శుచి-శుభ్రత
- మన చుట్టూ ఉండే ఉపరితలాలపై ఎన్నో సూక్ష్మ క్రిములుంటాయి.. ఫుడ్ పాయిజనింగ్‌కి ఇవే ప్రధాన కారణం. కాబట్టి కాస్త కష్టమైన పనైనా.. కిచెన్‌ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.
- వంట చేసే ముందు-తర్వాత-మధ్యమధ్యలో, తినే ముందు.. చేతుల్ని సబ్బు నీటితో 20 సెకన్ల పాటు రుద్ది మరీ కడుక్కోవాలి.
- వంటకు ముందు, తర్వాత.. పాత్రలు, కటింగ్ బోర్డులు, కిచెన్ ఉపరితలాలను (కౌంటర్ టాప్స్).. సబ్బు నీరు, వేడి నీటితో శుభ్రం చేయాలి.
- పండ్లు, కాయగూరల్ని కుళాయి నుంచి నేరుగా వచ్చే నీటి కింద ఉంచి శుభ్రం చేయాలి.
వీటిని కలపద్దు!
- పచ్చి మాంసం, కోడిగుడ్లు, చికెన్, చేపలు.. వంటి వాటి వల్ల క్రిములు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వండకుండా నేరుగా తినే పండ్లు, ఇతర పదార్థాల పైకి ఇవి చేరితే మరింత ప్రమాదకరం.. కాబట్టి వీటిని దేనికదే విడివిడిగా, ఇతర పదార్థాలతో కలపకుండా జాగ్రత్తపడాలి. ఫ్రిజ్‌లోనూ వీటిని వేటికవే సెపరేట్‌గా నిల్వ చేయాలి.
- మాంసం, ఇతర నిత్యావసరాల్ని కొని తీసుకొచ్చేటప్పుడు కూడా ఒకదానికొకటి అంటకుండా వేర్వేరు బ్యాగుల్లో ప్యాక్ చేయించుకోవడం మంచిది. తద్వారా మాంసంలోని పచ్చిదనం ఇతర పదార్థాలకు అంటకుండా జాగ్రత్తపడచ్చు.
- మాంసం, ఇతర కాయగూరల్ని కట్ చేయడానికి వేర్వేరు కటింగ్ బోర్డులు, కత్తులు, ప్లేట్స్; వండడానికి వేర్వేరు పాత్రల్ని ఉపయోగించడం అన్ని విధాలా ఆరోగ్యకరం!
అధిక ఉష్ణోగ్రతల్లో..!
Cooking meat healthy way : ఆహారాన్ని అధిక ఉష్ణోగ్రతల్లో ఉడికించినప్పుడే అందులో ఉండే క్రిములు నశించిపోతాయి. అయితే ఆ విషయాన్ని ఫుడ్ థర్మామీటర్‌తో తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో ఉడికించాక వాటి అంతర్గత ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలో చూద్దాం..!
- Meat cooking temperature : మటన్ (మేక మాంసం) - 160 డిగ్రీల ఫారన్‌హీట్ (71.1 డిగ్రీల సెల్సియస్)
- చికెన్ - 165 డిగ్రీల ఫారన్‌హీట్ (73.8 డిగ్రీల సెల్సియస్)
- కోడిగుడ్లు - తెల్లసొన, పచ్చసొన గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఈ క్రమంలో వాటిని కాస్త వత్తినప్పటికీ విడిపోకూడదు.
- కోడిగుడ్లతో చేసిన కూరలు/ఇతర వంటకాలు - 160 డిగ్రీల ఫారన్‌హీట్ (71.1 డిగ్రీల సెల్సియస్)
- చేపలు, ఇతర సీఫుడ్ - 145 డిగ్రీల ఫారన్‌హీట్ (62.7 డిగ్రీల సెల్సియస్)