తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మన హైదరాబాద్ కలెక్టరమ్మ ఆలోచన.. బడిలోనే సాగుబడి! - collector shashanka ala about harvesting crop in anganwaadi

ఆమె కలెక్టర్‌... అయినా తన బిడ్డను అంగన్‌వాడీలో చేర్పించింది. అక్కడ పసిపిల్లలకు అందించే ఆహారంలో పోషకాలు లేవని గుర్తించిన ఆ కలెక్టరమ్మ ‘నా పాఠశాల - నా తోట’ అనే ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఫలితంగా నేడు 700 పాఠశాలల్లోని వేలాదిమంది చిన్నారులు సేంద్రియ పోషకాహారాన్ని అందుకుంటున్నారు. మిజోరం కొండ ప్రాంతాలని పచ్చగా మార్చిన మన తెలుగింటి ఆడపడుచు శశాంక అల గురించి మరిన్ని విశేషాలు.

collector shashanka implemented an idea of growing crop in anganwaadi play grounds
మన హైదరాబాద్ కలెక్టరమ్మ ఆలోచన.. బడిలోనే సాగుబడి!

By

Published : Aug 27, 2020, 2:34 PM IST

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ నారాయణ, లోరా దంపతుల రెండో కుమార్తె శశాంక అల. తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వోద్యోగులు. ఐఐటీ-మద్రాసులో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శశాంక సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ సాధించారు. దిల్లీలో సబ్‌కలెక్టరుగా విధుల్లో చేరారు. రెండేళ్ల కిందట మిజోరంలోని లాంగ్‌ట్లై జిల్లాకు కలెక్టరుగా వెళ్లారు. అప్పటికి శశాంకకు తన బ్యాచ్‌మేట్‌ భూపేష్‌తో వివాహమై, ఏడాది బాబు ప్రబీర్‌ ఉన్నాడు. ఆ బాబుని స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించారు. ఆ చిన్నారి కోసం ఏర్పాటుచేసిన ఆయా... బియ్యం, పప్పు ప్యాకెట్లను ఇంటికి తీసుకొచ్చేది. ఇలా ముడి సరకులు ఇవ్వడానికి గల కారణాన్ని అడిగితే... ఆ ప్రాంతంలో కాయగూరలు పండవని అందుకే అలా అందిస్తారని తెలుసుకున్నారు శశాంక. అవి కూడా పూర్తిగా పిల్లలకు చేరకపోవడంతో 36 శాతం మంది చిన్నారుల్లో తీవ్రమైన పౌష్టికాహార లోపం ఉన్నట్లు గుర్తించారామె. లాంగ్‌ట్లై జిల్లాలో అధిక ప్రాంతం కొండకోనల్లో ఉండటంవల్ల వ్యవసాయానికి అనువుగా ఉండదు. పొరుగునున్న అసోం నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిందే. వర్షం పడితే రవాణా నిలిచిపోయి అవీ అందవు. ఇవన్నీ తెలిశాక పరిస్థితిని మార్చాలకున్నారు శశాంక.

అందరూ భాగస్వాములే...
మన హైదరాబాద్ కలెక్టరమ్మ ఆలోచన.. బడిలోనే సాగుబడి!

ముందు స్వయంగా తన పెరట్లో కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు వేయించారు. అవి చేతికి రావడానికి కొన్ని నెలలు పట్టింది. ‘మొదట మా బాబు చదివే అంగన్‌వాడీ కేంద్రం వద్దే నేలను చదును చేయించి ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు వేయించా. అవి చేతికొచ్చేలోపు అన్నం, పప్పు వండి పిల్లలకు వడ్డించే ఏర్పాట్లు చేశా. సమీపంలోని నాలుగైదు అంగన్‌వాడీలూ ప్రాథమిక పాఠశాలల్లో ‘నా పాఠశాల- నా తోట’ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించా. దీన్లో అంగన్‌వాడీ కార్యకర్తలూ, ఉపాధ్యాయులూ, పాఠశాలల విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేశా. వీరికి శిక్షణ ఇప్పించి... మొక్కల పెంపకం, సంరక్షణ బాధ్యతలను వారికే అప్పజెప్ఫా ప్రతిరోజూ వాటిని పర్యవేక్షించేదాన్ని. కొద్దిరోజుల్లోనే ఆకుకూరలు చేతికొచ్చాయి. తర్వాత కాయగూరలు కూడా. అప్పట్నుంచీ అన్నం, పప్పుతోపాటు కూరలూ పెట్టేవారు. ఆరు నెలల్లోపు ఈ పద్ధతిని జిల్లా వ్యాప్తంగా అమలుచేశాను. క్రమంగా చిన్నారులకు పౌష్టికాహారం అందడం మొదలైంది. ఇక్కడ వారికి వ్యవసాయం అలవాటు లేదు. దాదాపుగా అందరూ ప్రభుత్వోద్యోగులే. కూరగాయల పెంపకానికి వాతావరణం అనువుగా ఉన్నా నేల చదునుగా ఉండదు. వీళ్లను సాగుకి ఒప్పించడం కష్టమైంది. వ్యవసాయ అధికారుల సాయం తీసుకోవడంతో పని కాస్త తేలికయింది. ఇప్పుడీ సాగు సేంద్రియ విధానంలోకి మళ్లింది.

అలా ఏడాదిన్నరలో 700 అంగన్‌వాడీలూ, పాఠశాలల్లో సేంద్రియ వ్యవసాయం ఊపందుకుంది. పది రకాలకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, అల్లం, పసుపును పండిస్తున్నారు. 15 వేలమంది విద్యార్థులకు పోషకాహారం అందుతోంది. ఈ విధానం విజయవంతమవ్వడంతో అనాధాశ్రమాలు, శిశు సంరక్షణ కేంద్రాల్లోనూ అనుసరిస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా పిల్లల్లో 36 శాతం ఉన్న పోషకాహార లోపం 17 శాతానికి తగ్గింది. మేం సాధించిన ఈ విజయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ పద్ధతిని దేశవ్యాప్తంగా పాటించి, విద్యార్థుల్లో పోషకాహార లోపం లేకుండా చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు’ అని చెబుతారు శశాంక. ఈమె ప్రస్తుతం మిజోరం రాష్ట్రానికి అదనపు కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే

ABOUT THE AUTHOR

...view details