ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో చాలామంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. పని హడావుడిలో పడి శరీరానికి ఏం కావాలో, ఏం చేస్తే ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటామో అనే విషయాన్ని మర్చిపోతున్నారు. నిజానికి శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందించడం వ్యాయామం చేస్తే మనిషి మరో 10 ఏళ్లు ఎక్కువ బతకొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన శరీరం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే దానికి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. ఇలాంటి ఆహారాన్ని వైద్య పరిభాషలో సమతుల ఆహారం అని అంటారు. సమతుల ఆహారంతో పాటు శరీరానికి తగిన నీటిని అందించాల్సిన అవసరం ఉంది. సగటున రోజుకు మనిషికి 2 వేల క్యాలరీల శక్తి అవసరం. ఇది వయసు, లింగం, శారీరక శ్రమను బట్టి మారుతూ ఉంటుంది.
సాధారణంగా ఆడవాళ్ల కన్నా మగవారికి ఎక్కువ శక్తి అవసరం. గర్భిణీలు, బాలింతలకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం అవసరం. అయితే వ్యాయామం చేసే వారికి ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. కాబట్టి మనం చేసే పని, అలవాట్లను బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నివారించడం సహా పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చు.
సమతుల ఆహారం తీసుకున్నప్పుడు శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపించడానికి శరీరానికి సమతుల ఆహారం అందించడం తప్పనిసరి. శరీరానికి ఫైబర్, కార్బోహైడ్రేట్లు అందించాలి. షుగర్‌ని నియంత్రించే శక్తి ఉన్న చిరుధాన్యాలను, ప్రొటీన్లు కలిగిన సోయా, పనీర్, బీన్స్, చేపలు, చికెన్ లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. రోజుకు కనీసం ఒక పండును తినేందుకు ప్రయత్నించాలి. తాజా కూరగాయలు, ఫ్రూట్ సలాడ్స్‌ను తినాలి. శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్ కోసం అవకాడో, పీనట్స్, నట్స్ లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి.