దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మహమ్మారిలో కొత్త వేరియంట్ల కారణంగా వైరస్.. ఇంతకుముందుతో పోలిస్తే వేగంగా వ్యాపిస్తోంది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిపై పలు అపోహలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డయేరియా, గ్యాస్ట్రో, అంతర్గత ఆరోగ్య సమస్యలు తలెత్తడం.. కొత్త స్ట్రెయిన్ లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఈటీవీ భారత్తో ముఖాముఖిలో కీలక విషయాలు వెల్లడించారు డాక్టర్ రాజేశ్ వుక్కాల.
ప్రస్తుతం కేసుల తీవ్రత ఎక్కువగా ఉందా?
చికిత్స కంటే నివారణ మేలు. వైరస్ సోకినట్లు ఏమైనా లక్షణాలు కనిపిస్తే తక్షణం కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. అందులో పాజిటివ్ అని తేలితే హోమ్క్వారంటైన్ అవ్వాలి. దీని ద్వారా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.
ఆక్సిజన్ లెవెల్స్, శరీర ఉష్ణోగ్రత ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఏమైనా కొత్త లక్షణాలు వస్తే వాటిని గుర్తించాలి. లక్షణాలు తీవ్రంగా ఉండి.. గాలి తీసుకోవడం ఇబ్బందికరంగా మారితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరడం మంచిది.
వీటితో పాటు ఆరోగ్య శాఖ హెచ్చరికలను అనుసరించి కొవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటించాలి.