Best Foods To Reduce Muscle Cramps : మన శరీరం బలంగా ఉందంటే దానికి కారణం.. మన కండరాలు బలంగా ఉండటమే. మన బలానికి కారణమయ్యే కండరాలు కొన్ని పోషకాల వల్ల మరింత దృఢంగా తయారవుతాయి. అయితే సరైన పోషకాలుఅందకపోతే ఈ కండరాలు పట్టేస్తుంటాయి. మరీ ముఖ్యంగా కాళ్ల కండరాలు పట్టేస్తుంటాయి. వైద్య పరిభాషలో దీనిని కండరాల కొంకర్లు అంటారు. కండరాల కొంకర్లకు గల కారణాలు ఏమిటి? ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు? అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాల కొంకర్లు ఎందుకు వస్తాయంటే..
కండరాలకు తగినంత రక్త సరఫరా లేకపోతే.. కండరాల కొంకర్లు లేదా కండరాలు పట్టేయడం అనే సమస్య తలెత్తుందని వైద్యులు చెబుతున్నారు. రక్త సరఫరా బాగుండాలంటే.. సరైన పోషకాహారం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అంటే ఈ సమస్యకు అసలు కారణం పోషకాహార లోపం అని మనం గుర్తించవచ్చు.
కండరాల కొంకర్ల సమస్యకు పరిష్కారం..
కండరాల కొంకర్ల సమస్యతో బాధపడేవారు.. పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీంతోపాటు కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
"కండరాలకు రక్తం సరఫరా తగినంత స్థాయిలో లేకపోవడం వల్ల 'కండరాలు పట్టేయడం' అనే సమస్య ఏర్పడుతుంది. దీనిని నివారించేందుకు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా అరటి పండు, చిలగడదుంప, ఆకుకూరలను క్రమం తప్పకుండా తినాలి."
- డాక్టర్ మధులిక, ప్రముఖ న్యూట్రిషనిస్ట్