క్యాన్సర్ చికిత్స అనగానే కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీలే గుర్తుకొస్తాయి. ఇప్పటికీ ఇవే ప్రధాన చికిత్సలు కూడా. ఇవే కాదు.. గత దశాబ్దంలో పురుడు పోసుకున్న ఇమ్యునోథెరపీ సైతం ఎంతగానో తోడ్పడుతోంది. రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతూ వినూత్నంగా రూపొందుతోంది. ఇంతకీ రోగనిరోధక చికిత్స అంటే? మన ఒంట్లోకి హానికారక సూక్ష్మక్రిములు ప్రవేశించినప్పుడో, లేదూ టీకాలు తీసుకున్నప్పుడో శరీరం వాటికి సంబంధించిన రోగనిరోధకత శక్తిని సంతరించుకొని పెట్టుకుంటుంది. మళ్లీ ఎప్పుడైనా ఆ సూక్ష్మక్రిములు దాడిచేసినప్పుడు వాటిని ఎదుర్కొంటుంది. జబ్బులు కలగజేయకుండా చూస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఇదే ఇమ్యునోథెరపీ. క్యాన్సర్ చికిత్సలోనూ దీన్ని వాడుకోవాలని చాలాకాలంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఎందుకంటే క్యాన్సర్ ఒకరకంగా లోపభూయిష్ట రోగనిరోధక వ్యవస్థ ఫలితమే! సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ ఎప్పటికప్పుడు అసాధారణ కణాలను గుర్తించి, నిర్మూలిస్తుంటుంది. ఇలా కణాలు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందకుండా, క్యాన్సర్‌గా మారకుండా ఎప్పటికప్పుడు నిలువరిస్తుంది. కణితి ఏర్పడినా దాంతో పోరాడుతూ వస్తుంది. కొందరిలో కణితుల లోపల, చుట్టుపక్కల రోగనిరోధక కణాలు ఉంటుండటమే దీనికి నిదర్శనం. వీటినే ట్యూమర్ ఇన్‌ఫిల్‌ట్రేటింగ్ లింఫోసైట్లు (టీఐఎల్) అంటారు. కణితికి రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తోందనటానికి వీటి ఉనికి ఒక సంకేతం. ఇలాంటి కణాలతో కూడిన కణితులు గలవారు క్యాన్సర్ నుంచి బాగా కోలుకుంటుంటారు కూడా. క్యాన్సర్ చికిత్సలో రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించు కోవటానికి ఇలాంటి విషయాలే దారిచూపాయి.
ప్రయోగాలు దాటుకొని..
కొన్ని రకాల బ్యాక్టీరియా భాగాలను రక్తంలోకి ఎక్కించినప్పుడు వీటిని ఎదుర్కోవటానికి పుట్టుకొచ్చిన రోగనిరోధక సామర్థ్యం క్యాన్సర్ కణాలను చంపటానికీ ఉపయోగపడుతున్నట్టు చాలాకాలం క్రితమే బయటపడింది. బాగా ముదిరిపోయిన క్యాన్సర్లలో సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా అంశాలను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినప్పుడు ఇలాంటి ఫలితమే కనిపిస్తున్నట్టు ఏనాడో గుర్తించారు. అలాగే డిఫ్తీరియా విషతుల్యాలను సంగ్రహించి, వాటిని నిర్వీర్యం చేసి శరీరంలోకి ఎక్కించీ పరీక్షించారు. అన్నింటికన్నా ముఖ్యమైంది బీసీజీ టీకా ప్రయోగం. క్యాన్సర్ చికిత్సలో టీకాలను వాడుకోవటం దీంతోనే మొదలైంది. మూత్రాశయ క్యాన్సర్ గలవారికి బీసీజీ టీకాను పెద్ద మొత్తంలో సెలైన్ ద్రావణంలో కలిపి, మూత్రాశయంలోకి నేరుగా ఇస్తే పైపొరల్లో ఏర్పడే కణితులు గణనీయంగా తగ్గుతుండటం గమనార్హం. పది, పదిహేను ఏళ్లుగా దీన్ని విస్తృతంగానూ వాడుతున్నారు.
టి కణాలు ప్రధానం
తెల్ల రక్తకణాల్లో న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్, బేసోఫిల్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్ వంటి రకరకాల కణాలుంటాయి. లింఫోసైట్స్‌లో టి, బి అని మళ్లీ రెండు రకాలు. వీటిల్లో టి కణాలు కీలకం. ఇవి క్యాన్సర్ నిర్మూలనకు తోడ్పడతాయి. మన శరీరంలో సహజంగానే తెల్ల రక్తకణాలుంటాయి కదా. అవెందుకు క్యాన్సర్ కణాలను గుర్తించి, చంపటం లేదు? దీనికి కారణం క్యాన్సర్ మాయోపాయమే. ఇది మన రోగనిరోధక వ్యవస్థను ఏమార్చి, తనను క్యాన్సర్‌గా గుర్తించనీయని స్థితిని (ఎనర్జీ) సృష్టించుకుంటుంది. దీన్ని సమ్మోహనాస్త్రంతో పోల్చుకోవచ్చు. ఇది లింఫోసైట్స్‌ను నిద్రాణ స్థితిలోకి నెట్టేస్తుంది మరి. ఫలితంగా వ్యాధికారకాలకు సంబంధించిన గ్రాహకాల ద్వారా వచ్చే ప్రేరణలకు ప్రతిస్పందించవు. క్యాన్సర్ కణాలూ మామూలు కణాలేనని భ్రమించేలా చేస్తుంది. దీంతో లింఫోసైట్లు క్యాన్సర్‌ను గుర్తించటం మరచిపోతాయి. ఇమ్యునోథెరపీ చేసే పని దీన్ని గుర్తు చేయటమే.
చికిత్సలు రకరకాలు
ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్‌హిబిటార్లు: మన రోగనిరోధక వ్యవస్థలో తనిఖీ చేసే చెక్‌పాయింట్ ప్రొటీన్లూ ఉంటాయి. ఇవి రోగనిరోధకత మరీ ఎక్కువగా ప్రతిస్పందించకుండా చూస్తాయి. ఇలా ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. వీటి సాయంతోనే క్యాన్సర్ కణాలు తప్పించుకుంటాయి. కణితి కణాల మీద పోగ్రామ్డ్ డెత్-లైగండ్ 1 (పీడీ-ఎల్1).. టి కణాల మీద ప్రోగామ్డ్ సెల్ డెత్ 1 (పీడీ-1) ప్రొటీన్లు ఉంటాయి. పీడీ-1కు పీడీ-ఎల్1 అంటుకుపోతే టి కణాలు కణితుల మీద దాడి చేయవు. ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్‌హిబిటార్ రకం మందులు వీటిని అంటుకోకుండా చేస్తాయి. అప్పుడు టి కణాలు క్యాన్సర్ కణాల మీద దాడిచేసి, నిర్మూలిస్తాయి. ఇవి మెలనోమా, హాడ్జికిన్స్ లింఫోమా, పిల్లల్లో వచ్చే లింఫోమా, ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకీమియా, ఎక్యూట్ మైలాయిడ్ లుకీమియా వంటి క్యాన్సర్లలో బాగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఊపిరితిత్తులు, పెద్దపేగు, జీర్ణాశయ క్యాన్సర్‌లో వాడుకుంటున్నారు. కీమోథెరపీ వంటి చికిత్సలు పనిచేయని సందర్భాల్లోనూ ఇవి మంచి ఫలితం చూపిస్తాయి. అయితే ఖరీదు ఎక్కువ కావటం వల్ల అంతగా వాడకంలోకి రావటం లేదు.
- నోటి, గొంతు క్యాన్సర్లకు అతి తక్కువ మోతాదు కీమోథెరపీతో పాటు చెక్‌పాయింట్ ఇన్‌హిబిటార్స్ ఇస్తే చక్కగా పనిచేస్తున్నట్టు ఇటీవల టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధనలో తేలటం విశేషం.
మోనోక్లోనల్ యాంటీబాడీలు: ఇవి ప్రయోగశాలలో వృద్ధి చేసిన రోగ నిరోధక ప్రొటీన్లు. వీటిని థెరపాటిక్ యాంటీబాడీలనీ అంటారు. ఆయా క్యాన్సర్ల మీద అంటుకుపోయేలా వీటిని తయారుచేస్తారు. దీంతో రోగనిరోధక వ్యవస్థ కణితులను తేలికగా గుర్తించి, దాడి చేస్తుంది.
చికిత్స టీకాలు:ఇది క్యాన్సర్‌ను ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ప్రత్యేకమైన టీకా చికిత్స పద్ధతి. ఇవి క్యాన్సర్‌ను నివారించే టీకాల వంటివి కావు. అప్పటికే క్యాన్సర్ బారినపడ్డవారి కోసం ఉద్దేశించిన టీకాలు. ఇవి క్యాన్సర్ కణాల మీదే పనిచేస్తాయి గానీ క్యాన్సర్ కారకాలపై ప్రభావం చూపవు. క్యాన్సర్ కణాల్లో కణితి సంబంధ యాంటీజెన్లుంటాయి. ఇవి మామూలు కణాల్లో ఉండవు. ఒకవేళ ఉన్నా తక్కువ మోతాదులోనే ఉంటాయి. చికిత్స టీకాలు ఈ యాంటీజెన్లకు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించేలా తర్ఫీదు ఇస్తాయి. ఇలా క్యాన్సర్ కణాలను గుర్తించి, నిర్మూలించేలా చేస్తాయి. అయితే క్యాన్సర్ వచ్చినవారిలో టీకాలతో జబ్బుని నయం చేయటం ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. ప్రస్తుతానికి వైరస్ మూలంగా వచ్చే రెండు రకాల క్యాన్సర్లకు నివారణ టీకాలు అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ బి ద్వారా వచ్చే కాలేయ క్యాన్సర్, హెచ్‌పీవీ వైరస్‌తో తలెత్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను టీకాలతో నిరోధించొచ్చు. నిజానికి హెచ్‌పీవీ టీకా దాదాపు 9 రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దీన్ని ఆడ పిల్లలకు, మగ పిల్లలకు ఇద్దరికీ ఇవ్వచ్చు.