కొవిడ్‌పై ఇలినాయిస్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. కడుపులోని బ్యాక్టీరియా కొవిడ్ తీవ్రతను పెంచుతుందని వీరి పరిశోధనలు తేల్చాయి. ఇందుకోసం వీళ్లు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన వందమంది రోగుల్నీ... ఆరోగ్యంగా ఉన్న మరో వందమందినీ గమనించారట.
పొట్టలోని బ్యాక్టీరియాతో కరోనా! - కొవిడ్ వార్తలు
పొట్టలోని బ్యాక్టీరియాకీ మెదడు పనితీరుకీ సంబంధం ఉందని ఇప్పటికే కొన్ని పరిశోధనల్లో స్పష్టమైంది. ముఖ్యంగా ఊబకాయం, ఆల్జీమర్స్, డిప్రెషన్ వంటి సమస్యలకి ప్రధాన కారణం బ్యాక్టీరియా లోపమే అంటున్నారు. అయితే కొత్తగా కొవిడ్ తీవ్రతకీ బ్యాక్టీరియానే కారణం అంటున్నారు ఇలినాయిస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.
ఆరోగ్యంగా ఉండేవాళ్లలో ఉండే బైఫిడొబ్యాక్టీరియా, పీకలిబ్యాక్టీరియా, యుబ్యాక్టీరియా... వంటి బ్యాక్టీరియా రకాలు కొవిడ్ రోగుల్లో కనిపించలేదట. వీటికి బదులుగా వాళ్లలో రుమినోకాకస్, బ్యాక్టీరియోడ్స్ వంటివి ఉన్నాయట. దీన్నిబట్టి రోగనిరోధకశక్తిని పెంచే బ్యాక్టీరియాలోని అసమతౌల్యం వల్లే కొందరిలో కరోనా సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయట. వాళ్లలో కొవిడ్ వచ్చి తగ్గిన కొన్ని నెలల తరవాతా బ్యాక్టీరియాలో అసమతౌల్యం అలాగే ఉందట. అదే సమయంలో రోగనిరోధకశక్తిని పెంచే బ్యాక్టీరియా ఉన్నవాళ్లలో కొవిడ్ ప్రభావం తక్కువగా ఉంది. దాంతో కొవిడ్ రావడానికే కాదు, వచ్చాక త్వరగా తగ్గకపోవడానికి కారణం కూడా పొట్టలోని బ్యాక్టీరియా అసమతౌల్యమే అంటున్నారు పరిశోధకులు.
ఇదీ చూడండి:తెలంగాణలో మరో 197 కరోనా కేసులు, ఒకరు మృతి