బయటి ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేసేవి జ్ఞానేంద్రియాలే. కళ్లతో దృశ్యాలు, చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలను గుర్తిస్తాం. మాటలు, పాటలు.. ఒక్కటేమిటి సమస్త శబ్ద ప్రపంచాన్ని పరిచయం చేసేవి చెవులే. పూవుల పరిమళం కావొచ్చు, కమ్మటి భోజనమైనా కావొచ్చు. ఎలాంటి వాసనలనైనా ఆఘ్రాణించటానికి ముక్కు తోడ్పడితే.. నాలుక అన్ని రుచులనూ ఆస్వాదింపజేస్తుంది. చర్మం ఒక్క స్పర్శతోనే అమ్మ గుండె వెచ్చదనం, అమ్మమ్మ చేతి ఆత్మీయత వంటి వాటిని తెలియజేస్తుంది. ఇంతటి కీలకమైనవైనా మనం జ్ఞానేంద్రియాలను ప్రత్యేకించి పట్టించుకోం. చూపు, వినికిడి వంటి వాటిని ఆయాచిత వరాలుగానే భావిస్తుంటాం. ఏదైనా సమస్య మొదలైతే గానీ వీటి గొప్పతనమేంటో తెలిసిరాదు. కొవిడ్-19 బారినపడ్డ చాలామందికిది అవగతమయ్యే ఉంటుంది. ఉన్నట్టుండి రుచి, వాసన పోయి ఎంతమంది ఇబ్బంది పడ్డారో. ఇవే కాదు.. చాలామందిలో వినికిడి, స్పర్శ, చూపు సైతం మందగిస్తున్నాయి. కొందరికివి శాశ్వతంగానూ పోతుండటం ఆందోళనకరం.
జ్ఞానేంద్రియాలు దెబ్బతింటే చుట్టుపక్కల వారితో, సమాజంతో సంబంధ బాంధవ్యాలూ అస్తవ్యస్తమవుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే- కొవిడ్-19 మనం లోకాన్ని చూసే తీరును, అర్థం చేసుకునే విధానాన్నీ మార్చేస్తోందన్నమాట. జ్ఞానేంద్రియాలు దెబ్బతినటం వల్ల తలెత్తే సమస్యలు ప్రాణాంతకం కాకపోవచ్చు. కానీ వినికిడి, చూపు వంటివి ఏమాత్రం తగ్గినా నిత్య జీవితంలో ఇబ్బందులు తప్పవు. ఒక్కసారి కళ్లు మూసుకొని ఇంట్లో నడవటానికి ప్రయత్నించి చూడండి. చెవులు మూసుకొని టీవీ చూడండి. ఎదుటి వారు చెప్పేది సరిగా వినిపించకపోతే తలెత్తే బాధ అంతా ఇంతా కాదు. రుచీ పచీ లేని భోజనం ఎవరికైనా సహిస్తుందా? అసలు వాసన తెలియకపోతే గ్యాస్ లీకవ్వటం వంటి ప్రమాదాలను గుర్తించగలమా? పాదాలు మొద్దుబారిపోయి, నడుస్తుంటే ఏవో సూదులు పొడుస్తున్నట్టు అనిపిస్తే ఎవరికి మాత్రం బాగుంటుంది? కాబట్టి కొవిడ్-19 మూలంగా తలెత్తుతున్న ఇలాంటి జ్ఞానేంద్రియ సమస్యల గురించి తెలుసుకొని ఉండటం మంచిది.
వినికిడి తగ్గటం
తీవ్ర కొవిడ్-19 నుంచి బయటపడినప్పటికీ కొందరికి దాని దుష్ప్రభావాలు దీర్ఘకాలం వెంటాడుతూనే వస్తున్నాయి. వినికిడి తగ్గటం వీటిల్లో ఒకటి. ఒకప్పుడు స్పష్టంగా వినిపించే మాటలు మంద్రమైపోతున్నాయి. కొందరికి చెవుల్లో నిరంతరం రింగుమనే మోత (టినిటస్) కూడా వినిపిస్తోంది. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు. కొవిడ్-19 బారినపడ్డవారిలో సుమారు 8% మందిలో వినికిడి తగ్గుతున్నట్టు, సుమారు 15% మందిలో టినిటస్ తలెత్తుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వీటికి కారణమేంటన్నది పూర్తిగా తెలియటం లేదు. మధ్య చెవిని, గొంతును అనుసంధానం చేసే యూస్టేషియన్ గొట్టం ప్రభావితం కావటం దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ గొట్టం చెవిలో పీడనాన్ని నియంత్రిస్తుంది. మధ్య చెవిలో అధికంగా ఉండే ద్రవాలను గొంతులోకి వచ్చేలా చేస్తుంది. ఒక్క కొవిడ్ అనే కాదు.. ఏ వైరల్ ఇన్‌ఫెక్షన్‌తోనైనా దీని పనితీరు అస్తవ్యస్తం కావచ్చు. దీంతో మధ్యచెవిలో నీరు పోగుపడి.. కర్ణభేరి మీద ఏదో పెద్ద బరువు పెట్టినట్టు, చెవి దిబ్బడ వేసినట్టు అనిపిస్తుంది. ఇన్‌ఫెక్షన్ తగ్గాక యూస్టేషియన్ గొట్టంలోంచి ద్రవం బయటకు వచ్చేస్తుంది. వినికిడి మామూలు స్థాయికి చేరుకుంటుంది. ఇందుకు కొన్ని వారాలు పట్టొచ్చు. దిబ్బడ తొలగించే మాత్రలు, ముక్కులోకి కొట్టుకునే స్టిరాయిడ్ స్ప్రేలతో మరింత త్వరగా కుదురుకోవటానికి వీలుంటుంది. ఒకవేళ లోపలి చెవి లేదా కాక్లియాలోని నాడులను వైరస్ దెబ్బతీస్తే ఉన్నట్టుండి వినికిడి తగ్గొచ్చు. కొందరికి శాశ్వతంగానూ వినికిడి పోవచ్చు. కొవిడ్-19లో ఈ నాడులు ఎందుకు దెబ్బతింటున్నాయనేది కచ్చితంగా తెలియటం లేదు గానీ.. వైరస్ ఒంట్లో వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్) విపరీతంగా ప్రేరేపించటం, సూక్ష్మ రక్తనాళాలను దెబ్బతీయటం ఇందుకు కారణం కావొచ్చని అనుకుంటున్నారు. లోపలి చెవి చాలా సున్నితమైంది. ఇది వాపు ప్రక్రియ, సూక్ష్మ రక్తనాళాల సమస్యలకు త్వరగా ప్రభావితమయ్యే అవకాశముంది మరి. కాబట్టే కొవిడ్-19 బాధితుల్లో కొందరికిది పెద్ద సమస్యగా మారుతోంది. వినికిడి లోపం తలెత్తిన కొందరికి కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చుకోవాల్సిన అవసరమూ తలెత్తుతోంది.
చూపు మందగించటం
కొవిడ్-19 బాధితుల్లో చూపు సమస్యలూ బయలుదేరుతున్నాయి. కాంతిని తట్టుకోలేకపోవటం, కళ్ల మంటలు, చూపు మందగించటం ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినవారిలో సుమారు 10% మందిలో కళ్ల కలక, చూపులో మార్పులు, దురద వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. వీటికి మూలం కళ్లలో వైరస్ సంఖ్య ఎక్కువగా ఉండటం. అదృష్టం కొద్దీ ఇవన్నీ చాలావరకు తాత్కాలికమైనవే. సార్స్-కొవీ-2 రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటానికి దారితీస్తున్న విషయం తెలిసిందే. ఇవి కంట్లో రెటీనాలోని రక్తనాళాల్లోనూ ఏర్పడొచ్చు. ఇదీ కొంతవరకు చూపు తగ్గేలా చేయొచ్చు. అందువల్ల కొవిడ్ నుంచి కోలుకుంటున్న తరుణంలో చూపులో ఎలాంటి మార్పులను గమనించినా వీలైనంత త్వరగా కంటి డాక్టర్‌ను సంప్రదించి పరీక్షించుకోవటం మంచిది. కొన్నిరకాల చూపు సమస్యలు మందులతో నయమయ్యే అవకాశముంది. కాకపోతే ఇది రెటీనా ఎంతవరకు దెబ్బతిన్నదనే దానిపై ఆధారపడి ఉంటుంది.
మొద్దుబారటం