Cancer Symptoms in Women: మారిన జీవనశైలి, ఒత్తిడి, హార్మోన్లు, ఆహారం సహా అనేక అంశాలు మహిళల శరీరంలో మార్పులకు దోహదం చేస్తాయి. అయితే.. కొన్ని మార్పులు సాధారణమైనవిగా భావించినప్పటికీ.. మరికొన్ని ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి సంకేతంగా ఉండవచ్చు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) ప్రకారం.. మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే కొన్ని క్యాన్సర్లు.. రొమ్ము, కొలొరెక్టల్, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, గర్భాశయ, చర్మం, అండాశయ క్యాన్సర్లు. అయితే స్త్రీ శరీరంలో జరిగే ప్రతి మార్పు క్యాన్సర్‌కు సంకేతం కానప్పటికీ.. కొన్ని విస్మరించకూడని సాధారణ సంకేతాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
రొమ్ములో గడ్డలు : మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. దీనితో చనిపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే. రొమ్ములో గడ్డల్లాంటివి తగలడం, రొమ్ముల పరిమాణంలో తేడా, ఎర్రగా, కందినట్లుగా ఉండే చనుమొనలు, చనుమొనల నుంచి స్రావాలు వెలువడడం, రొమ్ములు సొట్టలు పడినట్లు ఉండడం, చంకలో వాపు.. ఇలాంటి లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌లో కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
రొమ్ము చర్మం రంగులో మార్పులు:ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అరుదైన రొమ్ము క్యాన్సర్. ACS ప్రకారం.. ఇది రొమ్ములో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ.. చర్మం రంగును ఊదా లేదా ఎరుపుగా మారుస్తుంది. కాబట్టి మీ బ్రెస్ట్ దగ్గర కలర్ ఛేంజ్ అయితే అప్రమత్తమవ్వాల్సిందే.
మలంలో రక్తం:కొలెరెక్టరల్ క్యాన్సర్‌కు మరో సంకేతం రెక్టల్ బ్లీడింగ్. స్టూల్లో రక్తం పడటం గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇది కూడా ఒక ముఖ్యమైన క్యాన్సర్ సంకేతం. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువవుతుంది. ఇది తరచుగా బలహీనత, అలసటకు కారణమవుతుంది.
Alert : బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాలు - క్యాన్సర్ వచ్చే అవకాశం!
నెలసరి కాకుండా.. బ్లీడింగ్:పీరియడ్స్ సమయంలో కాకుండా, తర్వాత కూడా బ్లీడింగ్ అవుతున్నట్లయితే.. అది హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం మాత్రమే కాదు, కొన్ని ప్రమాదకర వ్యాధులకు సంకేతం. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో రక్తస్రావం అవుతుంటే. ఇది కాకుండా, కోయిటల్ బ్లీడింగ్, పెరిమెనోపౌసల్ బ్లీడింగ్, ఇంటర్‌మెన్‌స్ట్రువల్ బ్లీడింగ్‌ను తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో దాదాపు 90% మందికి నెలసరి కాకుండా బ్లీడింగ్ అవుతుంది. అండాశయ క్యాన్సర్‌లోనూ ఇదే లక్షణం కనిపిస్తుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే.. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
పొత్తికడుపు, వెన్ను లేదా కటి నొప్పి: అండాశయ క్యాన్సర్ సంకేతాలలో కడుపు ఉబ్బరం, దిగువ వెన్నునొప్పి, ఆకలి తగ్గడం లేదా త్వరగా నిండిన అనుభూతి వంటి మార్పులు ఉంటాయి. పెల్విక్ నొప్పి లేదా ఒత్తిడి అనేది అండాశయ, గర్భాశయ (ఎండోమెట్రియల్‌ని కలిగి ఉంటుంది) క్యాన్సర్‌ల రెండింటికీ సాధారణ లక్షణం. మలబద్ధకం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయవలసి రావడం అండాశయ, యోని క్యాన్సర్ రెండింటికి సంబంధించిన లక్షణాలు.
లైంగిక సంపర్కం సమయంలో నొప్పి:అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ (ASCO) ప్రకారం, అసాధారణ యోని రక్తస్రావంతో పాటు.. లైంగికం సంపర్కం సమయంలో నొప్పి యోని క్యాన్సర్ మరొక లక్షణం. మూత్రవిసర్జన చేసేటప్పుడు ఇబ్బంది లేదా నొప్పి, కటి నొప్పి, వెన్ను లేదా కాళ్ల నొప్పి, కాళ్లలో వాపు, అసాధారణ పేగు పనితీరు.. ఇతర లక్షణాలుగా చెప్పుకోవచ్చు.
మైక్రో ఓవెన్లతో మనుషులకు క్యాన్సర్ వస్తుందా? - WHO ఏమంటోంది?
రంగు మారడం..:ప్రైవేట్ భాగాల్లో పుండ్లు, దద్దుర్లు, వల్వార్ క్యాన్సర్‌కు సంకేతం. ఇటువంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ లక్షణాలు చర్మ క్యాన్సర్‌కు సంకేతం కూడా కావచ్చు. పుట్టు మచ్చలన్నీ ఒకే పరిమాణంలో, ఆకృతిలో లేకపోవడం, పుట్టు మచ్చ రంగు.. వంటి లక్షణాలు గమనిస్తే.. చర్మ క్యాన్సర్ కావచ్చు. చర్మంపై పుట్టు మచ్చలు ఒకవేళ అసాధారణ రీతిలో పెరుగుతూ ఉన్నట్లయితే పరీక్షలు చేయించుకోవడం మంచిది.