అసాధారణ యోని రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్కు హెచ్చరిక సంకేతం అని మీకు తెలుసా? ప్రపంచంలోని గర్భాశయ క్యాన్సర్ మరణాల్లో దాదాపు నాలుగో వంతు భారతదేశంలోనే నమోదవుతున్నాయి. 2018లో 60,078 మరణాలు సంభవించగా, 96,922 మందికి కొత్తగా ఈ క్యాన్సర్ వచ్చింది.
ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ పిడియాట్రిక్ ఆంకాలజీ ప్రకారం... భారత్లో క్యాన్సర్ బారిన పడిన వారిలో 6 నుంచి 29 శాతం మంది గర్భాశయ క్యాన్సర్ బాధితులవుతున్నారు. అత్యధికంగా మిజోరాంలో లక్ష మందిలో 23.07 శాతం, అత్యల్పంగా డిబ్రూగఢ్లో 4.91 శాతంగా మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు
గర్భాశయ క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించగలిగితే 90-95% వరకు నయం చేయవచ్చు అని ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మా తోమర్ చెబుతున్నారు. కానీ, మహిళల్లో అవగాహన లేకపోవడం వల్ల సంకేతాలను గుర్తించలేకపోతున్నారని అన్నారు. ఈ క్రింద పేర్కొన్న లక్షణాలు గుర్తించిన వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే ప్రారంభ దశలోనే వ్యాధిని అరికట్టవచ్చని వివరించారు.
- యోనిలో మంట లేదా దురద
- కడుపు నొప్పి లేదా వెన్ను కింద నొప్పి
- విపరీతమైన అలసట
- హెమచూరియా (మూత్రంలో రక్తం), డిస్యూరియా (బాధాకరమైన మూత్ర విసర్జన), మూత్రం ఆపుకోలేకపోవడం
- పొట్ట ఉబ్బరం
- యోనిలో దుర్వాసన
- కాళ్ళల్లో వాపు
- పొత్తి కడుపులో నొప్పి
- పురీష నాళం నుంచి రక్త స్రావం, నీళ్ల విరేచనాలు వంటి మల లక్షణాలు
- మూత్ర పిండం శోధ వల్ల కలిగే నడుము నొప్పి
చాలా మంది మహిళలు క్యాన్సర్ సంకేతాలను తేలికగా తీసుకుంటారు. ఉదాహరణకు రుతు చక్రాల సమయంలో హర్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల కడుపు నొప్పిని అనుభవిస్తుంటారు. 50 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం సాధారణమే అని భావిస్తారు. అలాగే కొందరు మహిళలు ఎక్కువగా అలసటతో బాధ పడుతున్నప్పటికీ... అది బాధ్యతల కారణంగానే వస్తున్నట్లు భావిస్తారు. అందుకే 30 ఏళ్లు దాటినప్పటినుంచి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు.
గర్భాశయ క్యాన్సర్కు కారణాలు:
గర్భాశయ క్యాన్సర్ అనేది మానవ పపిల్లోమా వైరస్ (హ్యూమన్ పపిల్లోమా వైరస్, హెచ్పీవీ) వల్ల సంభవిస్తుంది. ముఖ్యంగా హెచ్పీవీ 16, హెచ్పీవీ 18 వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది.
ధూమపానం:
పొగాకులోని రసాయనాల వల్ల ధూమపానం చేసే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం వల్ల వచ్చే పొగను పీల్చినా ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయి.