Cosmetics Impact on Skin: యవ్వనంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే అందుకోసం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. రోజువారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, మానసిక ఒత్తిళ్లు మన చర్మంపై ప్రభావం చూపిస్తాయనే విషయం తెలిసినా.. కాస్మొటిక్స్ వాడకానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చర్మ సంరక్షణకు ఎంత విలువైన కాస్మొటిక్స్ వాడినా.. మన శరీరంలో చర్మానికి కావాల్సిన హార్మోన్ల ఉత్పత్తి సమపాళ్లలో లేకపోతే.. ప్రయోజనం ఉండదు. అందుకే చర్మ సంరక్షణకు ఎలాంటి కాస్మొటిక్స్ వాడాలి? వీటి కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి? లాంటి విషయాలు తెలుసుకోండి.
కాస్మొటిక్స్ వాడకం-చర్మంపై ప్రభావం:కాస్మొటిక్స్ తయారీలో వాడే రసాయనాలు చర్మంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాస్మొటిక్స్ వాడినప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తులో అనేక సమస్యలే కాకుండా అలర్జీలు తలెత్తుతాయి. మొదటగా చర్మ సమస్యలు తెచ్చిపెట్టేది ఫ్రాగ్రెన్సెస్, ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్, మూడోది రంగు రసాయనాలు. ప్రతి సౌందర్య సాధనంలోనూ సువాసన కోసం, చెడిపోకుండా ఉండటం కోసం.. ఆకర్షణీయమైన రంగు కోసం.. ఈ మూడింటినీ తప్పనిసరిగా కలుపుతారు. ఇవే చాలా చర్మ సమస్యలకు మూలం.