Brown Rice Health Benefits : మనం తినే అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నాం. ముత్యాల్లా తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యాన్ని తినడమే నాగరికత అని అనుకుంటున్నాం. కానీ అది ఏమాత్రం నిజం కాదు. బియ్యాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల, పైపొరలని విలువైన పోషకాలు అన్నీ తౌడు రూపంలో వృథాగా పోతున్నాయి. దీనివల్ల పాలిష్ పట్టించిన బియ్యంలో పిండి పదార్థాన్ని మాత్రమే మనం తింటున్నాం. అందుకే దంపుడు బియ్యం తినడం అలవాటు చేసుకోవాలి. పాలీష్ పట్టని దంపుడు బియ్యంలో పోషకాలు దండిగా ఉంటాయి. కనుక ఈ దంపుడు బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా బి-విటమిన్ లోపాలను అధిగమించవచ్చు. అలాగే మధుమేహం సమస్యను అదుపు చేయవచ్చని అంటున్నారు వైద్యులు. అందుకే ఈ దంపుడు బియ్యం లేదా బ్రౌన్ రైస్ తినడం వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బ్రౌన్ రైస్ ఎందుకు మంచివంటే?
దంపుడు బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది మొలకెత్తిన బ్రౌన్ రైస్ కూడా తీసుకుంటారు. అయితే బ్రౌన్ రైస్‌ను వండటానికి ముందు కొద్దిసేపు నానబెట్టి, తరవాత వంట పూర్తి చేయాలి. ప్రతి రోజు బ్రౌన్ రైస్ తినడం వల్ల డయాబెటిస్‌ను అదుపులోకి తెచ్చుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరం
దంపుడు బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఇన్సులిన్‌తో వచ్చే చిక్కులు తగ్గుతాయి. అంతేకాదు దంపుడు బియ్యంలో కార్పోహైడ్రేట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చక్కెర శోషణ రేటును నెమ్మదింపజేస్తాయి. ఫలితంగా చక్కెర వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.