తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సీజనల్​ వ్యాధులకు ఈ జాగ్రత్తలతో చెక్​! - వ్యాధులు

తొలకరి చినుకులు పడగానే ప్రకృతి పులకరిస్తుంది. మన మనసూ పరవశిస్తుంది. అప్పటివరకూ ఉడికించిన ఎండల మంట చల్లబడుతుంది. ఉక్కిరిబిక్కిరి చేసిన ఉక్కపోత మాయమవుతుంది. చల్లటి పిల్ల గాలులు, వానజల్లుల తుంపర ఒంటిని తాకుతుంటే ఎక్కడలేని హాయి, హుషారు పెల్లుబుకుతాయి. అలాగని అంతా ఆనందమే అనుకోవటానికీ లేదు. వాన కాలం.. చినుకులతో పాటు కొన్ని సమస్యలనూ మోసుకొస్తుంది. చాలావరకివి వాటంతటవే తగ్గిపోయేవే కావొచ్చు. అయినా జాగ్రత్త అత్యవసరం. లేకపోతే గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు అవుతుంది.

common monsoon deseases
వర్షాకాలం వ్యాధులు

By

Published : Jul 12, 2021, 10:26 AM IST

మనం 'కాల జీవులం'. మన జీవనం, ఆరోగ్యం అన్నీ కాలాలతో ముడిపడినవే. వీటికి అనుగుణంగా నడచుకోవటంలోనే ఉంది ఆరోగ్య రహస్యం. ముఖ్యంగా కాలాలు మారిపోయే సమయంలో మరింత అప్రమత్తత తప్పనిసరి. ఉన్నట్టుండి మారిపోయే వాతావరణం.. ఒక్కసారిగా తగ్గిపోయే ఉష్ణోగ్రతలు. వైరస్‌లకు, సూక్ష్మక్రిములకు ఇంతకన్నా ఇంకేం కావాలి? వానకాలంలో ఇలా హఠాత్తుగా ఉష్ణోగ్రతలు మారిపోయే సమయంలోనే కొన్ని వైరస్‌లు తెగ విజృంభించేస్తుంటాయి. జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరాల వంటి ఇన్‌ఫెక్షన్లను తెచ్చిపెడుతుంటాయి. ఇదొక్కటే కాదు.. వర్షపు నీరు మూలంగా మనం తాగే నీరూ కలుషితమవుతుంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇది రకరకాల సమస్యలకు దారితీస్తుంది. కడుపునొప్పి, వాంతులు, నీళ్ల విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్‌ వంటివన్నీ దీని ఫలితాలే. ఇక వానకాలంలో దోమల గురించి చెప్పేదేముంది? ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోవటం వల్ల వీటి సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దోమ కాటు చాలా ప్రమాదకరమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిని బలితీసుకుంటున్నది ఇదే. ఏటా 70 కోట్ల మంది దోమలతో వ్యాపించే మలేరియా, డెంగీ వంటి జబ్బుల బారినపడుతుండగా.. వీరిలో 10 లక్షల మంది చనిపోతుండటం గమనార్హం. ఇలాంటి సమస్యలు వానకాలంలో మరింత ఎక్కువ. కాబట్టి వర్షకాల జబ్బులపై అవగాహన పెంచుకోవటం, తగు జాగ్రత్తలతో ముందుగానే నివారించుకోవటం ముఖ్యం.

జలుబు

దీనికి మూలం రైనో వైరస్‌ తరగతికి చెందిన వైరస్‌లు. ఇవి మహా గట్టి పిండాలు. ఎప్పటికప్పుడు రూపం మార్చేసుకుంటుంటాయి. కొన్ని కొత్తగానూ పుట్టుకొస్తుంటాయి. అందువల్ల మన రోగనిరోధక వ్యవస్థకు వీటిని గుర్తుంచుకోవటం, వీటిని ఎదిరించే యాంటీబాడీలను తయారుచేసుకోవటం కష్టం. మనకు జలుబు తరచుగా పట్టుకోవటానికి ఇదీ ఒక కారణమే. పడిశం పది రోగాల పెట్టు అంటారు. ఇది ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంట నీరు కారటం, ఒళ్లు నొప్పులు, అలసట, బడలిక, జ్వరం వంటి వాటితో బాగా వేధిస్తుంది. సాధారణంగా వారం పాటు ఉంటుంది. ఆ తర్వాత చాలావరకు దానంతటదే తగ్గిపోతుంది. ముక్కు కారటం, ఒళ్లు నొప్పుల వంటివి మరీ ఎక్కువగా ఉంటే ఉపశమనానికి మందులు వాడుకోవచ్చు. జ్వరం ఎక్కువగా ఉంటే తడిబట్టతో ఒళ్లు తుడుచుకోవాలి, ప్యారాసెటమాల్‌ వంటి మాత్రలు వేసుకోవాలి. నీరు, ద్రవాలు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు జలుబు మొదలవగానే యాంటీబయోటిక్స్‌ ఆరంభించెయ్యటం. ఇవి జలుబుకు పనిచెయ్యవు. వారం దాటినా బాధలు తగ్గకుండా.. పసుపు లేదా ఆకుపచ్చ కఫంతో దగ్గు వేధిస్తున్నా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ మొదలైందని అనుకోవచ్చు. అప్పుడు మాత్రమే యాంటీబయోటిక్స్‌ వాడాలి. అదీ వైద్యుల సలహా మేరకు.. పూర్తి మోతాదులో, పూర్తి కాలం వేసుకోవాలి.

ఫ్లూ జ్వరం

దీనికి మూలం ఫ్లూ వైరస్‌లు. ఫ్లూ జ్వరంలో శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు విపరీతంగా వేధిస్తాయి. గొంతునొప్పీ ఉండొచ్చు. ఇవి రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతాయి. మొదట్లో పెద్ద చికిత్సలేం అవసరం లేదు. ప్యారాసెటమాల్‌ మాత్రల వంటివి తీసుకుంటే చాలు. మూడు రోజులైనా బాధలు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే కొందరిలో ఫ్లూ వైరస్‌ ఊపిరితిత్తులకూ వ్యాపించి న్యుమోనియాగా మారొచ్చు. శ్వాస కష్టమవుతున్నా, దగ్గు, ఆయాసం వేధిస్తున్నా, జ్వరం తగ్గకుండా కొనసాగుతున్నా, తెమడతో పాటు రక్తం పడుతున్నా ఏమాత్రం తాత్సారం చేయరాదు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, మధుమేహంతో బాధపడేవారు, గర్భిణులు, గుండెజబ్బులు గలవారు, ఉబ్బసం వంటి శ్వాస సమస్యలు గలవారు, పసి పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

వైరల్‌ జ్వరాలు

వీటిని ‘విష జ్వరాలు’ అనీ పిలుచుకుంటుంటారు. జలుబు వంటి లక్షణాలేవీ లేకుండా ఇవి ఉన్నట్టుండి, తీవ్రంగా మొదలవుతాయి. జ్వరం 102 డిగ్రీల కన్నా ఎక్కువే ఉండొచ్చు. విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, బడలిక వేధిస్తాయి. కొందరిలో ఒంటి మీద దద్దు, వాంతులు, అరుదుగా విరేచనాలూ ఉండొచ్చు. వైరల్‌ జ్వరాలు తీవ్రంగా ఉన్నప్పటికీ 3, 4 రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. జ్వరం తగ్గటానికి ప్యారాసెటమాల్‌ మాత్రల వంటివి తీసుకుంటే సరిపోతుంది. తగినంత విశ్రాంతి అవసరం. ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. కొన్నిసార్లు డెంగీ, మలేరియా వంటివీ విష జ్వరాల్లా అనిపించొచ్చు. కాబట్టి జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. కొందరు జ్వరం ఉన్నప్పుడు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటుంటారు. ఇది తప్పు. కొన్ని వైరల్‌ జ్వరాల్లో ప్లేట్‌లెట్‌ కణాలు తగ్గుతాయి. నొప్పి మందులు వాడితే ఇవి మరింత తగ్గిపోయి, ఒంట్లో రక్తస్రావం జరిగే ప్రమాదముంది.

నీళ్ల విరేచనాలు (డయేరియా)

వీటికి మూలం బ్యాక్టీరియా, వైరల్‌, పరాన్నజీవుల ఇన్‌ఫెక్షన్లు. రోజుకు మూడు, అంతకన్నా ఎక్కువసార్లు నీళ్ల విరేచనాలు అవుతుంటే డయేరియాగా భావించొచ్చు. ఇది రెండు మూడు రోజుల తర్వాత దానంతటదే తగ్గిపోతుంటుంది. అయితే నీళ్ల విరేచనాలతో ఒంట్లో నీటిశాతం తగ్గే ప్రమాదముంది. దీన్ని నివారించుకోవటం చాలా కీలకం. పరిస్థితి ముదరకుండా కాచి, చల్లార్చిన నీటిలో ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపుకొని తరచుగా తాగుతుండాలి. విరేచనమైన ప్రతిసారీ ఈ ద్రావణాన్ని తప్పకుండా తాగాలి. ఓఆర్‌ఎస్‌ పొడి అందుబాటులో లేకపోతే గ్లాసు నీటిలో చారెడు పంచదార, చిటికెడు ఉప్పు కలుపుకొని అయినా తాగొచ్చు. మజ్జిగ, కొబ్బరినీళ్లు, సగ్గుబియ్యం జావ, పప్పు ఉడకబెట్టిన నీళ్ల వంటివీ తీసుకోవచ్చు. తగినన్ని ద్రవాలు తీసుకోకపోతే ఒంట్లో నీటిశాతం బాగా పడిపోయి ప్రమాదకరంగా పరిణమించొచ్చు. పసి పిల్లలకు, వృద్ధులకు ఇది మరింత హాని కలిగించొచ్చు. ఇలాంటి సమయాల్లో ఆసుపత్రిలో చేర్చి సెలైన్‌ పెట్టాల్సి పరిస్థితి తలెత్తుతుంది.

కామెర్లు

దీనికి ప్రధాన కారణం హెపటైటిస్‌ ఎ, హెపటైటిస్‌ ఇ వైరస్‌లు. ఇవి చాలావరకు కలుషితమైన తాగునీరు, ఆహారం ద్వారానే వ్యాపిస్తాయి. ఈ వైరస్‌లతో వచ్చే కామెర్లు రెండు మూడు వారాల్లో సహజంగానే తగ్గిపోతాయి. కొన్నిసార్లు పెద్దవారిలో నెలల తరబడీ వేధించొచ్చు. తగ్గకుండా వేధించే కామెర్లను నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. దీని బారినపడ్డవారిలో కళ్లు, చర్మం పసుపు పచ్చగా మారిపోతుంటాయి. ఆకలి తగ్గిపోతుంది. మొదట్లో వాంతులు, కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలే ఉంటాయి. నాలుగైదు రోజుల తర్వాత మూత్రం పసుపు పచ్చగా రావటం.. క్రమంగా చర్మం, కంట్లో తెల్లని భాగం పచ్చగా అవటం మొదలవుతాయి. కొందరికి మలం తెల్లగా, నల్లగా మారిపోవచ్చు. కడుపు నొప్పి, చికాకు, బలహీనత తలెత్తొచ్చు. కామెర్లు అనగానే చాలామంది ఆకు పసర్లు, చెట్ల మందులంటూ తాత్సారం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కామెర్ల రకాన్ని నిర్ధరణ చేసుకొని, తగు చికిత్స తీసుకోవటం తప్పనిసరి.

గొంతునొప్పి

దీనికి చాలావరకు వైరస్‌లే కారణం. నూటికి 90 మందికి సమస్య దానంతటదే తగ్గుతుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసుకొని పుక్కిట పడితే ఉపశమనం కలుగుతుంది. జ్వరం తట్టుకోలేకపోతుంటే ప్యారాసెటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు. కొందరికి స్ట్రెప్టోకాకల్‌ వంటి బ్యాక్టీరియాతోనూ గొంతునొప్పి రావొచ్చు. ఇలాంటివారికి కొద్దిరోజులు యాంటీబయోటిక్స్‌ అవసరమవుతాయి. రెండు మూడు రోజుల తర్వాత గొంతునొప్పి తగ్గకపోయినా, గొంతులో తెల్లటి చీము, పొక్కుల వంటివి కనబడినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్న పిల్లల్లో గొంతు నొప్పిని తేలికగా తీసుకోవటానికి లేదు. కొందరు పిల్లల్లో ఇది గుండెను దెబ్బతీసే జ్వరానికి (రుమాటిక్‌ ఫీవర్‌) దారితీస్తుంది. కాబట్టి నిర్లక్ష్యం పనికిరాదు.

టైఫాయిడ్‌

ఇది కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాపిస్తుంది. దీనికి మూలం సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా. ఇది టైఫాయిడ్‌ బారినపడ్డవారు, దాన్నుంచి కోలుకుంటున్నవారు మల విసర్జన చేసినపుడు బయటకు వస్తుంది. దీనితో కలుషితమైన ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకుంటే ఇతరులకూ వ్యాపిస్తుంది. టైఫాయిడ్‌లో విడవకుండా జ్వరం వస్తుంటుంది. సాధారణంగా 103 నుంచి 104 డిగ్రీల వరకూ జ్వరం ఉంటుంది. వాంతులు, విరేచనాలు, ఆకలి తగ్గిపోవటం, కడుపు నొప్పి, ఒంటి నొప్పులు, నీరసం వంటివీ ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు కనబడితే టైఫాయిడ్‌ ఉందేమో నిర్ధారించుకోవటం అవసరం. పూర్తికాలం యాంటీబయోటిక్‌ మందులు వాడితే నయమైపోతుంది. మధ్యలో మానేస్తే సమస్య తిరగబెడుతుంది. వారి నుంచి ఇతరులకూ బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదముంది. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా చూసుకుంటే దీన్ని చాలావరకు నివారించుకోవచ్చు.

మలేరియా

దీనికి కారణం ప్లాస్మోడియం జాతి పరాన్నజీవులు. ఇవి ఎనాఫిలస్‌ దోమ ద్వారా మనుషులకు వ్యాపిస్తాయి. మలేరియా తొలిదశలో తలనొప్పి, నీరసం, కండరాల నొప్పి, కడుపులో ఇబ్బంది వంటి లక్షణాలు కనబడతాయి. అనంతరం రోజు విడిచి రోజు జ్వరం వస్తుంటుంది. విపరీతమైన చలితో వణికిపోతుంటారు. దుప్పట్లు కప్పితే కొంతసేపటికే చెమటతో తడిసి పోయి, ఒళ్లంతా చల్లబడుతుంది. మలేరియా మూలంగా కొందరిలో రక్తహీనత, ప్లీహం పెద్దగా అవటం వంటివీ తలెత్తుతాయి. కొందరికి పరాన్నజీవులతో నిండిన రక్తకణాలు మెదడులోని సూక్ష్మ రక్తనాళాల్లో చిక్కుకుపోవచ్చు (సెరిబ్రల్‌ మలేరియా). ఇది ప్రమాదకరమైంది. ఇందులో మెదడు వాచిపోయి, దెబ్బతినొచ్చు. మూర్ఛ రావొచ్చు. కోమాలోకీ వెళ్లిపోవచ్చు. ఊపిరితిత్తుల్లో ద్రవాలు నిండిపోయి శ్వాస కష్టం కావొచ్చు. కాబట్టి మలేరియాను విస్మరించటానికి లేదు. గర్భిణుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం.

డెంగీ

దీనికి మూలం ఫ్లావి వైరస్‌. ఇది ఈడిస్‌ ఈజిప్టై అనే దోమల ద్వారా వ్యాపిస్తుంది. స్వచ్ఛమైన నీటిలో పెరిగే ఇవి పగటి పూట.. ముఖ్యంగా కాళ్లు, చేతుల వంటి భాగాల మీద ఎక్కువగా కుడతాయి. దోమ కుట్టిన తర్వాత 2-7 రోజుల మధ్యలో డెంగీ లక్షణాలు మొదలవుతాయి. హఠాత్తుగా, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. జ్వరం 101 నుంచి 104 డిగ్రీల వరకు ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులూ ఉంటాయి. నిస్సత్తువ, వాంతి, వికారం వేధిస్తాయి. డెంగీ జ్వరం రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. అలాగని నిశ్చింతగా ఉండటానికి వీల్లేదు. చర్మం మీద ఎర్రటి మచ్చలు, ప్లేట్‌లెట్‌ కణాలు పడిపోవటం, బీపీ తగ్గటం వంటివి మొదలయ్యేది జ్వరం తగ్గే దశలోనే. ఈ సమయంలో వైద్యుల సలహా మేరకు నడుచుకోవటం మంచిది.

నివారణే కీలకం

  • వానకాలంలో వచ్చే సమస్యలన్నింటికీ అపరిశుభ్రతే మూలం. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత.. ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకుంటే వీటిని చాలావరకు నివారించుకోవచ్చు.
  • తరచుగా చేతులు కడుక్కోవటం చాలా ముఖ్యం. భోజనానికి ముందు, మల మూత్ర విసర్జన తర్వాత విధిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
  • దగ్గినపుడు, తుమ్మినపుడు నోటికి చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ అడ్డం పెట్టుకోవాలి.
  • ఇవి దగ్గర లేకపోతే మోచేతినైనా నోటికి అడ్డం పెట్టుకోవాలి. జలుబు చేసినపుడు సాధ్యమైనంతవరకు విశ్రాంతి తీసుకోవాలి. ఆఫీసులకు వెళ్లకపోవటం మంచిది. దీంతో ఇతరులకు వ్యాపించకుండా చూసుకోవచ్చు.
  • వానకాలంలో కరచాలనాలు మానెయ్యటం మేలు. జలుబుతో ఉన్నవారిని ముద్దు పెట్టుకోవటమూ మంచిది కాదు.
  • కాచి చల్లార్చి, వడగట్టిన నీటిని తాగటం మంచిది. వేడిగా ఉన్న ఆహారాన్నే తినాలి. వీలైనంతవరకు ఇంట్లో వండిన ఆహార పదార్థాలనే తినాలి.
  • కూరగాయలు, ఆకు కూరలను బాగా కడిగిన తర్వాతే వండుకోవాలి. పండ్లనూ శుభ్రంగా కడిగాకే తినాలి.
  • ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దీంతో దోమలు పెరగకుండా చూసుకోవచ్చు.
  • దోమలు కుట్టకుండా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. మంచానికి దోమ తెరలు వాడుకోవాలి.
  • పిల్లలకు, వృద్ధులకు రోగనిరోధకశక్తి తక్కువ. కాబట్టి వాన కాలంలో వీరిని ఎక్కువమంది గుమిగూడే చోట్లకు తీసుకెళ్లకపోవటమే ఉత్తమం.
  • పిల్లలకు ఏదైనా సమస్య వస్తే తగ్గేవరకు స్కూలుకు పంపకపోవటం మంచిది. దీంతో ఇతర పిల్లలకు వ్యాపించకుండా చూసుకోవచ్చు.
  • ఆస్థమా గలవారు చల్లగాలి, చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • ఫ్లూ, టైఫాయిడ్‌ వంటివి రాకుండా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ముందు జాగ్రత్తగా వీటిని తీసుకోవటం మంచిది.
  • ఇదీ చదవండి:Corona Third Wave : ఏడాది తర్వాత సాధారణ జలుబు, దగ్గు మాదిరి కరోనా

జీవ వ్యర్థాలతో ముప్పు-కలగాలి కనువిప్పు!

ABOUT THE AUTHOR

...view details