How to Scope Stress at School Education :ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు పనుల బిజీతో.. పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. దీంతో.. తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య తెలియకుండానే "దూరం" పెరిగిపోతోంది. ఫలితంగా.. అభశుభం తెలియని చిన్నారులు తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. చదువుల ఒత్తిడి(Mental Stress)తో పాటు.. పలురకాల ప్రెషర్స్.. వాళ్ల చిట్టి బుర్రలను కొరికేస్తున్నాయి. ఈ పరిస్థితి ముదిరిపోయి.. చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. చివరకు కొందరు ఆత్మహత్య సైతం చేసుకుంటున్నారు.
Students How to avoid Mental Stress: హోంవర్క్, స్కూల్‌వర్క్, పరీక్షలు అంటూ.. పిల్లలు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇటు తల్లిదండ్రులు తీరికలేని పనుల్లో మునిగిపోవడంతో.. వారికి కుటుంబంతో క్వాలిటీ టైమ్ దొరకట్లేదు. వారిని మానసికంగా కావాల్సిన మద్ధతు లభించట్లేదు. దీంతో.. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడిపోతున్నారు చిన్నారులు. ఈ నేపథ్యంలో.. పిల్లలు ఒత్తిడి(Student Stress)ని జయించేందుకు.. మానసిక నిపుణులు కొన్ని పద్ధతులను సూచిస్తున్నారు. వీటి ద్వారా.. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి.. తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టే అవకాసం ఉంటుందని అంటున్నారు. మరి, అవేంటో.. ఇందుకోసం తల్లిదండ్రులు ఏం చేయాలో చూద్దాం.
నివారణ:మీ పిల్లలు ఎప్పుడూ మూడీగా ఉంటే.. మనసులో ఏదో ఆందోళన ఉందన్న విషయం ముందుగా మీరు అర్థం చేసుకోండి. అదేంటో.. మెల్లగా అడిగి తెలుసుకోండి. చిరాకు పడడం.. తిట్టడం ద్వారా.. వాళ్లు మరింతగా ముడుచుకుపోయే ప్రమాదం ఉంది. అందువల్ల బుజ్జగింపు ధోరణిలో వారి సమస్య తెలుసుకొని.. మీకు తెలిసిన రీతిలో పరిష్కారం చూపండి. "నీకు ఏ సమస్య వచ్చినా.. నేనున్నా" అని ధైర్యం చెప్పండి. ఇలా.. ఒత్తిడిని నివారించే ప్రయత్నం చేయండి.
ఆలోచనలో మార్పు : ఒత్తిడి ఎదుర్కొనే వారు.. ప్రతీ విషయంలోనూ నెగెటివ్ కోణాన్నే ముందుగా చూస్తారు. ప్రతీ సమస్యను భూతద్ధంలో చూస్తారు. ఈ పద్ధతిని మార్చుకోవాలని సూచించండి. ఎలా మార్చుకోవాలో కూడా మీ అనుభవంతో చెప్పండి. మీరు ఎదుర్కొన్న పలు సమస్యలు చెప్పి.. వాటి నుంచి ఎలా బయటపడ్డారో చెప్పండి. జీవితంలో సమస్యలు సాధారణం అని అర్థం చేయించండి.
అంగీకరించడం :నిత్య జీవితంలో కొంత ఒత్తిడి సహజమనే వాస్తవాన్ని తెలియజెప్పండి. స్కూల్లో చదువుల విషయంలో కొంత ఒత్తిడి ఉంటుందని చెప్పండి. ఒక శిల్పం ఎన్ని ఉలి దెబ్బలు తింటుందో తెలుసా..? ఒక ఆయుధం ఎలాంటి నిప్పుల్లో కాలుతుందో తెలుసా..? అంటూ.. మనల్ని మనం మార్చుకునే క్రమంలో కొంత ఒత్తిడి సాధారణం అని ఆలోచింపజేసేలా చెప్పండి.
వెంటనే స్పందించండి :పాఠశాలలో కొందరు టీచర్ల ప్రవర్తనతో.. పిల్లలు భయంతోకూడిన ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. లేదా మరేదైనా కారణంతో ఆందోళ చెందుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు వెంటనే స్పందించి.. మీరు స్వయంగా వెళ్లి, మీ పిల్లల సమక్షంలోనే వారితో మాట్లాడండి. సమస్యను పరిష్కరించండి. ఇలా చేస్తే.. పిల్లల్లో రిలీఫ్ అవుతారు. వారి కోసం మీరు ఏదైనా చేస్తారనే నమ్మకం కలుగుతుంది.