నెలసరి సమయంలో రెండు రోజులే రక్తస్రావమైనా కంగారు పడాల్సిన పని లేదు. ఒక మనిషితో పోలిస్తే మరో మనిషిలో కొన్ని లక్షణాలు భిన్నంగా ఉండటం అత్యంత సహజం. కాబట్టి టెన్షన్ పడొద్దు. అయితే నెలసరికి ముందు తలనొప్పి, చిరాకుగా ఉంటోందని రాశారు. పోషకాహారం తీసుకోకపోవడం వల్లా ఇలా జరగొచ్చు. ముఖ్యంగా విటమిన్-బి12, బి6 లోపం ఉంటే ఇలా జరుగుతుంది. కాబట్టి మీరు మల్టీ విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీ సమస్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది.
రక్త స్రావం రెండు రోజులే అవుతోందా! - periods
నెలసరి క్రమం తప్పకుండా వచ్చినా కొందరిలో రక్తస్రావం మాత్రం రెండ్రోజులే అవుతుంది. ఆ సమయంలో చాలా నీరసంగా ఉంటుంది. కొంత మందిలో చిరాకు, కోపం కూడా వస్తుంది. ఐతే ఇది అనారోగ్యానికి సంకేతం కాదని, పోషకాహారం తీసుకోకపోవడం వల్లే ఇలా జరగొచ్చని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ అనగాని మంజుల అన్నారు.
నెలసరికి ముందు చిరాకు, కోపంగా ఉండటం.. లాంటి లక్షణాలు ప్రీ మెన్సుస్ట్రువల్ సిండ్రోమ్‌లో కనిపిస్తాయి. అతి తక్కువ సందర్భాల్లో హార్మోన్లలో అసమతుల్యం వల్ల కూడా ఇలా జరగొచ్చు. సాధారణంగా అయితే పోషకాహార లోపంవల్ల ఇలా జరుగుతుంది. అయితే పోషకాహారం తీసుకున్నా ఒక్కోసారి కొన్ని రకాల మూలకాలను శరీరం గ్రహించదు. అప్పుడు సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరోసారి పోషకాహార నిపుణుల్ని సంప్రదించి మీ సమస్యను వివరించండి. వారు తగిన పరీక్షలు చేసి ఏం చేయాలో చెబుతారు. అప్పుడు సమస్య అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.
- డాక్టర్ అనగాని మంజుల, గైనకాలజిస్టు