ప్రతి ఇంటి పోపుల పెట్టెలో తప్పనిసరిగా ఉండే జీలకర్రలో చాలా మంచి గుణాలున్నాయి. ఇది వంటలకు రుచిని మాత్రమే కాక చక్కటి సువాసను అందిస్తుంది. అంతేకాక ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి. జీలకర్రను పరిమితంగా వాడటం కాకుండా దీనిని సరైన పద్ధతిలో వాడితే ఎన్నో ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేమిటో చూద్దాం రండి..
వంటకాల్లో జీలకర్ర పాత్ర:
మనం వంటలు వండేటప్పుడు జీలకర్రకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాం. తాలింపులో మాత్రమే కాక వంటలు రుచిగా ఉండేందుకు జీలకర్ర పొడిని ఉపయోగిస్తాం. బిర్యానీ, పిండి వంటలు, పలు రకాల కూరలలో జీలకర్రను, జీలకర్ర పొడిని వాడతాం. ఇవి వంటకాలకు మంచి సువాసనతో పాటు రుచిని కూడా ఇస్తాయి. వంటకాల్లో జీలకర్ర పొడిని వాడటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను తగ్గించవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి.
ఆరోగ్యానికి మేలు చేయడంలో జీలకర్ర పాత్ర:
జీలకర్ర వంటకాలకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తుంది. జీలకర్రలో ఐరన్, పాస్ఫరస్, కాల్షియం, సోడియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ వంటివి అధికంగా ఉంటాయి. కాలేయంలో పైత్యరసం తయారవటానికి జీలకర్ర ప్రోత్సహిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, మార్నింగ్ సిక్నెస్ నుంచి జీలకర్ర కాపాడుతుంది. నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకు జీలకర్ర చక్కగా పనిచేస్తుంది. వీటితో పాటు చాలా రకాల వ్యాధుల నుంచి జీలకర్ర ఉపశమనం కలిగిస్తుంది. అవేంటంటే?..
అనీమియాను తగ్గించటానికి..
రక్తంలో హిమోగ్లోబిన్ తయారీకి కావలసిన ముఖ్యమైన పోషకం ఐరన్. అది జీలకర్రలో పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియాను తగ్గించుకునేందుకు సహాయపడుతుంది. రక్తహీనత ఎక్కువగా చిన్నపిల్లలు, మహిళలలో ఎక్కువగా కన్పిస్తుంది. కాబట్టి జీలకర్రను తరచుగా ఆహారంలో తీసుకోవటం మంచిది.
షుగర్ వ్యాధిని తగ్గించటంలో..
షుగర్ వ్యాధిని తగ్గించటంలో జీలకర్ర కీలక పాత్ర వహిస్తుంది. రోజువారీ డైట్లో జీలకర్రను తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల మదుమేహ వ్యాధిని నివారించవచ్చు.
ఇమ్యూనిటీని పెంచటానికి..
వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో జీలకర్ర తోడ్పడుతుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో చేరిన మలినాలను తొలగించి ప్రీ రాడికల్స్‌ను నివారించి వ్యాధుల బారి నుంచి తట్టుకునేలా చేస్తుంది. ఈ విధంగా శరీరానికి కావలసిన వ్యాధి నిరోధక శక్తిని కల్పించటంలో జీలకర్ర ప్రముఖ పాత్రను వహిస్తుంది. రోజూ పరగడుపున జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.