కొవిడ్(Covid-19) వైరస్ సోకితే ప్రధానంగా జ్వరం, దగ్గు, అలసట, రుచి, వాసన కోల్పోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మంపైనా కొవిడ్ ప్రభావం చూపుతున్నట్లు మనకు తెలుసు. కానీ, శరీరంలోని మరో భాగంపైనా కొవిడ్ ప్రభావం చూపుతోంది. అవే వేలి గోళ్లు.
కొవిడ్ సోకిన కొంత మందిలో వేలి గోళ్లు రంగు మారటం, ఆకృతిలో మార్పు వంటివి కనిపించాయి. గోళ్లపై ఎర్రటి అర్ధ చంద్రాకారం ఏర్పడటం ఒక లక్షణం. ఇది వేళ్లలో ఏర్పడే మార్పులో తొలి దశ. కొవిడ్ బారిన పడిన రెండు వారాల్లోపే ఇది కనిపిస్తోంది. ఇలా రంగు మారిన వాటిని కొవిడ్ గోళ్లు(COVID nails)గా చెబుతున్నారు. ఇప్పటికే పలు కేసులు బయటపడ్డాయి. ఎర్రటి అర్ధ చంద్రాకారం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే.. గోరు ప్రారంభంలో ఏర్పడినట్లు గతంలో కనిపించలేదు. ఇలాంటి.. ఆకృతి గోళ్లపై కనిపిస్తే అది కొవిడ్-19 లక్షణాలు ఉన్నట్లుగానే భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. ఎర్రటి అర్ధ చంద్రాకారం ఏర్పడేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వైరస్ ప్రభావానికి గురైన రక్త నాళాల వల్ల ఏర్పడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే.. వైరస్‌పై రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం వల్ల రక్తం గట్టకట్టడం, రంగు మారటమూ జరగొచ్చని తెలిపారు.
ఇలాంటివి ఏర్పడినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు లేని వారిలో ఒక వారం నుంచి నాలుగు వారాల్లో మాయమవుతున్నట్లు చెప్పారు.
శారీరక ఒత్తిడి సంకేతాలు..
కొంతమంది రోగుల్లో చేతి వేళ్లు, కాలి గోళ్లలో గుంటలు పడటం గుర్తించారు. వాటిని బ్యూలైన్స్ అంటారు. ఇవి కొవిడ్ బారిన పడిన నాలుగు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం తర్వాత కనిపించాయి. ఇన్ఫెక్షన్లు, పోషకాహారలోపం, ఔషధాల దుష్ప్రభావలతో ఏర్పడే శారీరక ఒత్తిడి కారణంగా గోళ్ల పెరుగుదలపై ప్రభావం చూపటం వల్ల ఈ బ్యూలైన్స్ ఏర్పడుతుంటాయి. గోళ్లు నెలకు సగటున 2ఎంఎం నుంచి 5 ఎంఎం పెరుగుతాయి. 4-5 వారాల తర్వాత బ్యూలైన్స్ కనిపిస్తాయి.