How to keep Children away from smartphones :ఇప్పుడంతా టెక్నాలజీ యుగం.. స్మార్ట్ఫోన్ అనే చిన్న పరికరం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాంతో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్ను ఉపయోగిస్తున్నారు. ఇదే అలవాటు పిల్లలకు కూడా వస్తోంది. ఈ క్రమంలో నేటి జనరేషన్ పిల్లలు స్మార్ట్ఫోన్(Smart Phone) లేకుండా అరక్షణం గడపలేని పరిస్థితి ఏర్పడింది. వారి చేతిలో ఫోన్ ఉంటే చాలు ఎలాంటి ఆట వస్తువులతో పని లేదు.. అమ్మ పక్కనుందో లేదో కూడా చూసుకోకుండా.. వీడియోలు చూస్తూ కాలం వెళ్లదిస్తుంటారు. ఇలా వాడడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
Best Tips to keep Your Child Away from Mobiles :ముఖ్యంగా ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చొని ఫోన్ను యూజ్ చేయడం ద్వారా చిన్న వయసులోనే పిల్లలు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు టీవీ లేదా ఫోన్ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువనే తినేస్తారు. ఈ కారణంగా పిల్లల్లో భవిష్యత్తులో మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి ఎలా అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తున్నారా? ఇప్పటికైనా ఆలస్యం కాలేదు.. మీ పిల్లలు మీ చేతిలోనే ఉన్నారు.. మేము చెప్పే ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. వారిని ఈజీగా ఫోన్ల నుంచి దూరంగా పెట్టొచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ముందు మీరు మానేయండి..పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లలు అనుకరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి వారి ముందు తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ఫోన్లు వాడటం, టీవీలు చూడటం మానుకోవాలి. వాళ్లతో మాట్లాడటం, ఆడుకోవడం, కబుర్లు చెప్తూ ఉంటే పిల్లలు కూడా అదే విధానం కొనసాగిస్తారు.
ప్రత్యామ్నాయం ఆలోచించండి..చాలా మంది పిల్లలు కాస్త అల్లరి చేయగానే, ఏడుపు ఆపడానికి ఫోన్ ఇస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని పిల్లల్లో ఏడ్చి మరీ ఫోన్ తీసుకోవాలనే ఆలోచనా ధోరణి పెరుగుతుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. పిల్లలు ఏడ్చినా, అలిగినా వారికి ఏం కావాలో అడిగి తెలుసుకోవాలి. వారితో కాసేపు ప్రేమగా మాట్లాడాలి.
ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి..ఒకవేళ మీ పిల్లలకు ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే.. వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు పిల్లలు అల్లరి చేయరు. మొబైల్ ఫోన్ గురించి ఆలోచించరు. అప్పుడు తిండిపైనే ధ్యాస పెడతారు. ఆ టైమ్లో మీరు కూడా ఫోన్ లేకుండా వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటలు ఎలా ఉన్నాయో అడగండి. సరదాగా నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ గడిపితే స్మార్ట్ఫోన్ ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు.