గుండె లోపాలు అనగానే అదేదో అరుదైన సమస్యనే చాలామంది భావిస్తుంటారు. నిజానికిది పెద్ద సమస్య. ప్రతిరోజూ ప్రతి వెయ్యి కాన్పుల్లో 10 మంది శిశువులు.. అంటే ఒక శాతం మంది గుండె లోపాలతో పుడుతున్నారు! మన తెలుగు రాష్ట్రాల్లో ఏటా 20వేల మంది పిల్లలకు పుట్టుకతోనే గుండె లోపాలు ఉంటుండటం గమనార్హం. ఇటీవలి కాలంలో వీటిపై ఒకింత అవగాహన పెరగటం నిజమే. లోపాలను తొలిదశలోనే గుర్తించగలుగుతున్నాం కూడా. ప్రభుత్వ కార్యక్రమాలు వంటివి సైతం చైతన్యం పెరగటానికి దోహదం చేస్తున్నాయి. ఇలాంటివన్నీ సమస్యను ముందే పట్టుకోగలగటానికి తోడ్పడుతున్నా ఇప్పటికీ ఎంతోమంది సరైన సమయంలో, సరైన చికిత్సలకు నోచుకోలేకపోవటం విచారకరం. కేవలం 20% మంది శిశువులకే సరైన సమయంలో చికిత్స అందుతోంది. దీనికి ప్రధాన కారణం సంక్లిష్టమైన గుండె లోపాలకు చాలా చోట్ల తగు చికిత్స సదుపాయాలు లేకపోవటం. చాలా ఆసుపత్రుల్లో సాధారణ గుండె లోపాలకే చికిత్స చేస్తుండటం.. కొన్ని ఆసుపత్రుల్లోనే అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉంటుండటం అవరోధంగా నిలుస్తోంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, పేదరికం వంటి కారణాలతోనూ ఎంతోమంది పిల్లలు అసలు శస్త్రచికిత్సలకే నోచుకోవటం లేదు. దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టటం ఎంతైనా అవసరం. గుండె లోపాలకు వీలైనంత త్వరగా చికిత్స చేయిస్తే మంచి ఫలితం కనిపిస్తుందని తెలుసుకోవాలి. వీటిపై అవగాహన కలిగుండటం మన బాధ్యతని గుర్తించాలి.
సమస్యలు- రకరకాలు
అతి సున్నితమైన గుండె నిర్మాణం సంక్లిష్టమైంది. పిండంలో 21వ రోజుకే గుండె కొట్టుకోవటం, రక్త ప్రసరణ మొదలవుతాయి. గుండె గదులు 4 వారాల కల్లా ఏర్పడతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో ఎక్కడ పొరపాట్లు జరిగినా లోపాలకు దారితీస్తాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి..
గుండెలో రంధ్రాలు (సెప్టల్ డిఫెక్ట్స్):గుండె లోపాల్లో సుమారు 25% ఇవే. ఒకరకంగా ఇవి సహజమే! మన గుండెలో నాలుగు గదులు- కర్ణికలు (పై రెండు గదులు), జఠరికలు (కింది రెండు గదులు) ఉంటాయి. అలాగే గుండెను కుడి ఎడమలుగా రెండు భాగాలుగానూ విభజించుకోవచ్ఛు శరీరంలోని వివిధ అవయవాల నుంచి వచ్చిన ‘చెడు’ రక్తాన్ని కుడి భాగం తీసుకొని ఊపిరితిత్తుల్లోకి పంపిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ను నింపుకొని వచ్చిన ‘మంచి’ రక్తాన్ని ఎడమ భాగం (జఠరిక) గ్రహించి అవయవాలకు పంపిస్తుంది. ఈ రెండు భాగాల మధ్య ఒక పొర (సెప్టమ్) గోడ మాదిరిగా అడ్డుగా ఉంటుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం చెడు రక్తాన్ని తల్లి శరీరమే శుద్ధి చేస్తుంటుంది. ఇది పిండానికి చేరుకోవటానికి కాన్పయ్యే వరకూ పిండం గుండెలోని పై రెండు గదుల మధ్య సహజంగానే ఒక రంధ్రం (ఫొరామినా ఒవేల్) ఉంటుంది. బిడ్డ పుట్టి.. శ్వాస పీల్చుకొని, ఊపిరితిత్తులు పనిచేయటం మొదలెట్టాక దీని అవసరం ఉండదు. ఇది క్రమంగా.. 4-6 వారాల్లో మూసుకుపోతుంది. కాకపోతే కొందరిలో రంధ్రం మూసుకుపోకుండా తెరచుకునే ఉంటుంది. ఇది కర్ణికల మధ్య గోడలో (ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్) గానీ జఠరికల మధ్య గోడలో (వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్స్) గానీ ఉండొచ్ఛు బృహద్ధమని, గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి రక్తాన్ని తీసుకెళ్లే పుపుస ధమని మధ్య రంధ్రం (ఏపీ విండో).. బృహద్ధమనినీ, పుపుస ధమనినీ కలిపే గొట్టం మూసుకుపోకపోవటం (పేటెంట్ డక్టస్ ఆర్టిరియోసస్) వంటి సమస్యలూ ఈ కోవలోవే.
గదుల లోపాలు:కొందరికి గుండె కింది గదులు రెండూ పూర్తిగా తిరగబడి పోవటమూ (ఎల్-ట్రాన్స్‌పొజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్) చిక్కులు తెచ్చిపెడుతుంది. కొందరికి ఒక జఠరిక చిన్నగా ఉండొచ్చు (హైపోప్లాస్టిక్ రైట్ హార్ట్ లేదా లఫె్ట్ హార్ట్ సిండ్రోమ్). పూర్తిగా ఏర్పడకపోవచ్ఛు లేదూ కవాటం లేకపోవచ్చు (ట్రైకస్పిడ్ అట్రీషియా). దీంతో పిల్లలు నీలంగా అవుతారు. ఆయాసం వంటి గుండె వైఫల్య లక్షణాలతోనూ బాధపడుతుంటారు.
రక్తనాళ సమస్యలు:కొందరికి గుండె నుంచి శరీరానికి రక్తాన్ని తీసుకెళ్లే బృహద్ధమని కుంచించుకుపోవచ్చు (కోర్‌క్టేషన్ ఆఫ్ ద అయోర్టా). ఇది రక్తపోటు పెరగటానికి, గుండె దెబ్బతినటానికి దారితీస్తుంది. కొందరిలో గుండె నుంచి వెళ్లే ప్రధాన రక్తనాళాలు అటూఇటూ మారిపోయి ఉండొచ్చు (డి-ట్రాన్స్‌పొజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్). దీంతో శరీరం నుంచి గుండెకు వచ్చే రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండానే తిరిగి శరీరానికి వెళ్లొచ్ఛు లేదూ ఊపిరితిత్తుల నుంచి గుండెకు వచ్చే రక్తం తిరిగి ఊపిరితిత్తుల్లోకే చేరుకోవచ్ఛు కొందరికి బృహద్ధమని, గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి రక్తాన్ని తీసుకెళ్లే ధమనులకు బదులు ఒకే రక్తనాళం ఉండొచ్చు (ట్రంకస్ ఆర్టిరియోసిస్). ఇలాంటి సమస్యలు గల పిల్లల్లో మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోయి ఒళ్లంతా ప్రసరిస్తుంటాయి. దీంతో పెదవులు, నాలుక, వేళ్లు నీలంగా, నల్లగా అయిపోతుంటాయి.
కవాట సమస్యలు:గుండె గదుల్లో నాలుగు కవాటాలు (వాల్వ్) ఉంటాయి. ఇవి ఒక వైపునకే రక్తం సరఫరా అయ్యేలా చేస్తాయి. వీటిల్లో ఏవైనా సరిగా ఏర్పడకపోయినా, పూర్తిగా బిగుసుకోకుండా రక్తం లీక్ అవుతున్నా సమస్య తలెత్తొచ్ఛు గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం వెళ్లటాన్ని నియంత్రించే కవాటం (పల్మనరీ వాల్వ్) లోపాలు ఎక్కువగా చూస్తుంటాం. కొందరికి గుండె నుంచి శరీరానికి రక్తం పంప్ కావటానికి తోడ్పడే కవాటం సరిగా బిగుసుకోకపోవచ్చు (అయోర్టిక్ స్టెనోసిస్). కొందరికి పుట్టిన తర్వాత కొద్ది రోజులకు కవాటం సరిగా మూసుకుపోక రక్తం లీక్ కావొచ్ఛు దీనికి సాధారణంగా రుమాటిక్ జ్వరం వంటి ఇతరత్రా కారణాలు దోహదం చేస్తుంటాయి.
నిర్ధారణ ఎలా?
- ఈసీజీ, ఎక్స్‌రే:ఇందులో గుండె కండరం మందం తెలుస్తుంది. ఛాతీ ఎక్స్‌రేలో గుండె సైజు ఎలా ఉంది? ఊపిరితిత్తులకు ఎంత రక్తం వెళ్తోంది? వంటి వివరాలు తెలుస్తాయి.
- ఎకో కార్డియోగ్రామ్:లోపాల తీవ్రత, రంధ్రాల సంఖ్య, సైజు వంటివన్నీ బయటపడతాయి. ఇది ఎప్పుడు, ఎలాంటి చికిత్స చేయాలన్నది నిర్ణయించుకోవటానికీ ఉపయోగపడుతుంది.
- సీటీ యాంజియోగ్రామ్, ఎంఆర్‌ఐ:గుండె తీరుతెన్నుల వంటివన్నీ వీటిల్లో బయటపడతాయి.
- కొందరికి రక్తనాళం ద్వారా గొట్టాన్ని పంపించి పరీక్ష చేయాల్సి రావొచ్చు.
కారణాలేంటి?
పిండం ఎదిగే సమయంలో గుండె లోపాలు తలెత్తటానికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
- పోషకాల లోపం:గుండె లోపాల విషయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని గురించే. గర్భం ధరించిన తొలినాళ్లలో పోషకాల లోపం.. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం గర్భస్థ శిశువులో గుండె లోపాలకు దారితీయొచ్చు.
- గర్భిణికి ఇన్‌ఫెక్షన్లు:తొలి మూడు నెలల్లో.. ముఖ్యంగా పిండంలో గుండె ఏర్పడే దశలో రుబెల్లా వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు సైతం లోపాలకు దారితీయొచ్చు.
- మేనరిక వివాహాలు:మేనరిక పెళ్లి చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన కారణాలతోనూ గుండె లోపాలు తలెత్తొచ్ఛు మేనరిక వివాహాలు చేసుకున్నవారికి పుట్టబోయే పిల్లల్లో ప్రతి వెయ్యిమందిలో 40-50 మందికి గుండె లోపాలు ఉండే అవకాశముంది. వీరికి ఇతరత్రా లోపాల ముప్పూ ఎక్కువే.
- జన్యు లోపాలు:కొందరికి జన్యు లోపాలతోనూ గుండె నిర్మాణ ప్రక్రియ అస్తవ్యస్తం కావొచ్చు.
- పురుగుమందులు, రేడియేషన్: గర్భం ధరించిన తొలివారాల్లో పురుగు మందులు, రేడియేషన్, కొన్నిరకాల మందుల ప్రభావానికి గురైనా గుండె లోపాలు తలెత్తొచ్చు.
- పొగ, మద్యం అలవాట్లు:గర్భధారణ సమయంలో పొగ తాగటం, మద్యం తాగటం వంటి అలవాట్లతోనూ గుండె ఏర్పడే ప్రక్రియ అస్తవ్యస్తం కావొచ్ఛు ఇది లోపాలకు దారితీయొచ్చు.
గుర్తించటమెలా?
1. గుండె వైఫల్య లక్షణాలు: