తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఊపిరాడట్లేదు... వాష్‌ రూంకు కూడా వెళ్లలేకపోతున్నాం!

ఊపిరాడనివ్వని పీపీఈ కిట్లలో గంటల కొద్దీ విధులు... మధ్యలో కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి... ఇంటికి వచ్చినా కుటుంబ సభ్యులను కలవలేని వైనం... ప్రస్తుతం కరోనా బాధితులకు సేవ చేయడంలో నిమగ్నమైన నర్సుల దీన స్థితి ఇది. అందరికంటే తమకే అధికంగా కరోనా ముప్పు పొంచి ఉందని తెలిసినా వృత్తి ధర్మానికే ఓటేస్తున్నారీ కరోనా వారియర్లు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలను పక్కన పెట్టి మరీ కరోనాతో ప్రత్యక్ష పోరాటం చేస్తున్నారు.

corona warriors problems in covid pandemic situation
corona warriors problems in covid pandemic situation

By

Published : May 4, 2021, 7:31 AM IST

రోజురోజుకీ పెరిగిపోతున్న కొవిడ్‌ బాధితులతో తీవ్ర పని భారంతో సతమతమవుతున్నారు నర్సింగ్‌ సిబ్బంది. విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు కరోనా రోగుల మధ్యే ఉండడంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో- పంజాబ్‌ రాష్ట్రంలోనే అతిపెద్ద కొవిడ్‌ ఆస్పత్రైన పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు నర్సులు అక్కడి పరిస్థితుల గురించి; తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, అనుభవాల గురించి ఇలా పంచుకున్నారు.

మధుమేహం ఉన్నా మహమ్మారితో యుద్ధం చేస్తున్నా!

‘నా పేరు సుఖ్‌చైన్‌ కౌర్ (48). పీజీఐఎంఈఆర్‌లో సీనియర్‌ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నాను. గతేడాది కరోనా ఉద్ధృతి మొదలైనప్పటి నుంచి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో దాదాపు 200 మంది నర్సులకు రోస్టరు విధానంలో డ్యూటీలు కేటాయిస్తున్నారు. అప్పటి నుంచి నేను ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. ఆస్పత్రిలో కొవిడ్ రోగుల సంఖ్య పెరిగిపోతుండడంతో వారాంతపు సెలవులూ తీసుకోలేకపోతున్నా. పైగా నాకు మధుమేహ సమస్య కూడా ఉంది. ఇంట్లో భర్త, ఇద్దరు పిల్లలతో పాటు వయసుపైబడిన అత్తామామలు ఉన్నారు. ఓవైపు కరోనా నుంచి నన్ను నేను కాపాడుకుంటూనే, మరోవైపు నా కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని కలగకుండా విధులు నిర్వర్తించడం నాకో పెద్ద సవాలుగా మారింది’.

మధుమేహం ఉన్నా సరే...

వాష్‌ రూంకు కూడా వెళ్లలేని పరిస్థితి!!

‘ప్రస్తుతం మాకున్న నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో అడుగుపెట్టిన వెంటనే మేం పీపీఈ కిట్ ధరించాలి. దాదాపు ఆరేడు గంటలు ఆ దుస్తుల్లోనే ఉంటూ కొవిడ్‌ రోగులకు సేవలందించాలి. ఈ మధ్యలో వాష్‌ రూంకు వెళ్లడానికి కానీ, ఏమైనా తినడానికి కానీ అసలు అవకాశం ఉండదు. ఒకవేళ అత్యవసరమైతే డైపర్‌ లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి తప్పితే... ఎట్టి పరిస్థితుల్లోనూ పీపీఈ కిట్లు తొలగించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. ఇలా ఎక్కువ సేపు పీపీఈ కిట్లు ధరించడం ఎంతో ఇబ్బందిగా ఉంది. సరిగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. విపరీతమైన వేడి కారణంగా చర్మంపై దద్దుర్లు వస్తున్నాయి. అప్పుడప్పుడు జలుబు, జ్వరం కూడా వేధిస్తున్నాయి’.

ఇంట్లో ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు!

‘గతేడాది నుంచి నేను సరిగా కుటుంబ సభ్యులతో కలవలేకపోతున్నాను. ఆస్పత్రిలో దీన పరిస్థితులు చూసిన తర్వాత ఇంటికొచ్చి ఎవరితోనూ మాట్లాడాలనిపించడం లేదు. అందరూ ఉన్నా... ఒంటరిగానే బతుకుతున్నాననే బాధ నన్ను వేధిస్తోంది. అయితే మా కుటుంబ సభ్యులు నన్ను అర్థం చేసుకుని ఎంతగానో సహకరిస్తున్నారు. వారు అందిస్తోన్న ధైర్యం, భరోసా వల్లే క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నాను. ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు అంతమైపోతుందా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. పరిస్థితులు చక్కబడిన తర్వాత అందరం కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నాం. ఆ రోజు తొందర్లోనే వస్తుందనుకుంటున్నా’ అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చిందీ కరోనా వారియర్.

అందరూ ఉన్నా... ఒంటరై...

వారు కళ్లెదుటే చనిపోతుంటే!

ఇక ఇదే ఆస్పత్రిలో సీనియర్‌ నర్సుగా పనిచేస్తోంది మీనాక్షి వ్యాస్‌. చాలా రోజులుగా కొవిడ్‌ రోగుల మధ్యే ఉండడంతో వైరస్‌తో కలిసి జీవించడం అలవాటైపోయిందని చెబుతోందీ ఫ్రంట్‌ లైన్‌ వారియర్.

కళ్లేదుటే మరణాలు చూస్తూ...
‘కొవిడ్‌ నా వృత్తిగత, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. కరోనా తొలి దశ వ్యాప్తి సమయంలోనే నాకు చాలా భయమేసింది. పని మనిషి ఉన్నట్లుండి ఇంటికి రావడం మానేసింది. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కానీ ఈసారి ఇప్పటివరకు ఇలాంటి ఇబ్బందులేమీ లేవు. అయితే కరోనా మాత్రం తన పని తాను చేసుకుంటూపోతోంది. దురదృష్టవశాత్తూ రెండో దశ వ్యాప్తిలో 25 - 40 ఏళ్ల మధ్య వయసు వాళ్లే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. మా రాష్ట్రంలోనే కాదు దేశమంతటా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. నా కళ్లెదుటే ఎంతోమంది యువకులు కరోనాతో కన్నుమూశారు. ఆ సమయంలో వారి కుటుంబ సభ్యుల రోదనలను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి మాది..’

వైరస్‌తో కలిసి జీవిస్తున్నా!

‘ఇక నేను కూడా ఎక్కువ సమయం కరోనా బాధితుల మధ్యే గడుపుతుండడంతో వైరస్‌తో కలిసి ఎలా జీవించాలో నేర్చుకున్నాను. అయితే ఈ మహమ్మారి కారణంగా నా ఇద్దరు పిల్లలను కనీసం చూడలేకపోతున్నాను. గత రెండు నెలలుగా నా 11 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కుమారుడు మా అమ్మానాన్నల ఇంట్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వారి ఆలనాపాలన చూసే పరిస్థితుల్లో నేను లేను’ అని ఆవేదన చెందుతోందీ కరోనా యోధురాలు.

నర్సులే కాదు... ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. మరి కరోనా నిబంధనలు, జాగ్రత్తలు పాటించి మనమూ వైరస్‌ వ్యతిరేకపోరులో భాగస్వాములమవుదాం. వైద్య సిబ్బందిపై పనిభారం పడనీయకుండా చేద్దాం.

ఇదీ చూడండి:హోమ్ ఐసొలేషన్... ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details