యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా..
జ్ఞాపకశక్తిని పెంపొందించే గుణం టమాటాలకు ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఉండే 'లైకోపీన్' అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. అలాగే ఎవరైతే రోజూ టమాటాల్ని ఆహారంలో భాగంగా తింటారో వారి మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఒకవేళ మీకు రోజూ టమాటాతో చేసిన కూరలు తినడం బోర్‌గా అనిపిస్తే.. టమాటా సూప్, సలాడ్స్, ఆమ్లెట్.. ఇలా రకరకాలుగా ప్రయత్నించవచ్చు.
జ్ఞాపకశక్తిని పెంచడానికి ఉపయోగపడే మరో పదార్థం ఉల్లి. ఇందులో ఉండే ఆంథోసయనిన్, క్వెర్సెటిన్.. అనే రెండు యాంటీఆక్సిడెంట్లే దీనికి కారణం. కాబట్టి కూరల్లో వేసిన ఉల్లిని తీసి పక్కన పెట్టకుండా కనీసం ఇప్పటినుంచైనా వాటిని తినడం అలవాటు చేసుకోండి.
నీటిస్థాయులు తగ్గకుండా..
శరీరంలో నీటిస్థాయి క్రమంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు, పండ్ల రసాలు తాగడం ఉత్తమం. రోజూ ఇలా చేయడం వల్ల శరీరానికి డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాకుండా ఉంటుంది. ఫలితంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.
గ్రీన్ టీ
ఆరోగ్యాన్నివ్వడంలోనే కాదు.. జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడే పానీయం గ్రీన్ టీ. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి రోజూ కనీసం మూడు కప్పుల గ్రీన్‌టీ తాగితే అటు శరీర ఆరోగ్యానికి, ఇటు మెదడు పనితీరుకీ చాలా మంచిది.
డ్రైఫ్రూట్స్..
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే వాల్‌నట్స్, చేపలు.. మొదలైన ఆహార పదార్థాలు జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అలాగే ఈ ఆమ్లాలు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిట్టర్స్ పనితీరును మెరుగుపరిచి మెదడుకు రక్షణనిస్తాయి. మెదడులోని రక్తనాళాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ని సరఫరా చేయడంలోనూ ఇవి తోడ్పడతాయి. వాల్‌నట్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ బి6, మెగ్నీషియం.. మెదడును సురక్షితంగా ఉంచడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. కాబట్టి రోజూ వీటిని తినడం మంచిది.
బాదంపప్పులో ఒమేగా-3, 6 ఫ్యాటీ ఆమ్లాలు, ‘బి6’, ‘ఇ’ విటమిన్లు అధికంగా లభిస్తాయి. ఇవి కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి చక్కగా ఉపకరిస్తాయి. కాబట్టి ఐదారు బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొందరు శరీరంలో కొవ్వు పెరుగుతుందేమోనని భ్రమపడుతుంటారు. కానీ అలాంటి సమస్యలేవీ ఉండవు.
ఆకుకూరలు..
ఆకుకూరలు కేవలం కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే కాదు.. మెదడు చురుగ్గా పని చేయడంలోనూ సహాయపడతాయి. ఇందులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం ఆలోచనాశక్తిని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే వీటిలో ఉండే మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ ఇ, కె.. మొదలైనవన్నీ మెదడుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడతాయి. కాబట్టి ఆకుకూరల్ని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.
అలాగే బీట్‌రూట్ కేవలం శరీరంలో రక్తాన్ని పెంచడంలోనే కాదు.. మెదడుకు సరిపడా రక్తాన్ని సరఫరా చేయడంలో కూడా తోడ్పడుతుంది. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.