున్నాయని డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. అంతా బాగానే ఉందని చెప్పినా నమ్మరు. పైగా డాక్టర్లే అబద్ధం చెబుతున్నారంటారు.
  • గొప్ప భ్రమ (గ్రాండియోజ్‌): తాను చాలా గొప్పవాడినని అనుకోవటం దీని ప్రత్యేకత. ఏమీ లేకపోయినా బాగా ధనవంతుడినని, గొప్ప మేధావినని అనుకుంటుంటారు. కొందరు తాను దేవుడిననీ నమ్ముతుంటారు. తనకు ఎంతో నైపుణ్యం ఉందని, గొప్ప విషయాన్ని కనిపెట్టానని అనుకోవటమూ కనిపిస్తుంది.
  • ఆధ్యాత్మిక భ్రమ (డెల్యూజన్‌ ఆఫ్‌ రిలీజియన్స్‌): దీని బారినపడ్డవారు ఆధ్యాత్మికంగా తనకు ప్రత్యేకమైన శక్తులున్నాయని, ఏదైనా చేయగలమని నమ్ముతుంటారు.
  • ద్వంద్వ భ్రమ (డబుల్‌): ఎదుటివారిని వేరేవాళ్లుగా భ్రమించటం దీని లక్షణం. ఇంట్లో వాళ్లు తమ వాళ్లు కాదని, వేరేవారెవరో తమ వాళ్ల వేషంలో వచ్చారని అనుకుంటుంటారు.

కారణాలు రకరకాలు

చాలా మానసిక సమస్యల మాదిరిగానే భ్రమల జబ్బుకు కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. కొందరికి జన్యుపరంగా రావొచ్చు. మెదడులో నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయనాలు అస్తవ్యవస్తం కావటమూ దీనికి కారణం కావొచ్చు. ఒకోసారి ఇతరుల ప్రోద్బలంతోనూ రావొచ్చు (షేర్‌డ్‌ డెల్యూజనల్‌ డిజార్డర్‌). అంటే ఎవరికైనా భ్రమలున్నట్టయితే వారికి సన్నిహితంగా ఉండేవారిపైనా వాటి ప్రభావం పడుతుందన్నమాట. కొందరిలో మద్యం, మాదక ద్రవ్యాల వ్యసనాలూ దీనికి దారితీయొచ్చు. చూపు, వినికిడి సరిగా లేనివారికి.. ఒంటరిగా ఉండేవారికీ దీని ముప్పు పొంచి ఉంటుంది.

గుర్తించొచ్చా?

మిగతా విషయాల్లో మామూలుగానే ఉండటం వల్ల భ్రమల జబ్బును గుర్తించటం కాస్త కష్టమే. ఆయా నమ్మకాల గురించి తెలిసేంతవరకు అలాంటి ఆలోచనలు, భావనలు ఉన్నట్టయినా ఎదుటివారికి తెలియదు. కాకపోతే తమ నమ్మకాల గురించి చెప్పటానికి ప్రయత్నించినప్పుడు, ప్రవర్తన మారినప్పుడు కొంతవరకు పోల్చుకోవచ్చు.

లక్షణాలతోనే నిర్ధారణ

భ్రమల జబ్బును చాలావరకు లక్షణాలను బట్టే గుర్తిస్తారు. నమ్మకాలకు సంబంధించి పొంతనలేని విషయాలు చెప్పటం, అవి నిజమేనని నమ్మటం, ప్రవర్తన తీరుతెన్నుల వంటివన్నీ ఇందుకు ఉపయోగపడతాయి. కనీసం నెల నుంచి భ్రమలకు లోనవుతున్నట్టు, ఇతర మానసిక సమస్యల లక్షణాలేవీ లేవని తేలితే డెల్యూజన్‌ సమస్యగా నిర్ధారణ చేస్తారు. కాకపోతే చాలామందిలో డాక్టర్‌ను సంప్రదించేసరికే సమస్య బాగా ముదిరిపోయి ఉంటుంది.

చికిత్స: మందులు, కౌన్సెలింగ్‌

డెల్యూజనల్‌ సమస్యకు మందులు తప్పకుండా వాడుకోవాల్సి ఉంటుంది. తీవ్రమైన లక్షణాలు గలవారిని, తమను గాయపరచుకోవటం లేదూ ఇతరులను గాయపరచొచ్చని భావించినవారిని పరిస్థితి కుదుట పడేంతవరకు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరిని ముందుగా ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణంలో ఉండేలా చూడటం ముఖ్యం. ఆరోగ్యకరమైన అలవాట్లు, ప్రవర్తన అలవడేలా చూసుకోవాల్సి ఉంటుంది. వీరికి సాధారణంగా పిచ్చి తగ్గటానికి తోడ్పడే మందులే ఉపయోగపడతాయి. ఇవి మెదడులోని డొపమైన్‌ గ్రాహకాలను అడ్డుకోవటం ద్వారా ఆయా నమ్మకాలు నిజాలు కావని అనుకునేలా, వాటిపై సందేహం తలెత్తేలా చేస్తాయి. క్రమంగా తమ ఆలోచనా ధోరణి సరైనది కాదని, ఏదో లోపంతో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని గ్రహించటానికి తోడ్పడతాయి. ఇప్పుడు సెరటోనిన్‌ గ్రాహకాలను అడ్డుకునే కొత్త మందులూ అందుబాటులో ఉన్నాయి. వీరికి మందులతో పాటు కౌన్సెలింగ్‌ కూడా అవసరం. ఇందులో తమకు కలుగుతున్న ఆలోచనలను గుర్తించేలా, వాటిని సరిదిద్దుకునేలా తర్ఫీదు ఇస్తారు. అవసరమైతే కుటుంబానికీ కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

మిగతా విషయాల్లో మామూలుగానే..

ఒకరకంగా భ్రమల జబ్బును ఉన్మాదం (సైకోసిస్‌) అనీ అనుకోవచ్చు. భ్రమలకు కారణమయ్యే నిరాధార, నిర్హేతుక ఆలోచనలన్నీ ఉన్మాదం కిందికే వస్తాయి. అందుకే గతంలో డెల్యూజనల్‌ సమస్యను ఒక రకమైన ఉన్మాద సమస్యగా (పారానాయిడ్‌) భావించేవారు. కాకపోతే భ్రమల్లో మునిగినవారు ఆయా నమ్మకాలను పక్కనపెడితే మిగతా విషయాల్లో మామూలుగానే ఉంటారు. నడవడి, మాటలు, చేతలన్నీ అందరిలాగే ఉంటాయి. భ్రమలకు సంబంధించిన విషయాలే అసహజంగా ఉంటాయి. అందుకే ఎవరూ దీన్ని పిచ్చి అని అనుకోరు. అలా ముద్రవేయరు కూడా. ఉన్మాదంలో రకరకాల మానసిక లక్షణాలు ఒకేసారి కనిపిస్తుంటాయి. డెల్యూజన్‌ సమస్యలో ఏదో ఒక లక్షణమే ఉంటుంది. అంటే ఇది ఒక్క లక్షణానికే పరిమితమైన ఉన్మాదమన్నమాట.

ఇవీ చదవండి:మాక్యూలా క్షీణిస్తే.. భ్రమలకు దారితీస్తుంది!

Love: OCD కాదు OLD గురించి మీకేమైనా తెలుసా...?

ABOUT THE AUTHOR

...view details