చనుబాలు సంపూర్ణ ఆహారం. శిశువులకు ఇవే అత్యుత్తమ ఆహారం. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ తల్లిపాలలో సమతూకంలో ఉంటాయి. తేలికగానూ జీర్ణమవుతాయి. కాన్పు తర్వాత మొదటి రెండు, మూడు రోజుల్లో వచ్చే ముర్రుపాలైతే అమృతంతో సమానం. భావి ఆరోగ్యానికి తొలి బీజం వేసేవి ఇవే. వీటిని తొలి టీకా అనీ అనుకోవచ్చు. చిక్కగా, కాస్త పసుపుపచ్చ రంగులో ఉండే ముర్రుపాలలో ఇమ్యునోగ్లోబులిన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తి పెంపొందటానికి తోడ్పడతాయి. ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. ఐదారు రోజులకు పాలు కాస్త పలుచబడినప్పటికీ వీటిల్లో కొవ్వులు, లాక్టోజ్ దండిగా ఉంటాయి. ఇవి బిడ్డకు మరింత శక్తినిస్తాయి. రెండు వారాల సమయంలో పాలు పరిపక్వ దశకు చేరుకుంటాయి. ఇందులో 90% నీరు.. 8% పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు.. 2% ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా బిడ్డ అవసరాలకు అనుగుణంగా మారిపోయే తల్లిపాలను మించిన ఆహారం మరేముంటుంది? అదీ అతి శుభ్రంగా, ఎలాంటి ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటే ఇక చెప్పేదేముంది? అందువల్ల వీటి గొప్పతనం తెలుసుకొని, మసలుకోవటం ఎంతైనా అవసరం.
సహజంగా, సిద్ధంగా..
తల్లిపాలు ఎప్పుడంటే అప్పుడు సహజ సిద్ధంగా, తగు ఉష్ణోగ్రతలో అందుబాటులో ఉంటాయి. చాలా సురక్షితం. అదే పోతపాలైతే కలుపుకోవటం, వేడి చేసుకోవటం, సీసా శుభ్రం చేసుకోవటం వంటి ఇబ్బందులెన్నో ఉంటాయి. సీసా, పాల పీక సరిగా శుభ్రం చేయకపోతే బిడ్డకు విరేచనాలు, వాంతుల వంటి జబ్బులూ పట్టుకుంటాయి. చనుబాలతో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. తల్లిపాలతో శిశు మరణాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
మొదటి గంటలోనే
సహజ కాన్పు అయినా, సిజేరియన్ కాన్పు అయినా పుట్టిన తొలిగంటలోనే శిశువుకు తల్లిపాలు పట్టించటం అత్యవసరం. గ్లూకోజు నీళ్లు, తేనె, ప్యాకెట్ పాలు, ఆవుపాలు నాకించటం వంటివేవీ చేయొద్దు. మనదేశంలో కేవలం 44% మంది శిశువులే పుట్టిన తొలిగంటలో తల్లిపాలకు నోచుకుంటున్నారు. తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన లేకపోవటమే దీనికి కారణం. ఏవైనా సమస్యలతో శిశువును ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చినా తల్లిపాలను పిండి తాగించటానికే ప్రయత్నించాలి.
- శిశువుకు తొలి ఆరు నెలల్లో తల్లిపాలు తప్ప ఇతరత్రా ఎలాంటి ఆహారమూ ఇవ్వకూడదు. ఎండకాలమైనా నీళ్లు తాగించాల్సిన అవసరమూ లేదు. ఆరు నెలల తర్వాత ఉగ్గు, పండ్ల గుజ్జు, ఘనాహారం వంటివి ఆరంభించినా రెండేళ్ల వయసు వచ్చేవరకూ తల్లిపాలు పట్టటం అవసరం.
- ఉద్యోగాలకు వెళ్లే మహిళలైతే చనుబాలను పిండి ఇంట్లో భద్రపరచుకోవచ్చు.
సరిపోవని అనుకోవద్దు
తల్లి రొమ్ముకు బిడ్డ పెదాలు తాకగానే చనుబాలు రావటం ఆరంభమవుతుంది. కాన్పయిన వెంటనే కొన్ని చుక్కల పాలే వచ్చినా క్రమంగా పుంజుకుంటాయి. పుట్టినప్పుడు శిశువు జీర్ణాశయం చిన్నగానే ఉంటుంది. ఒక మిల్లీలీటరు ముర్రుపాలు తాగినా సరిపోతాయి. క్రమంగా జీర్ణాశయం పెద్దగా అవుతూ వస్తుంది. తల్లికీ పాలు ఎక్కువవుతూ వస్తాయి. కొందరు పాలు సరిపోవటం లేదని భావిస్తుంటారు. ఇది కేవలం అపోహే. ఆరు నెలల వరకు బిడ్డ అవసరాలకు సరిపడిన పాలు తప్పకుండా వస్తాయి. బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటూ.. హాయిగా నిద్రపోతూ.. మూత్రం మామూలుగా వస్తుంటే పాలు సరిపోతున్నట్టే. పాలు పడితే వస్తాయి, పట్టకపోతే రావనే సంగతిని గుర్తించాలి.
మంచి పోషకాహారం, తగినన్ని ద్రవాలు తీసుకుంటే పాలు బాగా పడతాయి. బాదం, జీడి పప్పుల వంటి గింజపప్పులు.. కూరగాయలు.. ప్రొటీన్లు దండిగా ఉండే పప్పులు, చిక్కుళ్లు ఎక్కువగా తినాలి. మాంసాహారులైతే గుడ్డు, చేపలు తినొచ్చు. పాలు పట్టటానికి 10 నిమిషాల ముందు ద్రవాలు తీసుకుంటే పాలు ఎక్కువగా రావటానికి వీలుంటుంది. ఇవన్నీ చేసినా పాలు అంతగా రావటం లేదని అనిపిస్తే విటమిన్లు, ఖనిజాల మాత్రల వంటివి అవసరమవుతాయి. వీటితోనూ ఫలితం కనిపించకపోతేనే పోత పాల గురించి ఆలోచించాలి.
ఎప్పుడు పట్టాలి?