సుదీర్ఘ కాలం జీవించిన వారి పేర్లను పరిశీలిస్తే జన్నీ క్లెమెంట్ అనే ఫ్రెంచ్ మహిళ 122 ఏళ్లు జీవించినట్టుగా తెలుస్తోంది. ఈమె 1875లో జన్మించింది. ఆ రోజుల్లో సగటు జీవన ప్రమాణం 43 సంవత్సరాలు మాత్రమే.
మనిషి గరిష్ఠంగా ఎన్ని ఏళ్లు జీవించగలడు అనే ప్రశ్న అనాదిగా ఉంది. సగటు మానవ ఆయుష్షును లెక్కగట్టవచ్చు కానీ మనిషి గరిష్ఠ ఆయుష్షును లెక్కగట్టటం కష్టం. గతంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం మనిషి 140 ఏళ్లు జీవించవచ్చని తెలిసినా, ఈ మధ్య జరిగిన పరిశోధన ప్రకారం 150 ఏళ్లకు పెరిగింది.
జీవన ప్రమాణాన్ని లెక్కగట్టటం ఎలా?
మనిషి జీవన ప్రమాణాన్ని లెక్కించటానికి వాడుకలో ఉన్న పద్ధతి గోంపెట్జ్ సమీకరణ. 19వ శతాబ్దంలో మొదటిసారిగా ఈ పద్ధతిలో సగటు ఆయుష్షును లెక్కగట్టారు. నేడు క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ఇన్ఫెక్షన్స్ వల్ల చావుకు దగ్గరయ్యే అవకాశాలు 8 నుంచి 9 ఏళ్లలోనే 2 రెట్లవుతున్నాయి. గోంపెట్జ్ సమీకరణాన్ని అనేక విధాలుగా లెక్కగట్టి మనిషి ఆయుష్షును తెలుసుకోవచ్చు. ఆరోగ్య బీమా కంతులు లెక్కవేయడానికి దీన్ని వాడతారు. బీమా కంపేనీలు వ్యక్తి అలవాట్లను ముఖ్యంగా ధూమపానం, వైవాహిక జీవితం మొదలైన విషయాలను తెలుసుకొని బీమాను అంచనా వేస్తారు.
వయసు పెరిగే కొద్దీ శరీరంలోని అవయవాలు పనిచేయటంలో విఫలమవుతూ వస్తాయి. అవయవాల ఆరోగ్యాన్ని అనుసరించి ఆయుష్షును లెక్కగట్టవచ్చు. ఉదాహరణకు వ్యాయామం చేసేటపుడు లేదా ఏదైనా పనిలో ఉన్నపుడు ఎంత ఆక్సిజన్‌ను మనం పీల్చుకుంటున్నామో పరిశీలిస్తే యవ్వనంలో కన్నా పెరుగుతున్న వయసులో ఇది తగ్గుతుంది. ఒక సగటు మనిషి శరీరంలో ఉన్న అవయవాలు 120 ఏళ్లు పనిచేస్తాయి. ఇది అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో మూత్రపిండాలు త్వరగా పాడవుతాయి.