Brown Eggs Vs White Eggs : ఆరోగ్యకరమైన, అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారాలలో గుడ్లు ప్రధానమైనవి. అయితే మార్కెట్లో తెల్లని పెంకు కలిగిన ఫారం గుడ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అదే ఇంకాస్త పెద్ద మార్కెట్, సూపర్ బజార్ వంటి వాటికి వెళ్తే అక్కడ మనకు వైట్ ఎగ్స్‌తో పాటు.. ముదురు గోధుమ రంగులో(బ్రౌన్) ఉండేవి కనిపిస్తాయి. అప్పుడే ఏ రంగు గుడ్లు తీసుకోవాలనే విషయంలో అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో చాలా మంది వ్యక్తులు బ్రౌన్ రైస్, బ్రౌన్ షుగర్, బ్రౌన్ బెడ్ లాగా.. వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ ఆరోగ్యకరమైనవి అని భావిస్తారు. ఇంకొందరు మాత్రం వైట్ ఎగ్స్(Eggs)లోనే పోషకాలు ఎక్కువ అని వాటిని తీసుకుంటారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏవి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? అసలు బ్రౌన్ ఎగ్స్ రంగుకు కారణాలేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Difference Between White and Brown Eggs : మనం తీసుకునే ఆహార పదార్థాలలో గుడ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వాటిని సూపర్ ఫుడ్‌గా అభివర్ణిస్తారు. అయితే మార్కెట్లో లభించే వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్.. ఈ రెండింటిలో ఏది తిన్నా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు పోషకాహార నిపుణలు. కోడి జాతులను బట్టి అవి పెట్టే గుడ్ల రంగు ఆధారపడి ఉంటుంది. అండలూసియన్, వైట్ లైఘోర్న్ అనే జాతులు వైట్ ఎగ్స్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. అలాగే గోల్డెన్ కామెట్, రోడ్ ఐలాండ్ రెడ్, గోల్డ్ చికెన్ వంటివి.. బ్రౌన్ రంగు పెంకులతో గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా నీలం, ఆకుపచ్చ రంగులో గుడ్లను ఉత్పత్తి చేసే కోడి జాతులు కూడా ఉన్నాయి. కాకపోతే వీటి సంఖ్య చాలా తక్కువ. బ్రౌన్ ఎగ్స్‌లో ఉండే ప్రోటోపోర్ఫిరిన్ అనే పర్ణద్రవ్యం ఉంటుంది. దాని కారణంగా వాటికి ఎరుపు రంగు వస్తుంది.
Health Benefits Of Eggs in Telugu : కోడిగుడ్డు.. అందానికీ, ఆరోగ్యానికీ వెరీ గుడ్డు!
బ్రౌన్ ఎగ్స్ రంగుకు కారణమిదే..కోడి పెరిగిన వాతావరణం, అది తిన్న ఆహారం, ఒత్తిడి స్థాయిలు వంటివి కోడిగుడ్డు పెంకు రంగుపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఎక్కువ మందిలో వైట్ ఎగ్స్ కన్నా.. బ్రౌన్ ఎగ్స్(Brown Eggs) ఎక్కువ నాణ్యతను కలిగి ఉంటాయని అనుకుంటారు. ఎందుకంటే మార్కెట్లో తెల్ల గుడ్లతో పోలిస్తే బ్రౌన్ రంగు గుడ్ల ధర అధికంగా ఉంటుంది. దీంతో ధర అధికం కాబట్టి చాలామంది బ్రౌన్ ఎగ్స్ నాణ్యత కూడా ఎక్కువ అని భావిస్తారు. అయితే.. ఇది నిజం కాదనే విషయం గమనించాలి. ఎందుకంటే.. బ్రౌన్ ఎగ్స్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అందుకే వాటి ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ కోళ్లను పెంచడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఆ ఖర్చును కవర్ చేయడానికి అవి పెట్టే గుడ్లను ఎక్కువ రేటుకు విక్రయిస్తూ ఉంటారు. బ్రౌన్ ఎగ్స్ పెట్టే కోళ్లు సైజులో చిన్నగా ఉంటాయి. ఒక రంగు తప్ప మిగతా పోషకాలన్నీ వైట్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్‌లో సమానంగా ఉంటాయి.