మనం ప్రతిరోజూ వంటల్లో నూనెను ఉపయోగిస్తుంటాం. దానిస్థానంలో నెయ్యిని ఉపయోగిస్తే వంటలకు రుచి పెరుగుతుందని అనుకుంటారు. కానీ వంటల్లో నెయ్యిని వాడవచ్చో లేదో? ఒకవేళ నెయ్యితో చేసిన వంటలు తింటే కొవ్వు పెరిగి లావైపోతుంటావేమో? ఆరోగ్య సమస్యలు వస్తాయేమో? అనుకుంటాం. కానీ మితంగా ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలుండవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అతి చేసి శ్రుతి మించితే ఏదైనా అనారోగ్యమే. అందుకే ఒక వ్యక్తికి రెండు స్పూన్ల చొప్పున నెయ్యిని వాడుకుంటే ఎలాంటి సమస్యలుండవు. కానీ ఏదైనా వంటకాన్ని ఫ్రై చేయాలంటే మోతాదుకు మించిన నెయ్యి అవసరం అవుతుంది. కాబట్టి నెయ్యితో ఫ్రై వంటకాలు కాకుండా సాధారణ వంటకాలు చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం వస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఏయే పోషకాలుంటాయి?
నెయ్యి వివిధ రకాల పోషకాల సమ్మేళనం. ఇందులోని ఎ, ఇ, డి, కె.. వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ ఆమ్లాలు, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. మొదలైన పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అందుకే పూర్వకాలం నుంచి నెయ్యిని పలు రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఆయుర్వేద మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు.
మెదడు చురుగ్గా..
శరీరంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాల స్థాయులు తగ్గిపోవడం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్.. వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే.. ఈ రెండు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాంటివాటిలో అతి ముఖ్యమైంది నెయ్యి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే ఈ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. తద్వారా మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి నెయ్యిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం.
సులభంగా జీర్ణమవడానికి..
నెయ్యి ఎక్కువగా తీసుకోకండర్రా.. అరగదు..' అనే మాట మనం చాలా సార్లు వింటుంటాం. నిజానికి నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం మరింత సులభంగా అరుగుతుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. నెయ్యి జీర్ణవ్యవస్థలో కొన్ని రకాల ఆమ్లాలు విడుదలయ్యేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి నెయ్యి తింటే అరగదు అన్న అపోహను తొలగించుకొని దీన్ని రోజూ ఆహారంతో పాటుగా తీసుకుంటే మరీ మంచిది.
గుండెకు మేలు..
చాలామంది నెయ్యిని ప్రాసెస్డ్ ఫుడ్‌గా భావిస్తారు. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల గుండెపోటు, ఇతర హృదయ సంబంధిత సమస్యలు వస్తాయేమోనని భయపడుతుంటారు. కానీ నెయ్యిని రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఇందులో అధిక మొత్తంలో ఉండే కాంజ్యుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ).. అనే ఫ్యాటీ ఆమ్లం క్యాన్సర్ కారకాలైన కార్సినోజెన్లను తగ్గిస్తుంది. అలాగే ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా కూడా రక్షిస్తుంది. తద్వారా గుండె సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా.. సీఎల్ఏ అధిక బరువును తగ్గించడంతో పాటు బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది. మీకు మరో విషయం తెలుసా..? నెయ్యిని ఆరు నెలల పాటు తక్కువ మోతాదులో రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులోకి వస్తుందని ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది. కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా నెయ్యిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి మరి.
పెదాలు మృదువుగా..
నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మేలు చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చలికాలంలో చాలామందికి పెదాలు పగిలి.. కొన్ని సందర్భాల్లో రక్తం కూడా వస్తుంటుంది. కాబట్టి ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు కాస్త నెయ్యిని తీసుకొని దాంతో పెదాలపై కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉన్నా.. పెదాలు మాత్రం మృదువుగా మెరుస్తూ ఉంటాయి.