చిన్నారులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు త్వరగా వైరస్, బ్యాక్టీరియా లాంటి వ్యాధికారక క్రిముల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే కరోనా కట్టడి కోసం పెద్దలు మాస్క్ ధరించినట్లు చిన్న పిల్లలు ధరించలేరు. కాబట్టి చంటి పిల్లల ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
చేతులు శుభ్రం చేసుకోండి!
చంటి బిడ్డలు సాధ్యమైనంతవరకు ఎక్కువగా తల్లుల దగ్గరే ఉంటారు. కాబట్టి తమ చిన్నారుల ఆరోగ్యం విషయంలో తల్లులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. చిన్నారికి పాలు పట్టేముందు, పాలు పట్టాక చేతులు శుభ్రం చేసుకోవాలి. డైపర్లు మార్చేటప్పుడు, పెంపుడు జంతువులను తాకిన తర్వాతా కనీసం 20 సెకన్ల పాటు హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కోవాలి. మధ్యమధ్యలో చేతులకు శానిటైజర్ రాసుకుంటూ ఉండాలి. తల్లితో పాటు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఈ జాగ్రత్తలను పాటించాల్సిందే. ఎవరైనా సరే.. పాపాయిని చేతిలోకి తీసుకొనే ముందు తమ చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్న విషయం మరవకూడదు. ఇక పిల్లలు కూడా నిరంతరం ఇంట్లో పాకడం, నేలపైనే పడుకోవడం, బొమ్మలతో ఆడుకోవడం.. వంటివి చేస్తుంటారు. కాబట్టి వారి చేతులను కూడా ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేయాలి.
డైపర్లను మారుస్తూ ఉండండి!
కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకోకూడదంటే చిన్నారి వ్యక్తిగత శుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కనీసం 2-3 గంటలకోసారి చంటి బిడ్డల డైపర్లను మారుస్తూ ఉండాలి. ఇక పాపాయికి స్నానం చేయించాక ఉపయోగించే టవల్‌ను కూడా ఎప్పటికప్పుడు వేడి నీళ్లలో ఉతికి ఎండలో ఆరేయడం ఉత్తమం. తద్వారా ఎలాంటి వ్యాధికారక క్రిములు దరిచేరవు. ఇక ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు తిరిగే పరిసరాలను క్రిమి సంహారక మందులతో శుభ్రం చేస్తే వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు నశిస్తాయి.
దుస్తులను వేరుగా ఉంచండి!