Best Tips for Teaching Kids to Brush :"తిండి తింటే కండ కలదోయ్.. కండ కలవాడే మనిషోయ్" అన్నది కవి వాక్కు. మరి ఆ తిండి తినాలంటే.. ఎవరి దంతాలైనా దృఢంగా ఉండాలి. చిగుళ్లు బలంగా ఉండాలి. కాబట్టి మనం దంతాలను కాపాడుకుంటేనే.. అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే.. చిన్న పిల్లల్లో దంత సమస్యలు(Teeth Problems) ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి వారికి చిన్నప్పట్నుంచే నోటి శుభ్రత గురించి తెలియజేయటం.. దంతాలను శుభ్రం చేసుకునే పద్ధతులు నేర్పించటం చాలా అవసరం. ఎందుకంటే పెద్దవారికంటే చిన్న పిల్లలు పళ్లు త్వరగా పాడవుతాయి. అలాకాకుండా ఉండడానికి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పళ్లు తోమేటప్పుడు..పిల్లలు పళ్లు తోమేటప్పుడు వారి దగ్గరే ఉండి సరైన విధంగా దంతాలు తోముకునేలా చూడాలి. అలాగే పేస్టు ఎక్కువగా పెట్టకుండా కొద్దిగా మాత్రమే పెట్టి అన్ని వైపులా బ్రష్ చేయాలి. దీని వల్ల దంతాలన్నింటిపైనా ఉన్న మరకలు తగ్గి.. దంత సమస్య రాకుండా ఉంటుంది.
రాత్రిళ్లు తోమడం..పెద్దవారు చాలా మంది ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్ చేస్తారు. పిల్లలూ అదేవిధంగా పళ్లు తోమేలా చూడాలి. ముఖ్యంగా రాత్రి పూట భోజనం తర్వాత దంతాలు క్లీన్ చేసుకునేలా అలవాటు చేయాలి. అలాగే.. స్వీట్స్, అన్నం తిన్న వెంటనే దంతాలు శుభ్రం చేసుకునేలా చూడాలి. లేదంటే పిల్లల పళ్లు త్వరగా పాడైపోతాయి. వారు తినే ఆహార పదార్థాల అవశేషాలు దంతాలకు అతుక్కుని అవి పుచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఎప్పటికప్పుడు చిన్నపిల్లలు పళ్లు క్లీన్గా ఉంచుకునేలా చూడడం ముఖ్యం.