తెలంగాణ

telangana

మీకు రాత్రిపూట బ్రష్ చేసుకునే అలవాటు ఉందా? - లేదంటే గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది!

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 4:15 PM IST

Health Benefits of Brushing at Night Time : మనలో చాలా మంది ఉదయం మాత్రమే బ్రష్ చేస్తారు. అది మంచి అలవాటే. కానీ.. రాత్రిపూట పడుకునే ముందు కూడా తప్పనిసరిగా దంతాలు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే భవిష్యత్తులో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Teeth
Teeth

Brushing at Night Time Health Benefits : మనమందరం సాధారణంగా నిద్రలేవగానే ఏదైనా తిన్నాలన్నా, తాగాలన్నా మొదట చేసే పని.. బ్రష్ చేయడం. ఎందుకంటే పాచి మొహంతో ఏమైనా తింటే క్రిములు నోటి నుంచి కడుపులోకి వెళ్తాయనే భయం. కాబట్టి అందరం ఉదయం పూట తప్పనిసరిగా దంతాలు క్లీన్ చేసుకుంటాం. డైలీ మార్నింగ్ ఇలా చేయడం మంచి అలవాటే. అయితే ఇంతవరకు ఓకే.. కానీ, మరి రాత్రిళ్లు బ్రష్ చేస్తున్నారా? దీనికి చాలా మంది నుంచి 'నో' అనే మాటనే వినిపిస్తోంది. ఇక కొందరైతే మార్నింగ్ ఒక్కపూట బ్రష్(Brushing) చేయడమే ఎక్కువ అని కూడా చెప్తారు. అయితే మీరు కొన్ని తీవ్ర ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్లే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. కాబట్టి ఉదయంతో పాటు రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా బ్రష్ చేయాలని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందడంతో పాటు దంత సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ రాత్రి పూట బ్రష్ చేయకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మన దేశంలో వైద్య నిపుణులు చెప్పిన గణాంకాల ప్రకారం ప్రతి పది మంది భారతీయుల్లో 9 మంది దంతక్షయంతో బాధపడుతున్నారట. దీనికి ప్రధాన కారణం నోటి సంరక్షణపై సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు పూటలా బ్రష్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు కనుక నైట్ టైమ్ బ్రష్ చేసే అలవాటు లేకపోతే మీరు ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి!

పళ్లు పుచ్చిపోవడం : ముఖ్యంగా రాత్రిళ్లు పళ్లు తోమకపోతే దంతక్షయంతో పాటు వివిధ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు తీసుకునే ఫుడ్స్​లోని ఆహార కణాలు, బ్యాక్టీరియా దంతాలపై పేరుకుపోతాయి. కాబట్టి మీరు వాటిని త్వరగా శుభ్రం చేసుకోకపోతే.. పళ్లపై ఉండే స్ట్రాంగ్ ఎనామిల్ పొరను దెబ్బతీసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. దాంతో మన పళ్లు త్వరగా పళ్లు పుచ్చిపోవడం, దంతక్షయంలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చిగుళ్ల ఇన్​ఫెక్షన్స్ : అదేవిధంగా మీరు నైట్ పడుకునే ముందు పళ్లను శుభ్రం చేసుకోకపోతే ఎదుర్కొవాల్సిన మరో సమస్య ఏంటే.. నోటి దుర్వాసన. ఎందుకంటే నిద్రలో లాలాజలం ఉత్పత్తి తగ్గడం కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెంది ఈ సమస్యకు కారణమవుతుంది. ఇకపోతే మీరు రాత్రిపూట బ్రష్ చేయకపోతే చిగుళ్ల వాపు, ఇన్ఫెక్షన్స్, పళ్లపై గార ఏర్పడడం లాంటి సమస్యలు రావచ్చని దంతవైద్యులు చెబుతున్నారు.

హార్ట్ ప్రాబ్లమ్స్ : కొన్ని అధ్యయనాల ప్రకారం.. రాత్రిళ్లు దంతాలు క్లీన్ చేసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడైంది. అలాగే చిగుళ్ల వాపు, నోటి పరిశుభ్రత కారణంగా సిస్టమిక్ ఇన్‌ఫ్లమేషన్‌, అథెరోస్క్లెరోసిస్‌ వంటి తీవ్రమైన జబ్బులు రావొచ్చు. ముఖ్యంగా రాత్రిపూట బ్రష్ చేసుకునే విషయంలో డయాబెటిస్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువ కావడం వల్ల వైట్ బ్లట్ సెల్స్ బలహీనంగా మారి.. పీరియాంటల్ (గమ్) వ్యాధులు వంటి నోటి ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే డైలీ రెండు సార్లు బ్రష్​ చేయడం అలవాటు చేయాలి. అదేవిధంగా మీరు దీనిని ఫాలో అవ్వాలి. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎటాక్ చేయకుండా కాపాడుకోవచ్చు.

ఎన్ని నెలలకు బ్రష్ మార్చాలి?.. ఎంతసేపు పళ్లు తోముకోవాలి?

పంటి నొప్పితో బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే ఇన్​ఫెక్షన్​కు చెక్!

ABOUT THE AUTHOR

...view details